27, జూన్ 2010, ఆదివారం

ప్రణాళిక-క్రమశిక్షణ



మనం నిర్దేశించుకున్న పనిని వెంటనే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెట్టడం సరైన పద్ధతే... కానీ, దానివల్ల విజయవంతంగా అ పనిని పూర్తిచేయలేకపోవచ్చు. కాస్త ఆలస్యమైనా చక్కటి ప్రణాళిక వేసుకుని , క్రమశిక్షణతో చేసినప్ప్పుడు పని ఎంత క్లిష్టమైనా సునాయాసంగా పూర్తవుతుందనేది వాస్తవం.
ఓ ప్రముఖుడి జీవితంలోని కొన్నిఘట్టాలను పరిశీలిద్దాం. ఆయన ఒకసారి తన స్వగ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శించి, విద్యార్ధులకు మిఠాయిలు కొనిపెట్టమని ఉపాధ్యాయునికి డబ్బునిచ్చాడు. కానీ ఆ ఉపాధ్యాయుడు, " విద్యార్ధులకు మీ విలువైన సందేశమివ్వండి." అని విజ్ఞప్తి చేశాడు. అప్పటికి ఏవో నాలుగు మాటలు చెప్పినా ఆ ప్రముఖుడికి సంతృప్తి కలుగలేదు. ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రసంగించాల్సి వచ్చినందుకు బాధపడ్డాడు. కొద్దిరోజుల తర్వాత మళ్ళీ అదే పాఠశాలకు వచ్చి ఎంతో ఉత్సాహంగా ప్రసంగించి వెళ్ళాడు. అప్పుడు ఆయన చక్కటి ప్రణాళికతో ప్రసంగానికి సిద్ధమై వచ్చాడు మరి!
1947 లో ఈయన అఖిల భారత ఉత్పత్తిదారుల సంఘానికి అధ్యక్షుడిగా ఓ కార్యక్రమంలో ప్రసంగించాల్సి వచ్చింది. విడిదిగృహంలో తెల్లవారుఝామున నాలుగు గంటలకే లేచి స్నానం ఆచరించి, చక్కటి వస్త్రధారణతో ఆ రోజు చెప్పబోయే ప్రసంగాన్ని చదువుకోసాగాడు. అదే విడిదిలో ఉన్న ఇతర ప్రముఖులు ఆయన క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధమైన ఆచరణను గమనించి ఎంతో ఆశ్చర్యపోయారు.
చక్కటి ప్రణాళిక వేసి క్రమశిక్షణతో పూర్తిచేయడం కేవలం ప్రసంగాలకే పరిమితం కాదు. అసాధ్యం అనుకున్న ఎన్నో నిర్మాణాలను అవలీలగా పూర్తి చేయించిన ఘనుడాయన. కృష్ణరాజసాగర్ ఆనకట్ట, గంధపుతైలం-గంధపుసబ్బు పరిశ్రమలు, భద్రావతి ఇనుము-ఉక్కు పరిశ్రమ, మైసూర్ విశ్వవిద్యాలయం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్,... లాంటి ప్రతిష్టాత్మక సంస్థలకు ఆద్యుడాయనే! కర్ణాటక రాష్ట్రం పారిశ్రామికంగా ముందుకు వెళ్ళడానికి కారణం ఆ ప్రముఖుడి ప్రణాళికాబద్దమైన కృషే. తన 102 సంవత్సరాల వయస్సులో ఏనాడుకూడా క్రమశిక్షణ తప్పని ఉత్తమవ్యక్తి, మహామనిషి. ఆయనెవరో కాదు... అందరూ గౌరవంగా ’సర్ ఎం.వి.’ అని పిలుచుకునే ప్రపంచ ప్రఖ్యాత ఇంజినీర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య.
ఇంతకీ ప్రణాళిక లేకుండా ఏ పనీ చేయలేమా? చేయొచ్చు... కానీ, అది మార్గం తెలియని ప్రయాణం లాంటిది. గమ్యానికి ఎంతో ఆలస్యంగా చేరుతాము. ఒక సాధారణ ఇంజినీర్ 60 సంవత్సరాలలో చేయించగలిగిన పనిని ’సర్ ఎం.వి.’ 6 సంవత్సరాలలోనే సాధించాడు. దీనికి కారణం చక్కటి ప్రణాళికను అనుసరించడమే! ప్రణాళికను చిత్తశుద్ధితో అమలు పరిచేందుకు అవసరమైన అంశం... క్రమశిక్షణతో పనిని నిర్వర్తించడం. క్రమశిక్షణ మనలోని శక్తిసామర్ధ్యాలను వెలికి తీస్తుంది. ఎప్పటికప్పుడు పనులను పూర్తిచేయించి మానసికఒత్తిడి లేకుండా చేస్తుంది. ఫలితంగా క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు చక్కటి శారీరక ఆరోగ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ’సర్. ఎం.వి.’ రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉండేవారు.
మరి మీలో ఎంత క్రమశిక్షణ ఉంది? ఒక్క అంశానికైనా ప్రణాళికను తయారు చేసుకుంటున్నారా? పాఠశాలలో బోధింపబడ్డ అంశాలు ఏరోజుకారోజు చదవడం ఉత్తమమైన ప్రణాళిక. మరి మీరు దాన్ని ఆచరిస్తున్నారా? పరీక్షల ముందు మాత్రమే చదివితే ఒత్తిడి తప్ప ఫలితముండదు. ప్రణాళిక ప్రకారం చదివేవ్యక్తులు పాఠ్యాంశాలను అవలీలగా పూర్తిచేయడమేగాక, ఆసక్తి ఉన్న ఇతర అంశాలలో కూడా ప్రావీణ్యం సంపాదిస్తారు. ఎలాంటి ప్రణాళిక లేని వ్యక్తి క్రికెట్ మ్యాచ్ లను వీక్షించడానికి, స్నేహితులతో వ్యర్ధప్రసంగాలకు,.. సమయాన్ని వృధా చేసుకుని పరీక్షలొచ్చాక చింతిస్తాడు.
కేవలం పాఠ్యాంశాలకే కాదు, దైనందిన కార్యక్రమాలను కూడా ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తూ క్రమశిక్షణను అందిపుచ్చుకోండి. అది మీ శారీరక, మానసిక ఆరోగ్యంలో మార్పు తెచ్చి మిమ్ములను గొప్పవారిని చేస్తుంది.

ఈగలమోత

పూర్వం లలాటరాజ్యాన్ని విచిత్రసేనుడు పాలిస్తుండేవాడు. ఒకసారి అతనికో సమస్య వచ్చింది. గుంపులు గుంపులుగా వచ్చిన ఈగలు సభలో తీవ్ర అసౌకర్యాన్ని కలిగించసాగాయి. ఝుమ్మని మోత చేస్తూ సభికులు, రాజు మొహంపై వాలసాగాయి. ఎంత తోలినా తిరిగి వచ్చేవి. కొంతమంది మాట్లాడేటప్పుడు నోటిగుండా పొట్టలోకి జారుకునేవి. వాటి దెబ్బకు అందరూ గగ్గోలు పెట్టారు. పరిష్కారం చూపమని రాజును వేడుకున్నారు. సేవకులు వింజామరలతో వీస్తున్నా అది విచిత్రసేనుడికి ఉపశమనం మాత్రమే కలిగిస్తోంది. అంతఃపురంలోని రాజపరివారమంతా ఈగల వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోసాగారు.
వంద ఈగల్ని చంపితే ఒక బంగారు వరహాను బహుమతిగా ప్రకటించాడు విచిత్రసేనుడు. అది కూడా సరైన ఫలితం ఇవ్వలేదు. పనీపాట లేని వాళ్ళు తప్ప ఇతరులు ఈగల్ని చంపడానికి ఆసక్తి చూపలేదు. దాంతో.... ’ కోటనుంచి ఈగల్ని తక్షణమే తరమగలిగిన వారికి లక్షవరహాలు బహుమతి ఇవ్వబడుతుంద’ ని దండోరా వేయించాడు.
మరుసటిరోజు కిరీటి అనే యువకుడు సభకు వచ్చాడు. ఈగల్ని తరిమేందుకు సిద్ధంగా ఉన్న సంగతి విచిత్రసేనుడికి తెలియపరిచాడు. "నీవు ఏం చేసినా, ఎలా చేసినా... ఈగలమోత మాత్రం ఇక వినపడకూడదు. నీ పనిని ప్రారంభించు." అని రాజు ఆదేశించాడు. సభలోంచి బయటకు వెళ్ళిన కిరీటి ఓ అర్ధగంట తర్వాత తిరిగివచ్చాడు. అతను వచ్చిన కొద్దిసేపటికే ఈగలన్నీ బయటకు జారుకున్నాయి. సభలో ఒక్కటి కూడా లేదు! రాజు, సభికులు ఆనందం, ఆశ్చ్యర్యం కలగలిపిన ముఖాలతో ఉన్నారు.
" ఏం మంత్రం వేశావు? లేక ఏదైనా మాయ చేశావా?" విచిత్రసేనుడు అడిగాడు.
" ఇందులో మాయమంత్రాలు ఏమీలేవు... ఏదో నాకున్న కాస్త లోకజ్ఞానఫలితం" వినయంగా అన్నాడు కిరీటి.
" ఎలా చేసినా పెద్ద ఇబ్బందిని తొలిగించావు. ఇవిగో లక్ష వరహాలు.." అంటూ ధనం మూటను ఇవ్వబోయాడు విచిత్రసేనుడు.
" రాజా.. మీ బహుమతిని స్వీకరించలేకపోతున్నందుకు నన్ను క్షమించండి. ఈగలు మళ్ళీ కోటలోకి వచ్చి గతంలో లాగానే మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. ప్రస్తుతం నేను వాటిని కోట బయటికి మాత్రమే తీసుకెళ్ళగలిగాను. నాది శాశ్వతమైన పరిష్కారం కాదు."
" ఇంతకీ ఏం చేశావు?" గద్దించి అడిగాడు విచిత్రసేనుడు.
" పెద్ద బెల్లం ముద్దను కోట బయట ఉంచి వచ్చాను. దాంతో ఈగలన్నీ బెల్లం చుట్టూ చేరాయి. ఆ ముద్దను పూర్తిగా జుర్రుకోగానే కోటలోకి రావడం ఖాయం."
ఆ మాటలు వినగానే విచిత్రసేనుడికి కోపం తారాస్థాయికి చేరింది.
" మేము కోరింది శాశ్వతపరిష్కారం, ఇలాంటి చిట్కాలు కాదు. సమయం వృధా చేస్తే నీకు కారాగారశిక్ష తప్పదు." ఉచ్ఛస్థాయి గొంతుతో చెప్పాడు.
" శాశ్వతపరిష్కారం మీదగ్గరే ఉంది. విచక్షణ లేని ప్రజలు రాజ్యాన్ని చెత్తకుప్పలు, ఎరువుదిబ్బలుగా మార్చారు. వాటివల్ల పెరిగిన ఈగలు ఎన్నో రోజులనుంది ప్రజల ఆరోగ్యంతో ఆడుకోసాగాయి. పలుసార్లు మీ దృష్టికి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వాటి ప్రభావం అంతఃపురానికి పాకిందనే దండోరా విన్నప్పుడు సమస్య పరిష్కారమవుతుందని సంతోషించాం. రాజ్యపరిస్థితిని పూర్తిగా తెలిపేందుకే వచ్చానుకాని, బహుమతి కోసం కాదు." వివరంగా చెప్పాడు కిరీటి.
విచిత్రసేనుడికి జ్ఞానోదయమైంది. మూలకారణాన్ని తొలగించాలేగాని, ఉపశమనచర్యల వల్ల సమస్య పరిష్కారం కాదని గ్రహించాడు. కిరీటిని మంత్రిగా నియమించుకుని రాజ్యాన్ని సుందరంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే పనిని అప్పగించాడు.

13, జూన్ 2010, ఆదివారం

ఇంగితజ్ఞానం

18, మే 2010, మంగళవారం

మిఠాయి దొంగ



సత్యవోలు గ్రామంలోని పాపయ్యశెట్టికి మిఠాయి దుకాణం ఉంది. స్వచ్ఛమైన నేతితో చేసే అక్కడి తినుబండారాలంటే చుట్టుపక్కల గ్రామాల వారు పడిచస్తారు. వ్యాపారం బాగా జోరు మీదున్న సమయంలో వంటమనిషి అస్వస్థతకు గురయ్యాడు. దాంతోపనివారు అవసరమయ్యారు.. వంట బాగా వచ్చి వినయంగా ఉండేవారికోసం వెతికాడు పాపయ్యశెట్టి. ఎంతోమంది ఆయనదగ్గర పనిచేసేందుకు ఉత్సాహపడ్డారు... కానీ సురుచు, సుమతి అనే వారిని మాత్రమే ఎంచుకున్నాడాయన.
ప్రతిరోజూ ఉదయాన్నే వచ్చి మధ్యాహ్నం వరకు రకరకాల మిఠాయిలు చేసి వెళుతుండేవారు. వారి క్రమశిక్షణ, వంటలో నైపుణ్యం పాపయ్యశెట్టికి తెగ నచ్చాయి. నమ్మకమైనవారు, పనిమంతులు దొరికారని ఎంతో సంతోషించారాయన. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. తను ఇస్తోన్న వెచ్చాలకు, తయారవుతున్న మిఠాయిలకు పొంతన కుదరడంలేదు. ఒక్కోరోజు ఒక్కో మిఠాయి పరిమాణం తగ్గిపోతోంది. ఈ విషయాన్ని పసిగట్టిన పాపయ్యశెట్టికి ఏం చేయాలో పాలుపోలేదు. ఇద్దరిలో మిఠాయిదొంగ ఎవరో గుర్తించలేకపోయాడు. ఎంత జాగ్రత్తగా పరిశీలించినా లాభం లేకపోయింది! ఇరువురిలో ఒకరు లిప్తపాటు సమయంలోనే నేతిమిఠాయిల్ని చప్పరించేస్తున్నారని ఊహించాడు.
దొంగను ఏవిధంగా కనిపెట్టాలో అర్థం కాలేదు. తనకొచ్చిన సమస్యను ఆ రోజే గురుకులం నించి ఇంటికొచ్చిన కుమారుడు వసంతుడికి చెప్పాడు. కాసేపు తీక్షణంగా ఆలోచించిన వసంతుడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. దానిని తండ్రి చెవిలో ఊదాడు.
ఆ ఆలోచనను మరుసటిరోజే అమలుచేశాడు పాపయ్యశెట్టి. మధ్యాహ్నం వరకు పనిచేసి ఇంటికి పోయేముందు సురిచి, సుమతి లను ఆపి," ఈ రోజు మా ఇంట్లో చిన్నవేడుక జరిగింది. విందు ఏర్పాటు చేశాం, మీరు తప్పక భోంచేసి వెళ్ళాలి." అన్నాడు. ఇద్దరూ ’సరే’ నంటూ తలలూపారు. శెట్టి గారి కుటుంబసభ్యులతో కలిసి ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. పలురకాల వంటలతో షడ్రసోపేతమైన విందు వడ్డించబడింది. పనిచేసి బాగా అలిసిపోయిన సుమతి ఆవురావురుమంటూ తినసాగాడు. సురిచి మాత్రం మెల్లగా తింటున్నాడు. అప్పటికే అతని పొట్ట సగంపైగా మిఠాయిలతో నిండిఉండండంతో విందు రుచించడంలేదు. సుమతి మాత్రం మళ్ళీ మళ్ళీ వడ్డించుకుని తిని ’బ్రేవ్’ మని త్రేన్చాడు. సురుచి విస్తరిలోని పదార్ధాల్లో సగం మాత్రమే తినగలిగాడు.
పాపయ్యశెట్టి, వసంతుదు భోంచేస్తూ వారిద్దరినీ ఓరకంట పరిశీలించారు. మిఠాయిదొంగ ఎవరో అర్థమైపోయింది. క్రమశిక్షణ లేని సురుచి తన జిహ్వచాపల్యానికి తగిన మూల్యం చెల్లించాడు. శెట్టి అతణ్ణి పని మాన్పించాడు.
తెలివైన సలహా ఇచ్చినందుకు వసంతుడు తండ్రి దగ్గరినించి అభినందనలు అందుకున్నాడు.

14, ఏప్రిల్ 2010, బుధవారం

పిల్లి ఇక్కట్లు



పూర్వం పిల్లి తన సోదరుడు పులితో కలిసి అడవిలోనే ఉండేది. పులి తను వేటాడి తెచ్చిన ఆహారంలో పిల్లికి వాటా ఇస్తుండేది. జీవితం సాఫీగా గడిచిపోతున్నా... సోమరితనం పెరుగుతోందనే భావన, ఇతరులపై ఆధారపడుతున్నాననే ఆత్మన్యూనత పిల్లిని బాధిస్తూఉండేవి. దాని పరిస్థితి ఇలా ఉంటే ఊర్లోని మనిషి స్థితి మరోరకంగా ఉంది. ఎలుకలు విపరీతంగా పెరిగి ఒక్క గింజ కూడా మిగల్చకుండా పంటను తినేస్తున్నాయి. వాటి దెబ్బకు పస్తులు ఉండాల్సివస్తోంది. ఎలుకలను పట్టేందుకు ఊర్లోని ఏ జంతువూ సుముఖంగా లేవు. ఎందుకంటే ఎలుకలు వాటికి వాటా ఇస్తున్నాయి మరి!
కొత్త జంతువు నొకదాన్ని తెచ్చి ఎలుకల అంతు చూడాలని నిర్ణయించుకున్నాడు మనిషి. ఆ పని కొరకు అడవిలోకి వెళ్ళాడు. కోతి, కొండముచ్చు, ఎలుగు, పాము, నెమలి, .. ఇలా ఎన్నో తారసపడ్డాయి. వాటిలో కొన్ని ఊర్లోకి రావడానికి సుముఖత చూపలేదు. వస్తామన్న వాటి మాటతీరు, ప్రవర్తన మనిషికి నచ్చలేదు. దట్టమైన అడవిలోకి వెళ్ళాడు. సంభాషిస్తూ వస్తోన్న పులి, పిల్లి ఎదురయ్యాయి. ఆ రెండింటినీ గ్రామానికి ఆహ్వానించాడు మనిషి. " రాజులా బ్రతుకుతున్న నన్ను కాపలాకుక్కగా మారుద్దామనుకుంటున్నావా? నీ అంతు చూస్తా, ఇక్కణ్ణించి మర్యాదగా వెళ్ళిపో" అని పులి గాండ్రించింది.
పిల్లి మాత్రం, " అన్నయ్యా.. అడవిలోనే ఉండి విసుగు పుట్టింది, కొంతకాలం అతనితో ఉండి వస్తా..." అని పులిని బ్రతిమాలింది. పులికి కూడా పిల్లి వెళ్తాననడం ఆనందం కలిగించేదే! ప్రతిరోజూ దానికి ఆహారంలో వాటా ఇవ్వాల్సిరావడం ఇబ్బందిగా ఉంది. మనసులో సంతోషంగా ఉన్నా పైకి బాధ నటిస్తూ, " నీ కోరికను కాదనడం భావ్యం కాదు. కానీ, నువ్వు కొంతకాలమే అక్కడ గడిపి తిరిగి రావాలి. అలా అని నాకు మాటివ్వు..." అని చేయి చాపింది.
పులి నుంచి సెలవు తీసుకున్న పిల్లి మనిషి వెంట దారితీసింది. దారిలో తన నివాసం, ఆహారం, ఇతర స్థితిగతులు గురించి ఆరాతీసింది. " నీకెలాంటి లోటు రాదు, నిన్ను మా కుటుంబసభ్యునిగా చూసుకుంటాము. ఇష్టమైనన్ని ఎలుకలు తినొచ్చు, వాటిని తిని మొహం మొత్తినప్పుడు చక్కగా పాలు, పెరుగును ఆస్వాదించొచ్చు. ఈ అడవిలో బిక్కుబిక్కుమంటూ ఉండడం కంటే మా ప్రేమాభిమానాల మధ్య ఉండడం నీకెంతో సంతోషానిస్తుంది. నువ్వే చూస్తావుగా మ అతిథిమర్యాదలు?" అంటూ మనిషి దాని అనుమానాలు పటాపంచలు చేశాడు.
ఊరికి చేరిన పిల్లి ఎలుకల వేటలో నిమగ్నమయ్యింది. కడుపునిండా ఆహారం, కంటి నిండా నిద్రతో చాలా సంతోషంగా ఉంది. మధ్య మధ్యలో మనిషి ఇస్తోన్న పాలు, పెరుగు అమిత సంతృప్తిని కలిగిస్తున్నాయి.
కొంత కాలం గడిచింది. ఎలుకల సంఖ్య బాగా తగ్గింది. గాదెల నిండా ధాన్యంతో మనిషి సంతోషంగా ఉన్నాడు. పిల్లికి వేటలో ఎలుకలు సమృద్ధిగా దొరకడం లేదు, దాంతో రోజూ మనిషి దానికి పాలు, పెరుగు పెట్టాల్సివస్తోంది. అది అతనికి ఇబ్బందిగా మారింది. అవసరం తీరాక అనవసరపు ఖర్చు అనుకున్నాడు. ఒక రాత్రి పూట పిల్లిని వీధిలోకి గిరాటేశాడు.
పాపం.. అది నిర్ఘాంతపోయింది. మనిషి చేసిన అవమానం తీవ్ర వేదనను మిగిల్చింది. తిరిగి అడవికి వెళదామంటే మనసొప్పలేదు. అడవిలోని జంతువులు గేలి చేస్తాయని భయపడింది. కష్టమో, నష్టమో ఊర్లోనే ఉండి బ్రతకాలని నిర్ణయించుకుంది. ఇక అది మొదలు..... ఆహారానికై నిరంతరం కష్టపడుతూనే ఉందది. అడపాదడపా దొరికే ఎలుకలను విందుభోజనంలా తింటూ.. పాలు, పెరుగుకై రోజూ ఏదో ఒక ఇంట్లో దూరడం ప్రారంభించింది. మనిషి జాలి పడితే ఆహారం, కోపగిస్తే కర్రదెబ్బలు దొరుకుతున్నాయి దానికి.
బ్రతుకు దినదినగండమై, కృశించి పులి లాంటి దాని శరీర పరిమాణం నేడు మనం చూస్తోన్న స్థితికి చేరింది. ఈ దీనావస్థ నుంచి దానికి విముక్తి ఎప్పుడో?

7, ఏప్రిల్ 2010, బుధవారం

సెలవుల్లో ఇలా చేయొచ్చు




ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల కాగితాలు వినియోగమవుతున్నాయి. వాడిన అనంతరం వీటిలో చాలా వరకు చెత్తబుట్టలో చేరేవే! చెత్తలో చేరిన ఈ కాగితాల్లో ఓ పది శాతం మాత్రమే పునర్వినియోగమవుతున్నాయి. మిగిలినవి కుళ్ళిపోవడమో, దహనం కావడమో జరుగుతోంది. కాగితం తయారీ ఎంతో శ్రమతో కూడుకున్నది. కలప, నీరు ఎంతో అవసరమవుతాయి. ఒక కాగితం తయారీకి రెండు గ్లాసుల నీరు అవసరం. మనం ఒక కాగితాన్ని నిర్లక్ష్యంగా చించి వీధిలో పడేశామంటే చెట్టు కొమ్మను నరికినట్లే! పర్యావరణ పరంగా ఇంతటి కీలక ప్రాధాన్యత కలిగి ఉన్న కాగిత వినియోగానికి సంబంధించి ఈ సెలవుల్లో చేయగలిగే ఒక కృత్యాన్ని చూద్దాం.
దినపత్రికలు, పాత నోట్ పుస్తకాల లాంటి వాటిని సేకరించే వారికి అమ్ముతాం. కానీ చినిగిన కాగితాలు, ఉత్తరాల కవర్లు ( ఎన్వలప్స్) , ఆహ్వానపత్రికలు... లాంటి వాటిని మాత్రం చెత్తలో కలిపేస్తాం. వీటిని వృధాగా పడేయకుండా పునర్వినియోగం (రీ సైకిల్) చేయొచ్చు. పాస్టిక్ పూత లేని ఇలాంటి కాగితాలను తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించాలి. పాత్ర లేదా బకెట్ తీసుకుని తగినంత నీరు పోసి అందులో ఈ ముక్కలను ఒక రోజంతా నానబెట్టాలి. మరుసటిరోజు గమనిస్తే కాగితం ముక్కలన్నీ అతి చిన్న భాగాలుగా విడిపోయి ఉంటాయి. వాటినన్నిటిని చేత్తో బాగా పిసికి గుజ్జు తయారు చేయాలి. ఇక్కడ మనకో సాధనం అవసరమవుతుంది. అది చతురస్ర లేదా దీర్ఘచతురస్రకారంలో ఉన్న ఇనుపజాలీ ( వైర్ మెష్) అది మన లాంగ్ నోట్ బుక్ కంటే కాస్త పెద్దదిగా ఉండి చుట్టూ ఇనుపబద్దీ అంచు కలిగిఉండాలి. దానిని నేలపై పెట్టి కాగితపు గుజ్జును సమంగా, కాస్త మందంగా పూయాలి. నీరంతా మెల్లగా కారిపోతుంది. మిగిలిపోయిన కొద్దిపాటి నీటిని తీసివేసేందుకు దానిపై పాత వార్తాపత్రిక గాని, గుడ్డకాని ఉంచి ఒత్తాలి.
తర్వాత ఆ ఇనుపజాలీని ఎండలోకి తీసుకెళ్ళి బోర్లించి మెల్లగా కాగితపుగుజ్జును వేరు చేయాలి. మిగిలిన నీరంతా ఆవిరయ్యేంతవరకూ ఆరబెట్టాలి. ఆరిపోయేటప్పుడు అంచులు ముడుచుకోకుండా వాటిపై తగిన భారాలనుంచాలి. ఈ విధంగా పూర్తిగా నీరంతా పోయాక పునర్వినియోగ కాగితం మనకు లభిస్తుంది. గుజ్జు చేసేటప్పుడే రంగులు కాని, ఎండిన ఆకులు-పూల రెమ్మల లాంటివి వేస్తే మరింత ఆకర్షణీయంగా తయారవుతుంది. గట్టిదనం కోసం గుజ్జులో సహజమైన జిగురు( వేప, తుమ్మ జిగురు లాంటివి) ను కలుపవచ్చు. దీనిపై నచ్చిన చిత్రాన్ని వేసో, అతికించుకునో గోడకు తగిలించుకోవచ్చు. కాస్త కళాత్మకంగా వ్యవహరించి ఫోటో ఫ్రేమ్స్, గ్రీటింగ్స్ కార్డ్స్,... లాంటివి తయారుచేయొచ్చు. పెన్సిల్ ను నునుపు చేయగా వచ్చే పొట్టును కూడా వాటిపై అందంగా అతికించుకుని కళాఖండంలా మార్చవచ్చు.
ఒక్కసారి చేసి చూడండి, అది మనకెంత సంతృప్తినిస్తుందో! ఇలాంటి కృత్యాల ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు చేసినవారవుతారు. మీరు తయారుచేసినవి పలువురికి స్పూర్తినిస్తే మరింత మేలు జరుగుతుంది. కొన్ని కంపెనీలు తమ ప్యాకేజింగ్ లో పునర్వినియోగ కాగితాలను వాడుతున్నాయి. అలాంటి వాటిని గమనించండి. అలాగే పలురకాల ఆకారాల్లోకి పునర్వినియోగ కాగితాన్ని మలిచేందుకు ప్రయత్నించండి.

25, మార్చి 2010, గురువారం

చీమల తెలివి



ఒక చీమల కుటుంబం తమ పుట్టలోపల సంభాషిస్తూ భోజనం చేస్తున్నాయి. హటాత్తుగా ఒక ఎలుక వాటి నివాసం లోకి వచ్చింది. చీమలు సంభాషణ ఆపాయి. అనుమతి లేకుండా వచ్చినందుకు కోపంగా ఉన్నా, అతిథి ధర్మాన్ని పాటించి " అన్నయ్యా... ఇలా చెప్పాపెట్టకుండా వచ్చావేమిటి? కాస్త కబురందించినా నీకొరకు ప్రత్యేకవంట చేసేవారం కదా! అయినా నీ మర్యాదకు లోటేం లేదులే... భోంచేద్దువురా..." అని ఆప్యాయంగా పిలిచియాయవి.
ధాన్యం మేసేటప్పుడు రైతు గమనించి తరిమితే పారిపోతూ పుట్టలోకి దూరిందా ఎలుక! కానీ, ఆ విషయాలేమీ చెప్పకుండా, "పర్లేదులే.... మీరెలాఉన్నారో చూద్దామనే వచ్చాను. మీరంతా క్షేమంగానే ఉన్నారు కదా?" అని కుశల ప్రశ్నలు వేసింది. అలా మాట్లాడుతూనే భోజనానికి కూర్చుంది. చీమలు బియ్యం పాయసం, గోధుమ రొట్టెలు, పెసరపప్పు వడ్డించాయి. ఆ పదార్ధాలు చూసి ఎలుక మతిపోయింది. తను ఏనాడూ అలాంటివి తినలేదు. ఏవో నాలుగు గింజలు తినడం, నీళ్ళతో నోరు తడుపుకోవడమే తనకు తెలుసు. చీమల వైభోగానికి కళ్ళుకుట్టాయి. చుట్టూ పరికించి చూసింది. రకరకాల గదులుగా ఉంది నివాసం. ఓ మూలన సేకరించిన ధాన్యపుగింజలు, పప్పులు, పంచదార పలుకులు రాశులుగా పోసి ఉన్నాయి. అదంతా చూడగానే ఎలుకకు గుడ్డపేలికలు, ధాన్యపు నూక , తవుడు నిండి ఉండే తన నివాసం గుర్తొచ్చింది.
చీమల నివాసాన్ని స్వంతం చేసుకోవాలనే దుర్బుద్ధి పుట్టింది. చేతులు కడుక్కుంటూ, " మీ ఆతిథ్యం ఎంతో నచ్చింది. అయితే ఇంత పెద్ద నివాసం మీకు అనవసరం. నాలాంటి పెద్దమనుషులు ఉండడానికి తగినదిది. వెంటనే మీరంతా ఈ చోటును ఖాళీ చేసి ఇంకో తావు వెతుక్కోండి." మెల్లగా చెప్పినా దాని కంఠంలో అహంకారం ధ్వనించింది.
యువచీమలకు ఆ మాటలు ఆగ్రహాన్ని తెప్పించాయి. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే దుష్టులను వదలకూడదనుకున్నాయి. సర్పాలలాంటివే తమ దెబ్బకు తోక ముడిచిన సంఘటనలు జ్ఞప్తికొచ్చాయి. ఎలుకపై దాడి చేయాలనుకుంటున్న వాటి ఆలోచనను వృద్ధచీమలు పసిగట్టి, ఓర్పుతో ఉండాలని సూచించాయి.
అన్నిటికంటే పెద్దచీమ మాట్లాడుతూ, "నువ్వుంటానంటే వెంటనే ఖాళీ చేయకుండా ఉంటామా? నీ కంటే ఆప్తులు ఎవరున్నారు?! అయితే ఒక్కమాట... ఇక్కడికి అతిదగ్గరలోనే మా పాత నివాసమొకటుంది, దానిని కూడా చూడు. ఈ రెండింటిలో నీకేది నచ్చితే దానిలో ఉందువు, మిగిలిన దాంట్లో మేముంటాం" అని వినయంగా చెప్పింది. దాని ఉపాయమేంటో తెలిసిన మిగిలిన చీమలు నిశ్శబ్దమయ్యాయి.
చీమల వినయం ఎలుకకు ముచ్చటగాఉంది. బలవంతం చేయకుండానే ఒప్పుకున్నందుకు సంతోషంగా ఉంది. " అలాగా... అది ఎక్కడుందో చూపండి.." గర్వంగా నవ్వుతూ అడిగింది. చీమలన్నీ బయటికి వచ్చి కొంతదూరం నడిచి కనుచూపుమేరలో కనబడుతున్న ఒక పుట్టను చూపాయి.
’ నువ్వైతే వేగంగా వెళ్ళిరాగలవు. ఒక్కడివే వెళ్ళి చూసి వచ్చి నిర్ణయం చెప్పు.’ అని ఎలుకను సాగనంపాయి.
ఆత్రుతతో పరుగు పరుగున వెళ్ళి పుట్టలోకి దూరింది ఎలుక. లోపల నిశ్శబ్దంగా ఉంది. కళ్ళు కాస్త చీకటికి అలవాటు పడ్డాక తేరిపారా చూసిన ఎలుక గుండె గుభేల్మంది. ఓ మూల నిద్రిస్తోన్న త్రాచుపాము కనిపించింది. కంగారులో వచ్చిన దారిని మరచిన ఎలుక అటూ ఇటూ పరుగులు పెట్టింది. ఆ చప్పుడుకు లేచిన త్రాచుకు ఎలుకను చూడగానే ఆకలి ముంచుకొచ్చింది. పడగ విప్పి ఎలుకపై దూకింది. అదృష్టవశాత్తు.... వచ్చినదారి అప్పుడే కనిపించి ఎలుకపరుగందుకుంది. అయితే దాని తోక మాత్రం పాము నోటికి చిక్కి తెగిపోయింది. ’తోక పోతే పోయింది, ప్రాణం మిగిలింది’ అనుకుంటూ పరుగు ఆపకుండా తన నివాసానికి వచ్చింది ఎలుక.
ఇంకెన్నడూ చీమలవైపు కన్నెత్తి చూడలేదు. తనకంటే చిన్నవాటి పట్ల చులకనభావాన్ని ప్రదర్శించలేదు.

19, మార్చి 2010, శుక్రవారం

ధైర్యవంతుడు



నందవరంలో ఉండే కార్తీక్ ఆరవతరగతి చదువుతున్నాడు. తనంత ధైర్యస్థుడు ఎవరూ లేరని స్నేహితులవద్ద బీరాలు పలుకుతుండేవాడు. పాఠశాల ప్రక్కనే చుప్పనాతి సూరయ్య పొలం ఉంది. విద్యార్ధుల దృష్టి ఎప్పుడూ ఆ పొలంలో విరగకాసి ఉండే రెండు మామిడి చెట్లపై ఉండేది. అవి పూత పెట్టినప్పటినుంచి కాపు అయిపోయేంతవరకూ ఒక కంట వాటిని కనిపెట్టి , వీలును బట్టి కోసుకునేవారు. అయితే ఆ ప్రయత్నాలలో సూరయ్య చేతులకు చిక్కి తిట్లు తిన్నవారే అధికం.
ఒక్క కాయ కోసుకురావడమే కష్టమైతే, ఒడి నిండా దూసుకుతెస్తానని కార్తీక్ స్నేహితులతో పందెం కాశాడు. సూరయ్యకు దొరికిపోతే ఓడినట్లే! సాయంత్రం బడి సమయం పూర్తయ్యాక పుస్తకాలు ఇంట్లో పెట్టి... పొలం వైపు దౌడు తీసాడు. పందెం వేసిన స్నేహితులు బడి వద్ద ఉన్నారు. వారికి చేతులు ఊపి మెల్లగా చేలోకి వెళ్ళాడు. కార్తీక్ ఇలా పోవడం, మరో వైపు నుంచి సూరయ్య పొలంలోకి వెళుతుండడం గమనించారు విద్యార్ధులు. కార్తీక్ కు తిట్లు తప్పవని గ్రహించి, సూరయ్యకు కనిపించకుండా తమ ఇళ్ళకు బయలుదేరారు.
శీతాకాలం కావడంతో త్వరగా చల్లబడుతోంది. కార్తీక్ వడివడిగా మామిడిచెట్టు వద్దకు చేరి పైకి ఎగబ్రాకాడు. చెట్టు నిండా ఉన్న పళ్ళలో అక్కడక్కడా అరమగ్గినవి ఉన్నాయి. వాటిని వెతికి కోసి నిక్కరు జేబుల్లో నింపుకున్నాడు. అతనా ప్రయత్నంలో ఉండగానే చెట్టు క్రింద కాస్త అలికిడి అయ్యింది. క్రిందకు చూసిన కార్తీక్ ఖంగుతిన్నాడు. చుట్ట త్రాగుతూ సూరయ్య కనిపించాడు. అతను పైకి చూస్తే తనకు తిప్పలు తప్పవని గ్రహించి మెల్లగా ఆకులు గుంపుగా ఉన్న భాగానికి చేరుకున్నాడు. అక్కడ సూరయ్యకు కనిపించనని నిర్ధారించుకున్నాడు.
ఓ పది నిమిషాలు గడిచింది. ఆకులు తొలగించి చూసిన కార్తీక్ కు అక్కడే ఉన్న సూరయ్య కనిపించాడు.గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. పూర్తిగా చీకటి పడింది. మళ్ళీ ఆకుల చాటు నుంచి తొంగిచూసాడు. తెల్లటి చొక్కా, పంచె లతో ఆకారం కనిపించింది. తను క్రిందికి వచ్చేదాకా సూరయ్య అక్కణ్ణించి కదలడని అర్ధమైంది. చలి పెరుగుతోంది....... అర్ధరాత్రి వేల మళ్ళీ చూసిన కార్తీక్ కు సూరయ్య ఆకారం అలాగే కనిపించింది. క్రిందకు దిగలేని పరిస్థితి... ఉందామంటే అపరిమితమైన చలి! తెల్లవారేవరకు ఉండక తప్పదని నిర్ణయించుకుని కళ్ళు మూసుకున్నాడు. ఎప్పుడో తెల్లవారుఝామున నిద్రపట్టింది.
ఉదయం సూర్యకిరణాలు వెచ్చగా తాకాక మెలకువ వచ్చింది. అదే భయంతో కళ్ళు తెరచి ఆకులు జరిపి చూశాడు. పంచె, చొక్కా వేసిన దిష్టిబొమ్మ కనిపించింది. దాని తలపై కుండ బోర్లించిఉంది. ఆ కుండపై కళ్ళు, ముక్కు లాగా సున్నపుబొట్లు పెట్టి ఉన్నాయి. ఓ ప్రక్క ఆశ్చర్యం, మరోపక్క సిగ్గేసింది. మెల్లగా చెట్టు దిగి ఆ బొమ్మను చూసి నవ్వుకున్నాడు కార్తీక్. సూరయ్య ఆ బొమ్మను పెట్టేందుకే చెట్టు క్రిందకు వచ్చాడని గ్రహించాడు. ఇంటివైపు నడుస్తూ... ’ ఇంకెన్నడూ ఇతరులను పిరికివాళ్ళుగా, తనను ధైర్యవంతునిగా చెప్పుకోకూడదనుకున్నాడు.

18, మార్చి 2010, గురువారం

పొడి ఉంగరం




ఉత్కళరాజ్యానికి సైనికుల కొరత ఏర్పడింది. అత్యవసరంగా సైనికుల ఎంపిక చేసుకుంటేనే పొంచిఉన్న శత్రురాజులను ధీటుగా ఎదుర్కోవచ్చు. ఒక రోజు.. మహారాజు మంజునాధుడు సేనాని జ్ఞానవర్మను పిలిచి " సైనిక నియామకం చేపట్టండి. కొద్దిరోజుల్లోనే సైనికశక్తి పూర్వం కంటే అధికం కావాలి. అలాగే సైనికులకు కేవలం కండబలమే గాక బుద్ధిబలం కూడా ఉండేలా ఎంపిక చేయండి." అని సూచించాడు.
అంగీకరించిన జ్ఞానవర్మ తక్షణమే ఆ పనిలో నిమగ్నమయ్యాడు. అభ్యర్ధులందరినీ రాజధానికి పిలిచే బదులు, తానే గ్రామాల్లో పర్యటించి మెరికల్లాంటి వారిని గుర్తించాలని నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజూ కొన్ని గ్రామాలు తిరుగుతూ చురుకైన, తెలివైనవారిని సైనికులుగా తీసుకోసాగాడు.
ఆ పనిలో భాగంగానే... ఒకనాడు శ్రీపతిపురానికి వెళ్ళాడు. రచ్చబండ వద్ద ప్రజలందరినీ సమావేశపరిచి తన పర్యటన ఉద్దేశ్యం తెలియపరిచాడు. సైన్యంలో కొలువు అనగానే యువకులు ఎగిరి గంతేశారు. పరుగుపందెం, బరువులెత్తడం, మల్లయుద్ధం,... ఇలా పలు శారీరక పరీక్షల్లో పదిమంది యువకులు చక్కటి ప్రతిభను చూపారు.
వారిని వరుసగా నిల్చోబెట్టి, " అన్ని పరీక్షల్లోనూ మీరు గెలిచారు. అయితే చివరగా ఓ సమస్యను మీ ముందు ఉంచుతాను. తమ తెలివితో పరిష్కారం చూపినవారికి కొలువు ఖాయం! మిగతావారు నిరాశ చెందాల్సిన పనిలేదు. వారిని గ్రామరక్షణ కొరకు నియమిస్తాం." అని సమస్య చెప్పడం ప్రారంభించాడు జ్ఞానవర్మ.
" మీ ముందు ఉంచుతున్న ఈ నిండు నీటి పళ్ళెంలో మునిగి ఉన్న ఉంగరాన్ని మీ చేతుల్తో తీయాలి. అయితే నీటి తడి ఏ మాత్రం మీ చేతికి అంటకూడదు. ఉంగరాన్ని తీసేందుకు ఏ వస్తువునూ వాడరాదు, పళ్ళెంను అసలు ముట్టుకోకూడదు. ప్రయత్నించి సఫలమైనవారే విజేత."
అభ్యర్ధుల ముందు పళ్ళెం నిండా నీరు, అందులో ఒక ఉంగరం ఉంచబడింది. పదిమందికీ రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. అయితే పళ్ళేన్ని తాకకుండా, వేరే వస్తువు వాడకుండా ఉంగరమెలా తీయాలో పాలుపోవడం లేదు.
ఆ పదిమందిలోని వర్ధన్ అనే యువకుదు కాసేపు తీవ్రంగా ఆలోచించాక మెరుపులాంటి ఉపాయమొకటి తట్టింది. జ్ఞానవర్మ అనుమతి తీసుకొని వెళ్ళి కొద్ది నిమిషాల్లో ఓ మోపు వంటచెరుకును తీసుకువచ్చాడు. వాటిని పళ్ళెంకు కాస్తదూరంలో గుండ్రంగా అమర్చి మంట పెట్టాడు. వంటచెరుకు కాలుతున్నప్పుడు ఆ వేడికి మధ్యలో ఉన్న పళ్ళెంలోని నీరు కొంచెం కొంచెం ఆవిరి కావడం మొదలుపెట్టింది. పూర్తిగా కాలిపోయే సమయానికి నీరు మొత్తం మాయమై పళ్ళెంలో పొడి ఉంగరం మిగిలింది. దానిని తీసి జ్ఞానవర్మకు అందించాడు వర్ధన్ .
గ్రామస్తులంతా అతని తెలివికి ఆశ్చర్యపోయారు. చప్పట్లతో అభినందనలు తెలిపారు. జ్ఞానవర్మకూడా ఎంతో సంతోషించి వర్ధన్ కు సైనికుడిగా కొలువిస్తున్నట్లు ప్రకటించాడు. మిగతా తొమ్మిదిమందిని గ్రామరక్షణ సభ్యులుగా నియమించాడు.

15, మార్చి 2010, సోమవారం

సూర్యచంద్రులు



విరాటపురం మహారాజు విచిత్రగుప్తుడు ’ తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్ళు’ అని హఠం చేసే వ్యక్తి, మూర్ఖశిఖామణి! ఒకరోజు రాత్రి ఆయన ఉద్యానవనంలో సంచరిస్తున్నాడు. ఆకాశంలో వెన్నెల వెండివర్షం కురిపిస్తున్నట్లుంది. చందమామను తదేకంగా చూసిన మహారాజుకు ఎంతో అసూయ కలిగింది. ’ చంద్రుడు తనకంటే ఉన్నతుడి’లా తోచాడు. తక్షణమే సూర్యుడు, నక్షత్రాలు కూడా తన తల పైనే ఉంటారనే విషయం జ్ఞప్తికి వచ్చింది. తన సింహాసనం కంటే ఎత్తులో వారుండడం అవమానంగా తోచింది ఆయనకు.
మరుసటిరోజు సభలో... మహామంత్రి మాధవవర్మతో, " మహామంత్రీ... ఈ ప్రపంచంలో నాకంటే ఉన్నతులున్నారా?" అని ప్రశ్నించాడు. రాజు మొండితనం, మూర్ఖత్వం తెలిసినవాడు కాబట్టి "ఎవరూ లేరు ప్రభూ.." వినయంగా చెప్పాడు మాధవవర్మ.
" ఉన్నతులుగా నటిస్తున్నవారు ఉన్నారు.. నీకు తెలుసా?"
" ఎవరు ప్రభూ ఆ దుర్మార్గులు.. వారికి శిరచ్ఛేదం విధిద్దాం, వారెవరో సెలవివ్వండి" కోపం ప్రదర్శిస్తూ అన్నాడు మాధవవర్మ.
" వారెవరో కాదు మహామంత్రీ.... సూర్యుడు,చంద్రుడు,నక్షత్రాలు. తక్షణం వారు ఆకాశం వీడి వచ్చి నాకు క్షమాపణలు చెబితే సరి. లేకుంతే వారిపై దండయాత్ర చేద్దాం. క్షమాపణలు చెప్పిస్తారో.. యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేస్తారో రెండు దినాల్లో తేల్చుకునిరండి. నా మనస్సు అవమానభారంతో రగిలిపోతోంది" అంటూ సభలోంచి విసవిసా అంతఃపురంలోకి వెళ్ళాడు విచిత్రగుప్తుడు.
సభికులతోపాటు మాధవర్మ, విదూషకుడు కిరీటి తెల్లముఖం వేశారు. దేశాన్ని, ప్రజల్ని రక్షించే బాధ్యత మాధవవర్మదే అన్నట్లు అంతా ఆయనవైపు తదేకంగా చూశారు.
* *
మరుసటిరోజు సభ ప్రారంభం కాగానే వచ్చాడు మాధవవర్మ. ఆయన వెనకాలే కిరీటి ఉన్నాడు. విచిత్రగుప్తుడికి నమస్కరించి," రాజా... మీ ఆజ్ఞ మేరకు సూర్యచంద్రులు, నక్షత్రాలకు కబురు పంపాము. ’ అల్ప ప్రాణులమైన తమపై దండయాత్ర తగద’ని వేడుకున్నారు. రాబోయే శనివారంనాడు సూర్యుడు, ఆపై ఓ పక్షం రోజుల తర్వాత చంద్రుడు, నక్షత్రాలు ఉద్యానవనంలో మీకు క్షమాపణలు చెబుతామని విన్నవించుకున్నారు. కావున యుద్ధసన్నాహాలు చేయించలేదు." సభికులు మంత్రముగ్ధులై వింటుండగా చెప్పాడు.
వెంటనే కిరీటి అందుకొని," వారి వేడుకోలుకు నేను కూడా సాక్షిని ప్రభూ.... వారు మాట తప్పితే మరుక్షణమే శిక్షించేందుకు యుద్ధానికి సమాయత్తమవుదాం. అప్పటివరకు మీరు శాంతించాలి.." అంటూ విచిత్రగుప్తుడిని చల్లబరిచాడు.
మాధవవర్మ చెప్పిన శనివారం వచ్చింది. ఉద్యానవనంలో సూర్యుడి క్షమాపణకై ఎదురుచూస్తున్న విచిత్రగుప్తుడికి అమితాశ్చర్యం కలిగిస్తూ...... ఆకాశంలో చీకటి కమ్ముకుంది, పక్షులు గూళ్లకు చేరుకోసాగాయి. " సూర్యుడు శరణు కోరేందుకు రాబోతున్నాడు. అయితే తను ప్రాధేయపడడమే మీకు వినబడుతుంది, ఎదురుపడితే మీరు కోపోద్రిక్తులవుతారని తన భయం." మెల్లగా చెప్పాడు మాధవవర్మ.
అతను చెప్పినట్లుగానే," భూపాలా... నన్ను క్షమించు. నీకంటే అల్పుడను, అవసరార్ధం ఆకాశంలో ఉండవలసివచ్చింది. దయచేసి నాపై యుద్ధానికి రాకు." అనే మాటలు వినిపించాయి. విచిత్రగుప్తుడు ఎంతో సంతోషించాడు. కాసేపటికే చీకటి పోయి వెలుతురు వచ్చింది.
అదేవిధంగా పక్షం రోజుల తర్వాత రాత్రి అదే ఉద్యానవనంలో చంద్రుడు, నక్షత్రాలు ఆకాశం నుంచి మాయమై విచిత్రగుప్తుడిని క్షమపణలు కోరారు.
ఈ రెండు సంఘటనల తర్వాత విచిత్రగుప్తుడి కోపమంతా తగ్గిపోయింది. మాధవవర్మ, కిరీటి లను పొగిడాడు. అయితే వారిద్దరు మాత్రం వెంటవెంటనే వచ్చిన సూర్య, చంద్రగ్రహణాలకు ఓ నమస్కారం తెలుపుకోని...... గండం గడిచినందుకు సంతోషించారు. ఆపత్కాలంలో మంచి సలహా ఇచ్చినందుకు మాధవవర్మ కిరీటీని పొగిడితే, కిరీటి మాత్రం ’ఘనతంతా దీనిదే’ అంటూ తన చంకలోని ఖగోళశాస్త్ర పుస్తకాన్ని చూపాడు. దానిలో సూర్యకుటుంబంలోని గ్రహగతులు, సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడే తేదీలు వివరంగా ఉన్నాయి. అది చూసిన మాధవవర్మ " నీ హాస్యంతో సభికులను ఆనందింపజేయడమేగాక, విజ్ఞానం పట్ల నీకున్న ఆసక్తితో ఓ పెద్ద విపత్తు నుంచి రక్షించావు." భుజం తట్టి సంతోషంగా చెప్పాడు.
మూర్ఖరాజు ముందు ముందు ఇంకెవరిమీద యుద్ధాలు చేస్తాడో?

7, మార్చి 2010, ఆదివారం

బాలసాహిత్యం చదువుతున్నారా?

వివిధ దిన, వార, మాసపత్రికలలో ప్రచురితమవుతున్న బాలసాహిత్యంలో కొంతైనా మీరు చదువుతున్నారా? మీకొరకే ఉద్దేశించి వ్రాయబడ్డ కథ, కవిత, గేయం, నాటకం,నవల,.... ల ద్వారా ఎన్నో నూతనవిషయాలు, ఆశ్చ్యర్యానుభూతులను పొందవచ్చు. గొప్ప సృజనాత్మకతతో, సరళమైన భాషతో వ్రాయబడే బాలసాహిత్యం మీ బాల్యాన్ని పరిపూర్ణం చేస్తుంది. మనకు వయసు వచ్చినా మదిలోని బాల్యపు మధురస్మృతులను చెరిగిపోకుండా చేస్తుంది.
కంప్యూటర్ విప్లవాలు, ఎలక్ట్రానిక్ మీడియా విస్తృతంగా వ్యాప్తిచెందని గతకాలంలో చిన్నారులకు సమాజాన్ని పరిచయం చేసింది, జ్ఞానాన్ని కలిగించింది బాలసాహిత్య పత్రికలే! బాల, చిన్నారిలోకం, చందమామ, బాలజ్యోతి, బాలమిత్ర, బాలభారతి, బొమ్మరిల్లు, బుజ్జాయి,... లాంటి పత్రికలు బాలల ప్రపంచాన్ని అందమైన అనుభూతులతో నింపాయి. చిట్టి చిట్టి విజ్ఞానశాస్త్రప్రయోగాలు-మ్యాజిక్ చేయడం,ఏకాంకికలు ప్రదర్శించడం,... లాంటి సానుకూలఫలితాలు కలిగాయి. బాలసాహిత్య పుస్తకం మార్కెట్ లోకి వచ్చిందంటేనే ఎంతో సందడిగా ఉండేది. తలా ఒక పుస్తకం కొని వాటిని మార్చుకుని చదవడం ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేనివి. ఈ మార్పిడితోనే ఒకే అభిరుచి ఉన్నవారు స్నేహితులుగా మారడం జరిగేది.
ప్రస్తుతం మీకు ఇవన్నీ కొత్తగా ఉండొచ్చు... మాకు మాత్రం తియ్యని అనుభూతినిస్తూనే ఉంటాయి. నేడు వేగం పెరిగింది, అస్సలు తీరిక లేకుండా మీరు శ్రమిస్తూ ఉన్నారు. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేస్తున్నామని మీరు మురిసిపోవచ్చు, ర్యాంకుల లక్ష్యాలతో దూసుకుపోవచ్చు! కానీ, వేగమే ప్రధానం కాదు. నిలబడి ఆలోచించే తీరిక కూడా చేసుకోవాలి. మన దైనందిన చర్యలు మన అభివృద్ధికి ఎంతవరకు దోహదపడుతున్నాయో ఆలోచించండి. బాలసాహిత్య పఠనంవల్ల మనకు జరిగే మేలును ఓ సారి పరిశీలిద్దాం.
హితాన్ని(మంచిని) కోరేదే సాహిత్యం. అందులోనూ మీకొరకు వ్రాయబడినదే బాలసాహిత్యం. సరళంగా ఉండి, ఎంతో ఆహ్లాదకరమైన అంశాలతో కూడి మనకు నీతిని బోధిస్తుందది. చిత్రవిచిత్రాలు, ప్రకృతివర్ణనలు, రాజ్యాలు-యుద్ధాలు, సాహసాలు, హాస్యం,... ఇలా ప్రతి అంశమూ మనల్ని ఆలోచింపజేస్తుంది, రంజింపజేస్తుంది! బాలసాహిత్యాన్ని అమితంగా చదివి ఎంతోమంది మీలాంటి చిన్నారులు కూడా రచయితలుగా మారి ’బాలల సాహిత్యాన్ని’ సృజించారు.
సాహిత్యం మన వ్యక్తిత్వాన్ని ఎంతో మార్చుతుంది. ముఖ్యంగా పఠనాభిలాష పెంపొందిస్తుంది. పుస్తకం ప్రాణ స్నేహితుడిగా మారిపోతుంది. ఆ అలవాటు జీవితాంతం మన ఉన్నతికి దోహదపడుతూనే ఉంటుంది. దినపత్రికలు ఒకసారి తిరగేసి చూడండి, మీకోసం ఎన్ని పేజీలు ఎదురు చూస్తున్నాయో తెలుస్తుంది.

2, మార్చి 2010, మంగళవారం

లక్ష్యానికి తగ్గ ప్రణాళిక ఉండాలి:

లక్ష్యాలను ఏర్పరచుకోవడం వాటిని సాధించడంలో పొందే లాభాలను గురించి గతంలో చర్చించుకున్నాము.విజయసాధనలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి, ఎన్నో అనుభవాలు మన స్వంతమవుతాయి. అయితే ఏ లక్ష్యాన్ని సాధించడానికైనా దానిని సులభతరం చేసే ప్రణాళికను రచించుకోవడం ఎంతో అవసరం. ఈ ప్రణాళిక విజయానికి దోహదపడడమేగాక ఎంతో ఒత్తిడిని తగ్గించి మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.
యుద్ధం చేసేటప్పుడు శత్రుసైనికుల బలాలు, బలహీనతలు,మన సామర్ధ్యం అంచనాలోకి తీసుకుని...... ఎక్కడ, ఎలాంటి సమయంలో శత్రువులను దెబ్బతీస్తే విజయం లభిస్తుందని ప్రణాళికలు, పథకాలు సిద్ధం చేస్తారు. ముంబై పై జరిగిన ఉగ్రవాదదాడుల్లో ఎన్.ఎస్.జి. కమెండోలు చేసిన వ్యూహరచన, దాడులు, సాధించిన విజయం ప్రసారమాధ్యమాల వల్ల మనకు తెలిసిందే. ప్రణాళికలో తప్పులుంటే ఎంతటి పరాజయం, అవమానం మనకు మిగిలిఉండేవి?
ప్రతి లక్ష్యసాధనను యుద్ధం చేస్తున్నట్లే భావించాలి.అయితే ఇక్కడ మరణాయుధాల అవసరం ఉండదు. మన మానసికశక్తుల బలం ముఖ్యం. ముందుగా మనం నిర్ధేశించుకున్న లక్ష్యం గురించి ఆలోచించాలి. దానిని సాధించడం మనకు సాధ్యమవుతుందా? లేదా? అనే పరిశీలన నిష్పాక్షింగా చేసుకోవాలి. ఈ పరిశీలనలో అతి అత్మవిశ్వాసం, ఆత్మన్యూనత రెండూ పనికిరావు. ’మనకు సాధ్యమేనని నిర్ణయించుకున్నాక లక్ష్యాన్ని చిన్న చిన్న విభాగాలుగా( స్వల్ప లక్ష్యాలుగా) విభజించుకోవాలి. దీనివల్ల ఎంతో ఉపయోగముంది. స్వల్ప లక్ష్యాలను సాధించడం సుళువేగాక, సాధించాక పొందే ఆనందం ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
ప్రతి స్వల్పలక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను ఊహించుకుని వాటిని నమోదు చేసుకోవాలి. వాటి పరిష్కారానికి మనమేం చేయగలమో అంచనా వేసుకోండి. ఉదాహరణకు వార్షికపరీక్ష(యాన్యువల్ ఎగ్జామ్) అనే పెద్ద లక్ష్యాన్ని ఒకేసారి సాధించడం కష్టం కాబట్టే స్లిప్ టెస్ట్, యూనిట్, క్వార్టర్లి, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వ్రాసి స్వల్ప లక్ష్యాలను సాధించి సిద్ధమవుతాము. ఈ స్వల్పలక్ష్యాలను సాధించే క్రమంలో మన శక్తియుక్తులు బయటపడతాయి. మనలోని లోపాలను సవరించుకునేందుకు అవకాశముంటుంది. కొత్త సామర్ధ్యాలను, నైపుణ్యాలను మెల్లగా పొందుపరచుకోగలుగుతాము.
ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో అనుకున్నది పొందలేకపోవడం వైఫల్యం కాదు. ఈ ప్రయత్నంలో ఎంతో విలువైన, ఎవరికి లభించని అనుభవం మన స్వంతమవుతుంది. ఆ అనుభవం మనకు ఇతర అంశాల్లో, సమస్యా పరిష్కారాల్లో ఉపయోగపడుతుంది. గొప్ప లక్ష్యాలను ఏర్పరచుకొని..... దానికి తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటే విజయం మీ అక్కున చేరుతుంది.

మార్కులు మీ ప్రతిభకు నిదర్శనం కాదు:

నియమబద్ధంగా పాఠశాలకు వెళ్ళి ’ఫస్ట్ ర్యాంకు’లు తెచ్చుకోకపోయినా ఎంతోమంది సుప్రసిద్ధులయ్యారు. తాము వెళ్ళిన మార్గంలో మరికొందరు నడిచేలా స్పూర్తినిచ్చారు. వారు మార్కులు సరిగా రాలేదని, ర్యాంకుల పట్టికలో తమ పేరు లేదని ఏనాడూ చింతించలేదు. ఏ విషయంపై తమకు ఆసక్తి ఉందో గమనించారు. ఆ రంగంలో ఉన్నతస్థానం పొందేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలో నిర్ణయించుకున్నారు. వాటిని పట్టుదలతో అమలుపరిచి చరిత్రపుటల్లో తమకంటూ కొంత స్థలాన్ని కేటాయించుకున్నారు. పరీక్షల్లో పలుమార్లు విఫలుడైన ఐనస్టీన్, చిన్నప్పుడే చదువు మానేసిన ఎడిసన్, కంప్యూటరే తనలోకమని నమ్మిన బిల్ గేట్స్, ప్రాథమికస్థాయిలోనే బడి ఒదిలి సంగీతపు ఒడి చేరిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ,... ఇలా చెప్పుకుంటూ వెళితే ఎందరో మహానుభావులు జీవితంలో విజయం ఎలా సాధించవచ్చో సగర్వంగా చాటుతున్నారు.
ఇంతకీ ’మార్కులు’ మన ప్రతిభను వెల్లడిచేయవా? అని ప్రశ్నించుకుంటే.... అవి మన విషయజ్ఞానాన్నే తెలుపుతాయి. విషయజ్ఞానం తెలివితేటల్లో భాగమేకాని అదే సర్వస్వం కాదు. కానీ, నేడలా భావించడంలేదు. మార్కులు పొందితే చాలు... జ్ఞానవంతులు, తెలివిగలవారిగా మారిపోయినట్లేనని ప్రచారం సాగుతుండడం ఎంతో విచారకరం. ఇలాంటి అసంబద్ద నమ్మకాలవల్లనే ఎలాగైన నూటికి నూరు మార్కులు సంపదించాలన్న కాంక్ష మీలో పెరిగిపోతోంది. మీ తల్లిదండ్రులు కూడా దానికి తగ్గట్టు ఒత్తిడి చేస్తున్నారు. వచ్చిన అత్యధిక మార్కుల్ని పక్కనబెట్టి రాని స్వల్పమార్కులకై మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు.
ఒకటి రెండు మార్కులు తగ్గినంత మాత్రాన ఏమాత్రం చింతించవద్దు. తల్లిదండ్రులకు కూడా నచ్చజెప్పేందుకు ప్రయత్నించండి.మీకు ఏ రంగంలో ఆసక్తి ఉందో వారికి తెలపండి. వీలున్నంతవరకు ఆ రంగంలో అభివృద్ది చెందేందుకు శిక్షణ ఇప్పించమనండి. మనం ఇష్టం పెంచుకుంటున్న రంగంలో మన ఆసక్తిని, ప్రతిభను కొలిచేందుకు అభిరుచి, వైఖరి పరీక్షలు (ఆప్టిట్యూడ్ , ఆటిట్యూడ్ టెస్ట్) ఉంటాయి. వాటిలో పాల్గొని మన అవగాహన ఎంత ఉందో అంచనా వేసుకోవచ్చు.
మార్కుల్ని మరిచిపొమ్మన్నాం కదా... అని పాఠ్యాంశాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే మొదటికే మోసం వస్తుంది. మనం కోరిన రంగంలో అభివృద్ధి సాధించాలంటే పాఠ్యాంశాల పరిజ్ఞానం ఎంతో అవసరం. గురువు బోధించే పాఠాలను పూర్తి ఏకాగ్రతతో వింటే నూటికి తొంబై శాతం మీకు గుర్తుంటుంది. చూడకుండా చెప్పడం, వ్రాయడం ద్వారా ఆ పాఠాలు మన మెదడులో శాశ్వతంగా గుర్తుంటాయి. ఇక ప్రశ్న ఎంత తికమకపెట్టేలా ఉన్నా సుళువుగా వ్రాసి ఎక్కువ మార్కులు పొందొచ్చు. మార్కులు తగ్గితే తరువాయి దఫా పరిక్షల్లో పెరిగేందుకు కృషి చేయాలేగాని.... కుంగిపోవడం,నిరాశ చెందడం విజ్ఞత కాదు. మీ ఆసక్తిని మీరు ప్రశ్నించుకోండి... అందులో కృషి చేయండి. పూర్తిగా మార్కుల్నే పట్టుకు వేలాడితే మార్కులే మిగులుతాయి. మనం సాధించే ప్రగతి ఏమీ ఉండదు.

19, ఫిబ్రవరి 2010, శుక్రవారం

ఇష్టపడి చదవండి:

సంక్రాంతి సెలవులు పూర్తై మీరు మళ్లీ పాఠశాలలకు వెళుతున్నారు. వార్షికపరీక్షలు ఎంతో దగ్గరలో ఉన్నాయి. ఇలాంటి స్థితిలో సమయాన్ని ఏమాత్రం దుర్వినియోగం చేసినా, నిర్లక్ష్యం చేసినా పరీక్షలను సరిగా ఎదుర్కోలేము. సిలబస్ ఎంతో ఉందని, దానిని చూస్తేనే భయకంపితులవుతున్నామని వాపోయే చిన్నారులు ఎంతోమంది. వారు ఒళ్ళంతా భయం నింపుకొని... చదువుతున్నట్లు నటించి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను భ్రమలో ఉంచుతారు. కానీ, ఏమాత్రం ఏకాగ్రత చూపలేరు. మరికొందరు.. అన్నీ కంఠస్థం పెట్టేసి ఉన్నది ఉన్నట్లు వ్రాసేస్తే వందకు వంద మార్కులు మనవేననుకుని, ఆ దిశలో అన్ని పాఠ్యాంశాలను వల్లె వేస్తుంటారు. ఇంకొందరైతే ఉపాధ్యాయులు చేప్పేటప్పుడే ఏకాగ్రతతో విన్నా కనుక తమకిక ఢోకా లేదని, స్వంతంగా అన్నీ వ్రాస్తామన్న అతివిశ్వాసంతో ఉంటారు. పరీక్షలను ఎడుర్కొనే విషయంలో ఈ మూడు రకాల ధోరణులు పనికిరావు.
పరీక్షల పట్ల కాస్త భయమే ఉండాలి. ఆ కాస్త భయం ఒత్తిడిని కలిగించి మనల్ని అప్రమత్తులుగా ఉంచుతుంది. అలాగే ప్రతి విషయాన్నీ కంఠస్థం పెట్టాలనుకోవడం అశాస్త్రీయం, మూర్ఖత్వం. ఇక ప్రతి దాన్నీ స్వంత మాటల్లో వ్రాస్తామనుకునే విశ్వాసం మనకు మార్కుల్ని సాధించిపెట్టదు. ఎలాంటి పాఠ్యాంశాన్ని ఎలా చదవాలో గమనిద్దాం.
ముందుగా తెలుగు, హిందీ, ఆంగ్లం,.... లాంటి భాషలు చూద్దాం. వీటిల్లోని పద్యాలు, కవితల్లాంటి వాటిని కంఠస్థం చేయాల్సిందే! కారణం వాటిని మన స్వంత మాటల్లో వ్రాయకూడదు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాల్సిన విషయం ఏదైనా కంఠతా రావాల్సిందే. అదే నాన్ డీటెయిల్డ్ బుక్ అయితే.... అందులోని స్టోరీని ఒకటికి పదిసార్లు చదివితే కథనంలోని ప్రతి అంశం, ఘట్టం మనకు గుర్తుండిపోతాయి. వీటి పశ్నలకు సమాధానాలంటే కథ వ్రాసినట్టే! ఇక వ్యాకరణం(గ్రామర్) అంటేనే కొరుకుడుపడని అంశంగా భావిస్తాం. కానీ, మీరు పదిమంది జట్టుగా ఏర్పడి ఆయా భాషల్లో వ్యాకరణం ప్రకారం మట్లాడడం అలవర్చుకుంటే సుళువుగా ఒంటబడుతుంది.
గణితం అంట్॑నే భయపడి బడి మానేసేవారు ఎందరో ఉన్నారు. కానీ సుళువుగా మార్కులు తెచ్చిపెట్టే సబ్జక్ట్ గణితం మాత్రమే. అయితే ఇందులో కంఠస్థం అసలు పనికిరాదు. గణితం తార్కిక విద్య. ఒక సమస్యని ఒక రకంగానే సాధించవచ్చని భావించకంది. ఒక సమస్యకు అనేక పరిష్కారాలు ఉంటాయి. తెలిసిన పరిష్కారలన్నింటినీ సాధన చేయాలి. ఆ పాఠ్యాంశానికి చెందిన సూత్రాలు మీ మదిలో నిరంతరం మెదులుతూ ఉండాలి. గణిత సమస్య ఏదైనా ఏ సూత్రం ద్వారా పరిష్కరించవచ్చో అంచనాకు రావాలంటే, వీలైనన్ని ఎక్కువ సమస్యల్ని చేయాలి. గణిత అభ్యసనలో భయం పెద్ద అవరోధం. వెంటనే జవాబు రాలేదనే నిరాశను విడిచిపెట్టాలి.
ఫిజికల్ సైన్స్, నాచురల్ సైన్స్ ( జీవ శాస్త్రం) విషయానికొస్తే ఫిజికల్ సైన్స్ గణితంలాగే తార్కికంగా ఉంటుంది. కారణాలను, ఫలితాలను మనం జ్ఞప్తికి ఉంచుకుంటే చాలు, సబ్జక్ట్ మన దగ్గరున్నట్టే! నిర్వచనాలు, రసాయన సమీకరణాలు ఉన్నవి ఉన్నట్లుగా వ్రాయాల్సిఉంటుంది. జీవశాస్త్రంలో వృక్షాలు, జంతువులకు సంబందించిన చిత్రాలు ఎంతో ముఖ్యం. వీటిని చక్కగా వేయడం సాధన చేస్తే చాలు, వాటి అనుబంధ పాఠ్యాంశాలను కూడా సుళువుగా వ్రాయవచ్చు. చూడకుండా చిత్రాలు వేయడం సాధన చేస్తే మెదడును మనమెంతో పదును పెట్టినట్లవుతుంది.
సాంఘికశాస్త్రం విషయానికొస్తే..... అందులోని భూగొళశాస్త్రం సైన్స్ లాగా తార్కిక అంశం. అలాగే అర్ధశాస్త్రం లోని విషయాలు నిత్యం మన కళ్ళెదుట కనిపించేవే!.. ఇందులో కూడా కార్యాకారణ సంబంధమే ఉంటుంది. ఇక చరిత్ర, పౌరశాస్త్రాలు ఎక్కువ సార్లు చదవాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో చరిత్ర విషయానికొస్తే .... ఒకే తేదీకి సంబంధించి వివిధ విషయాలు (అవి ఒకదానికొకటి సంబంధం ఉండవు) చదువుతాము. సంబంధం లేని వాటి మధ్య మనమే కృత్రిమ సంబంధం ఊహించుకుంటే చాలు, సుళువుగా గుర్తుండిపోతాయి. ఆ తేదీ నాటి ఒక విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోగానే మిగతా సంఘటనలు అప్రయత్నంగా మన ముందుకు వస్తాయి.
ఇలా ప్రతి సబ్జక్టును చదివేందుకు అవసరమైన ప్రణాళికలు ఉపాధ్యాయులు మీకిప్పటికే చెప్పేసి ఉంటారు. విషయమేదైనా ఎంత ఇష్టంగా నేర్చుకుంటే అది అంతే ఇష్టంగా మీదగ్గరుంటుంది.

పరమత సహనం అలవర్చుకోవాలి:

ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతంలో మతవైషమ్యాలు, మతవిద్వేషాలు పెచ్చుమీరడం, మతం పేరుతో హింసాకాండ నిత్యకృత్యమయ్యాయి. మతం పేరుతో జరుగుతున్న ఉగ్రవాదదాడులు, అణచివేతలు మనిషి మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. ’మతం మత్తుమందు’ అన్నారు మార్క్స్, అది అక్షరాల వాస్తవం. ఆ మతం మత్తులో మనిషి ఆలోచనను, వివేచనను, విచక్షణాజ్ఞానాన్ని కోల్పోతున్నాడు. ఇతర మతాల పట్ల పూర్తి ద్వేషభావాన్ని పెంచుకుని కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. తన మతమే గొప్పదనే భ్రాంతిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
అసలు ఇంతకీ మతమంటే ఏమిటి? దీనికింత శక్తి ఎలా వచ్చిందో పరిశీలిస్తే ఆశ్చర్యమేస్తుంది.మతం ఒక జీవనవిధానం. మనిషి నైతికవిలువలను, చర్యలను,సామాజిక సంబంధాలను, ప్రకృతి అనుబంధాలను,.... వెరసి విశ్వమానవాళి క్షేమాన్ని, స్నేహాన్ని మతం కోరుతుంది. ఏ మతప్రవక్త ఉద్బోధలను పరిశీలించినా...... మనిషి మానవత్వాన్ని పెంచే నీతిబోధనలు, సక్రమక్రియలు,మనిషి నడవడి.... గురించే ఉంటాయి గాని హింసను ప్రోత్సహించవు. మరి మనుషులెందుకిలా మతం పేరు చెప్పుకుని సాటి మనుషుల ప్రాణాలు గాల్లో కలిపేస్తున్నారు? మతానికిచ్చిన ప్రాధాన్యం మనుషులకెందుకు ఇవ్వట్లేదు? దీనికి కారణం మతపిచ్చి! నా మతమే గొప్పదనుకునే భావన ముదిరి మనుషుల్లోని జంతులక్షణాలను, మూర్ఖత్వాన్ని పెంచుతుంది.
మత వైషమ్యాల ఫలితంగా జరుగుతున్న దుస్సంఘటనలు ఎందరినో క్షోభ పెడుతున్నాయి. పచ్చనిసంసారాలు మోడుబారుతున్నాయి. మహిళలు, మీలాంటి చిన్నారులు ముఖ్యబాధితులు అవుతున్నారు. మతవిద్వేషాలు సమాజంలో అశాంతిని రేపుతాయి, ప్రజల్లో అభద్రతను కల్పిస్తాయి. నిరంతరం చావుభయం వెంటాడుతుంది. ఈ స్థితిలో ప్రతి చిన్నవిషయం పెద్ద దుర్ఘటనకు మూలమయ్యే అవకాశం ఉంది. ఆడుతూ, పాడుతూ ఆహ్లాదంగా బాల్యాన్ని గడిపే మీపై ఈ ఘటనలు తీవ్ర అలజడిని కలిగించి ఒక మతానికి తీవ్ర మద్దతుదారులుగా, ఆలోచనలేని పిడివాదులుగా తయారుచేస్తున్నాయి. ప్రశాంత సరస్సులా ఉండే సమాజం మతఛాందసం కారణంగా అల్లకల్లోలమవుతుంది.
ఇప్పుడు మనమేం చేయాలి? ఈ ప్రశ్నకు జవాబు.... పరమత సహనం అలవర్చుకోవాలి. వ్యక్తి మతమేదైనా, వేషభాషలు ఎలాంటివైనా అతని మంచితనాన్ని, ప్రేమ, ఆప్యాయతలను గుర్తించాలి. వ్యక్తి ఆకారాన్ని బట్టి ద్వేషించడం మూర్ఖుల లక్షణమవుతుంది. పాఠశాలలోని మీ సహచరుల్లో పలు మతాల వారు ఉండవచ్చు. వారిని ఏనాడూ మత ప్రాతిపదికన గుర్తించవద్దు. అకారణంగా.. ప్రపంచంలో ఎక్కడో జరిగిన సంఘటనలను వారికి ఆపాదించవద్దు. మతం మనం సృష్టించుకున్నదే! మతాలు వ్యాప్తిలోకి రాకముందు మనుషులు సంతోషంగా ఉన్నారనేది వాస్తవం. మతం విషాదం పంచేది కాదు. స్వచ్ఛమైన వ్యక్తిత్వాలతో, ఆదర్శవంతమైన సమాజాన్ని మనం నిర్మించుకునేందుకే మత సారాన్ని వినియోగించుకోవాలి.

సంపాదనే జీవితలక్ష్యం కారాదు:

ఐదారేళ్ళ క్రిందట మీలాంటి చిన్నారులను ’ పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నావు? ’ అని ప్రశ్నిస్తే ’కలెక్టర్, టీచర్, పోలీస్,...’ ఇలాంటి జవాబులిచ్చేవారు. ప్రస్తుతం మిమ్మల్ని ప్రశ్నిస్తే , నూటికి తొంభైమంది ’ సాఫ్ట్ వేర్ ఇంజినీర్’ అని చెబుతున్నారు. కారణమేమిటా అని తరచి చూస్తే ’అధిక ఆదాయం’ కనిపిస్తోంది. తల్లిదండ్రులు కూడా ’సాఫ్ట్ వేర్’ వృత్తినిపుణులు కావడమే జీవితలక్ష్యంగా ఉండాలని నూరిపోస్తున్నారు.
ఉపాధి ప్రతి ఒక్కరికీ కావాలి, జీవించడానికి అది ప్రాథమిక అవసరం. అయితే డబ్బు సంపాదన కోసమే వృత్తిని ఎన్నుకోవడం భవిష్యత్ లో ఎంతో ఇబ్బందిని తెచ్చి పెడుతుంది. బహుళజాతి సంస్థల సంస్కృతి ఉద్యోగిని ఒక యంత్రంగా చూస్తుందే గాని, కంపెనీని కుటుంబంలా భావించదు. ఉద్యోగుల పట్ల ఆప్యాయంగా ప్రవర్తించదు. చిన్న చిన్న తప్పులకు కూడా ఉద్యోగం తీసేసేంత కఠిననిర్ణయాలు తీసుకుంటారు. అలాంతి స్థితి వల్లే పగలు, రాత్రి అన్న బేధం లేకుండా అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. క్షణాలను డబ్బుతో పోలుస్తూ ఉంటారు! ’పరిశ్రమల్లో రోజుకు ఎనిమిది గంటల పనికాలం అనే నిబంధన’ బహుళజాతి సంస్థల్లో పూర్తిగా విస్మరించే అంశం.
ఇలాంటి పని విధానాల వల్ల ఉద్యోగులకు లభించే దానికన్నా , వారు కోల్పోయేదే విలువైనది. ఎన్ని గంటలు అదనంగా పనిచేస్తే అంత డబ్బు మన జేబులో చేరుతుంది. అలాంటి స్థితిలో ఎంతోమంది ఆహారం, నిద్ర, సంతృప్తి, సమాజసంబంధాలు, వ్యాయామం,... ఇలాంటి ఆవశ్యక అంశాలను మరచి యంత్రంలా మారుతున్నారు. మనిషి యంత్రమైతే ఎలా? లక్షల రూపాయలు తన కృషితో పోగేయవచ్చు.. ప్రపంచంలో పలుచోట్ల ఆస్తిపాస్తులు కూడబెట్టవచ్చు. మరి మానవసంబంధాలు నెరిపేదెప్పుదు? ’ఎంతో’ సంపాదించాక తీరిగ్గా సంతోషించవచ్చని తొలుత ప్రతి వ్యక్తీ అనుకుంటాడు. కానీ, ధనాన్ని ఆర్జించేటప్పుడు అతనికి వేరే ఆలోచనలేమీ రావు! తను కూడబెట్టిన డబ్బు అసంతృప్తిని మిగిలిస్తూ, మరికొంత కావాలని కోరుతూ ఉంటుంది.
తల్లిదండ్రులు, భార్య, పిల్లలు,... వారితో మనం గడపాల్సిన సమయం అనవసరమైన అంశంగా తోస్తుంది. ఇంటినిండా కొత్తవస్తువులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, బంగారు ఆభరణాలు,... లాంటి వాటితో కుతుంబసభ్యులు సంతృప్తి చెందుతారని భ్రమిస్తూ ఉంటారు! వాటితో ఇంటిని నింపుతారు. అనుభూతి నిచ్చేవి, కలకాలం గుర్తుండేవి సంతోషకరమైన క్షణాలే గాని...డబ్బు లెక్కలు కాదు!
ఒక్క వృత్తే ప్రపంచాన్ని నడిపించదు. పలు రంగాల్లో ఉద్యోగులు ఉండబట్టే సమాజ మనుగడ సవ్యంగా సాగుతోంది. అలాగే సంపాదించడమొక్కటే ఉద్యోగం యొక్క పరమార్ధం కాదు. సంపాదనతో పాటు సంతృప్తి ఎంతో అవసరం. ధనార్జనలో మునిగి కుటుంబాన్ని, సమాజాన్ని, పరిసరాలను విస్మరించడం వల్ల మనలోని మనిషితత్వం క్రమేపీ మాయమవుతుంది. మరి జీవితలక్ష్యాన్ని మీరు నిర్ధారించుకునేటప్పుడు ఈ అంశాలు జ్ఞప్తికి ఉంచుకుంటారని ఆశిస్తున్నాను.

ఇతర భాషలు నేర్చుకోవాలి:

మన దేశం భిన్న సంస్కృతుల, భాషల నిలయం. రవాణా సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పుడు దూరప్రయాణాలు స్వల్పమే! కానీ, నేడు ప్రయాణం చాలా సుళువయ్యింది. భారతదేశాన్ని చుట్టి రావడమేగాక, విదేశాలకు కూడా అవలీలగా ప్రయాస లేకుండా వెళ్ళొస్తున్నాము. అలాగే భిన్నప్రదేశాలలో ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. పరభాషీయులతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో ఒక్క భాషను మాత్రమే నేర్చుకుని దానినే వినియోగిస్తామంటే అది మన అమాయకత్వం అవుతుంది. తప్పక ఇతర భాషల్ని నేర్చుకోవాలి.
భాష చదివి నేర్చుకునే కళ కాదు. దానిని నేర్చుకుంటూ వినియోగించాల్సి ఉంటుంది. అంటే ఆ భాషలో మాట్లాడడం, వ్రాయడం, పునశ్చరణ చేసుకోడం లాంటివి నిరంతరం చేస్తుండాలి. దీనికి భాష నేర్చుకునే వాతావరణం అవసరం. సాధారణంగా ఎలాంటి వ్యాకరణం, పద్ధతులు తెలియకున్నా వివిధ భాషలు మాట్లాడే వ్యక్తులు మనకు తారసపడుతూ ఉంటారు. దీనికి వారి పరిసరాలే కారణం. పలు భాషలు మాట్లాడే వారు ఒకే ప్రాంతంలో కలిసిఉన్నప్పుడు ఒకరి భాషను ఇంకొకరు సుళువుగా నేర్చుకుంటారు. ఇదే భాషలు నేర్చే వాతావరణం! ఐతే ఇది అందరికిసాధ్యం కాదు కదా? మరి భాషావాతావరణం ఎలా?
మనమే అలాంతి స్థితిని కల్పించుకోవాలి. వారంలో ఒకరోజు నేర్చుకునే భాషకు కేటాయించాలి. ఆరోజు తప్పైనా, ఒప్పైనా ఆ భాషలోనే కుటుంబసభ్యులతో,స్నేహితులతో సంభాషించాలి. ఆ భాషలోని పుస్తకాలే చదవాలి, టెలివిజన్ లో అ భాషాకార్యక్రమాలే వీక్షించాలి. మనం చేసే ఈ పనులవల్ల కుటుంబసభ్యుల్లో కూడా ఆసక్తి కలిగి వారూ సహకరిస్తారు. అలాగే కొంతమంది స్నేహితులు కూడా మన బాటలోనే నడిచే వీలుంది. అది మనకెంతో సహాయపడుతుంది. పాఠశాలలో భాషాక్లబ్బులు ఏర్పాటు చేసుకోవచ్చు.
వివిధ సందర్భాలలో జరిగే వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో పాల్గొనడం మన భాషాపటిమ పెరిగేందుకు దోహదపడుతుంది. ఇతర భాషలు మాట్లాడే తొలి సందర్భాలలో ప్రతివారిలోనూ సిగ్గు ఆవహిస్తుంది. మాట్లాడే ప్రతిదీ తప్పనే భావన నోరు పెగలకుండా చేస్తుంది. అది సహజమే! కానీ ఆ స్థితి నుంచి త్వరగా బయటపడాలి. గొప్ప వక్తల ఉపన్యాసాలను గమనించాలి. ఎదురుగా లక్షలమంది శ్రోతలున్నా వారి గొంతు ఏ మాత్రం వణకదు. ’ ఎదురుగా ఎవరూ లేరు ’ అనుకుని ధీమాగా ప్రసంగిస్తారు.
వేగంగా ఆంగ్లంలో, హిందీలో ,.... ఇంకా ఇతర భాషల్లో మాట్లాడేవారిని చూస్తే మనకు అసూయ వేస్తుంది. అయితే ఆ నైపుణ్యం కొద్దిమందికి మాత్రమే పరిమితం కాదనే వాస్తవాన్ని మనం మరువకూడదు. కృషి చేస్తే పలు భాషల్లో పట్టు సంపాదించడం అసాధ్యమేమీకాదు. బహుభాషాకోవిదులను గురించి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి మరి.

వ్యర్ధమైనదేదిలేదు:

’ కుక్కపిల్ల, సబ్బుబిళ్ల, అగ్గిపుల్ల,..... కాదేదీ కవితకనర్హం’ అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు అక్ష్రరసత్యాలు. కవిత్వానికే కాదు, దేనికీ అనర్హమయినవి, వ్యర్ధమైనవి సృష్టిలో లేవు. ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి లోని అర్ధాన్ని, వాటి ఉపయోగాన్ని మనం వినియోగించుకోవాలి. దేన్నైనా మనకంటే స్థాయి తక్కువగానే భావిస్తూఉంటాము. తరుచుగా వాటిని కించపరుస్తూ ఉంటాము. అవి ఉపయోగపడే సందర్భాలను పరిశీలిస్తే ఆశ్చర్యానికి గురికాక తప్పదు.
ప్రాణుల సంగతే తీసుకుందాం... మనుషులు తప్ప ఏ ఇతర ప్రాణైనా తెలివి లేనివని, వాటివల్ల ఒనగూరేదేమీలేదనేది మన అభిప్రాయం. కీటకాలు, పక్షులు, జంతువులు ఆహారచక్రంలో భాగాలు. మొక్కలు వీటికి ఆధారాలు. ఇవేవీ లేకుంటే మానవ మనుగడ అసాధ్యం. ఆహారసమస్యతో మనిషి భూమిపై ఎప్పుడో అంతరించి ఉండేవాడు. తెలివితేటల విషయానికొస్తే ...... కొన్ని జంతువుల, పక్షుల జ్ఞానాన్ని మనమిప్పటికీ అందుకోలేదు. భూకంపాలు, అగ్నిపర్వత ప్రేలుళ్ళూ,... లాంటి ప్రకృతి విలయాలను కొన్ని చేపలు, కొన్ని వన్యప్రాణులు ముందే పసిగట్టగలవు, కానీ మనకా శక్తి లేదు. కుక్కలకున్న వాసనగ్రహించే శక్తిలో మనది ఎన్నో వంతు? మన చెవులు గ్రహించలేని ధ్వనులను సైతం అవి అవలీలగా వింటాయి! చీకట్లో సునాయాసంగా సంచరించే గబ్బిలాల శక్తి ఎంత గొప్పది? అణుబాంబుల ధార్మికశక్తిని కూడా తట్టుకోగలిగే బొద్దింక, టెలిస్కోపు లాంటి చూపు కల్గిన డేగ, కొన్ని నెలలపాటు ఆహారము-నీరు తీసుకోకుండా బ్రతికే ఎడారి ప్రాణులు, గుండె కొట్టుకోవడాన్ని నియంత్రించుకుని దీర్ఘనిద్ర లోకి జారుకునే ధ్రువపుప్రాణులు,.... ఇలా వేటి ప్రత్యేకత వాటిదే! చిరుప్రాణి అయిన కుందేలు లో మనం పోటీపడి పరిగెత్తలేము. హమ్మ్ంగ్ బర్డ్ లాగా కదలకుండా గాల్లో నిలబడగలమా? అసలు చేతులు చాచి పక్షిలా ఎగురగలమా? కంటికి కనిపించని సూక్ష్మజీవుల శక్తివల్ల మన జబ్బులపాలవడం తెలిసిందే కదా! ప్రకృతిలోని ఏ ప్రాణైనా కొన్ని విషయాల్లో మనకన్నా గొప్పదనే సంగతి ఒప్పుకుని తీరాలి.
ప్రాణం లేనివికూడా ఏదో ఒక రకంగా మనకు ఉపయోగపడేవే! రాళ్ళు మనకు వ్యర్ధపదార్థాలుగా తోస్తాయి. కానీ భవన, రహదార్ల నిర్మాణాల్లో వాటి పాత్ర ఎంత ముఖ్యమైనదో మనం ఎరుగుదుము. అందుకే ఎవరినీ తేలికగా తీసేయకూడదు. దేనినీ తక్కువ అంచనా వేయరాదు. సృష్టి లోని ప్రతి అంశం ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించబడే ఉద్భవించాయని గ్రహించాలి. సజీవులు, నిర్జీవులలో దేనినైనా పరిశీలించి, పరిశోధించినప్పుదు దాని గుణగణాలు తెలుసుకోగలుగుతాము, దాని ఉపయోగం మనకు అవగతమవుతుంది. బలహీనులు, బుద్ధిహీనులు,జఢపదార్దాలు,.... అనుకునే వాటిలో అంతర్గతంగా ఉండే శక్తిని మనం అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించాలి.

సినిమా వ్యామోహం వద్దు

’ సినిమా ’ సమాజ మర్పుకు, వినోదానికి ఉపకరించే మంచి మాధ్యమం, సాధనం. అయితే సంవత్సరానికి కొన్ని వందల సినిమాలు తయారయ్యే మనదేశంలో అధికభాగం జుగుప్సాకర వినోదానికి పరిమితమవుతుంటే , అతికొన్ని మాత్రమే కళాత్మక విలువలతో ఉంటున్నాయి. గతంలో సినిమాప్రదర్శనకు ధియేటరే వేదిక. టెలివిజన్, వీడియోప్లేయర్లు వచ్చాక సినిమా చూడడం చాలా సుళువయ్యింది.
సినిమా అనగానే హీరో, హీరోయిన్, విలన్, ఆరుపాటలు, పది ఫైట్లు,.... ఇలా రొటీన్! అశ్లీలసంభాషణలు, అర్ధనగ్ననృత్యాలు చాలాకామన్. ఇలాంటి సినిమాలను చూసి జీవితమంటే ఇంతే కాబోలు, నిజంగా అలా ఉంటేనే సంతోషంగా ఉన్నట్లు అని అందరూ భ్రమిస్తూ ఉంటారు. మీలాంటి చిన్నారులైతే మరికొంత ఊహల్లోకెళ్ళి కలల్లో కూడా సినిమాలను పలువరించడం జరుగుతుంది.
అబ్బాయిలు హీరోలను చూసి వారిలా డ్రస్ కావాలని, వారిలా స్టైల్ గా బైక్ నడపాలని, అమ్మాయిలు హీరోయిన్ లను చూసి వారిలా మేకప్ కావాలని ప్రయత్నిస్తున్నారు. సినిమాల్లో బాల ఆర్టిస్టులు చేసే పనులన్నీ మీరూ చేసి చూడాలనుకుంటున్నారు! సినిమానటులు చూపేదంతా నిజం కాదు. ఫైటింగ్స్ లో అయితే డూప్స్, దెబ్బలు తగలని ఏర్పాఅట్లు,.... ఉంటాయి. వాళ్ళ వాడే సంభాషణలను నిత్యజీవితంలో ఎవరూ వాడరు. ప్రజల్ని ఆకర్షితుల్నిచేసి, కేవలం సినిమాను ఎక్కువకాలం ప్రదర్శించుకోవడానికి.... అలాంటి మాటలు వారి నోట్లోంచి వస్తుంటాయి. పూర్తిగా వ్యాపారం కోసం తయారైన చలనచిత్రాలనుంచి మనం నేర్చుకునేదేమీ ఉండదు, మన విలువైన సమయం వృధా తప్ప!
సమాజగతిని చూపేవి, కొద్దోగొప్పో మనుషుల ఆలోచనల్లో మార్పు కలిగించేవి కళాత్మక చలనచిత్రాలే (ఆర్ట్ సినిమాలు)! దారిద్ర్యాన్ని, దోపిడీని, ఆవేదనను, సగటు మనిషి జీవితాన్ని వీటిల్లో చూపుతారు.
హీరో, హీరోయిన్ల పట్ల ఆరాధనాభావంతో వారిలా ఉండాలని ప్రయత్నించడమేగాక వారితో మాట్లాడాలని ఫోన్లు చేయడం, ఉత్తరాలు వ్రాయడం, అభిమానసంఘాలుగా ఏర్పడడం,..... అమాయకత్వంతో చేసే పనులు. మీలాంటి చిన్నారుల్లో కొంతమంది సినిమాల్లో నటించేందుకు ఇంట్లో చెప్పకుండా పారిపోతుంటారు. అలాంటి ఆలోచనలున్న వారెవరైనా మీ స్నేహితులుగా ఉంటే వారి ఆలోచనను మార్చండి. సినిమా- వాస్తవజీవితం రెండు భిన్నధృవాలని తెలపండి.
సమాజంలో అసమానతలను తొలగించేవారు, పేదలకు-దీనులకు సేవ చేసేవారు నిజమైన హీరోలని గుర్తించాలి. డబ్బును పోగేసుకుని పదో పరకో పంచి దాతలమని గర్వపడేవారు ఒకవైపు, డబ్బుకంటే మనిషికి విలువనిచ్చి మానవ అభివృద్దికి తోడ్పడేవారు మరోవైపు ఉన్నప్పుడు నిజమైన హీరోలెవరో గుర్తించలేకపోతే అది అంధత్వమే అవుతుంది. భ్రమ ఎన్నడూ నిజం కాదు!

గొప్ప ఆలోచనలు చేయాలి.

గొప్పగా ఆలోచించాలి-సామాన్యంగా జీవించాలి:
----------------------------------------------------
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తక్కువగా ఆలోచించి, ఆడంబరంగా జీవించాలనే అభిప్రాయంతోనే ఉన్నారు. గొప్పగా ఎందుకు ఆలోచించాలి! సామాన్యంగా ఎందుకుండాలి? అనే ప్రశ్న వేసుకుంటే దాని వల్ల కలిగే మంచిఫలితాలు కోకొల్లలు మనకు జవాబులుగా దొరుకుతాయి. ప్రసిద్ధులైన ఎంతోమంది వ్యక్తులు ఆ పద్ధతిని అనుసరించే విజయాలు సాధించారు. తమవెంట నడిచేందుకు మరికొంతమందికి స్ఫూర్తి నిచ్చారు.
సాధారణంగా ’ భవిష్యత్ లో నువ్వేం కావాలనుకుంటున్నావ ’ ని మీలాంటి విద్యార్ధుల్ని ప్రశ్నిస్తే చిరుద్యోగం చేయాలనో, చిన్న వ్యాపారం చేయాలనో చెప్పేవారు అధికం. ఉన్నతస్థానాన్ని కోరుతున్నామని చెప్పేవారు స్వల్పం. మిమ్మల్నే కాదు యుక్తవయస్కులను అడిగినా ఇలాంటి సమాధానాలే వస్తాయి. బహుతక్కువమందే ఉన్నత స్థానాన్ని సాధించడం జరుగుతోంది. దీనికి గల ముఖ్యకారణం మన ఆలోచనావిధానమే! మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోవడం సంతృప్తినిస్తుంది. మన సామర్ధ్యం యొక్క వాస్తవవిలువను గుర్తించము. ప్రముఖులైన వారందరూ వారి శక్తి ని పూర్తిగా వినియోగించుకున్నవారే, దానికంటే ముఖ్యంగా వారి ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. మానసికంగా ఎప్పుడు మనం బలహీనతను చూపుతామో ఇక ఆపనిని సాధించడం కష్టసాధ్యమవుతుంది.
గొప్పగా ఆలోచించలేకపోవడానికి మరోకారణం ఆడంబరమైన జీవనవిధానం. పేదలు-ధనవంతుల మధ్య తీవ్రమవుతున్న అంతరాలవల్ల, ధనవంతుల విలాసవంతమైన జీవితం, ప్రసారమాధ్యమాల పొట్టలోంచి అనుక్షణం పుట్టుకువచ్చే మేడిపండు ప్రకటనలు,..... సామాన్యంగా, సరళమార్గంలో జీవించడాన్ని అవహేళన చేస్తున్నాయి. వ్యక్తి స్వార్ధాన్ని పెంచుతున్నాయి. డబ్బుసంపాదించడం, ఖర్చుపెట్టడం, సంపదను అందరిముందూ గర్వంగా ప్రదర్శించుకోవడం... ఇవే ప్రతివ్యక్తి జీవితలక్ష్యం అవుతోంది. సమాజ ఒత్తిడితో, అవహేళనతో పేదవాడు కూడా విలాసాలను స్వంతం చేసుకోవాలని తపనపడుతున్నాడు. ప్రతిఒక్కరూ విలాసాలను అవసరాలని భ్రమిస్తున్నారు.
జీవితలక్షం ఎపుడూ వ్యక్తిగత అభివృద్ధిపైనే ఉండకూడదు.... సమాజంలో ఉన్న చెడును, అమానుషాలను, అమాయకత్వాన్ని తొలగించే విధంగా ఉండాలి. అది సాధించేందుకు మనం ఎలాంటి పాత్ర పోషించాలి, మన శక్తికి తగిన కార్యాన్ని ఎలా నిర్వర్తించాలనే ఆలోచన ఎప్పుడూ మదిలో మెదులుతుండాలి. ఎంతోమందికి స్ఫూర్తి నిచ్చి, వారి ఆలోచనల్లో మార్పు... తద్వారా సమాజమార్పు కోసం కృషి చేయాలి. ఉన్నతస్థానానికి వెళ్ళడమంటే అధికంగా డబ్బు పోగేయడం, ఉన్నతపదవిని పొందడం మాత్రమేకాదు, మన వ్యక్తిత్వం ఆదర్శనీయంగా ఉండాలి.
ఇక జీవనవిధానంలో ఆడంబరాలను గమనిస్తే.... ప్రతి విలాసం ఎన్నో వనరులను ఖర్చు చేస్తుంది. ప్రకృతిపై అమితభారాన్ని మోపి దాని నాశనానికి దారి తీస్తుంది. అందువల్లనేఆహారం, దుస్తులు, వాహనాలు,.. ఇలా మనం వినియోగిస్తున్న ప్రతి వనరును పొదుపుగా వాడుకోవడం వల్ల భూమిపై మానవ జీవితకాలం పొడిగించబడుతుంది. మహాత్మాగాంధీ, ఆచార్య వినోబాభావే,పుచ్చలపల్లి సుందరయ్య,మదర్ థెరిసా,.... లాంటి మహానుభావుల ఉన్నత ఆలోచనలను, సామాన్యజీవనాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మీలాంటి చిన్నారులు ఆ లోటును పూరిస్తే సమాజానికి అంతకంటే గొప్ప మేలు వేరేది లేదు.

జబ్బుల పట్ల అవగాహన

జబ్బుల పట్ల అవగాహన:
ఆరోగ్యాన్ని మించిన సంపద లేదనేది వాస్తవం. అయితే కలుషిత గాలి, నీరు, ఆహారం, పరిసరాలు మనల్ని రోగగ్రస్తులుగా
మారుస్తుంటాయి. ఎన్నో జబ్బుల్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నా, సమసిపోయాయనుకున్న వ్యాధులు మళ్ళీ జడలు విప్పడం,
ఎంతోమందిని బలి తీసుకోవడం గమనిస్తున్నాం.జబ్బులు సంక్రమించే విధానాలు, వాటికి అందుబాటులోని చికిత్సాపద్ధతులు,
నివారణాచర్యలు గురించి తెలుసుకోవడం వల్ల మనల్ని మనం కాపాడుకోవడమేగాక ఇతరులకు కూడ మేలు చేయవచ్చు.
వ్యాధులపై మానవాళి సాధించిన విజయాలు చాలా గొప్పవి. కాని, చిన్న చిన్న జబ్బులపట్ల కూడా అవగాహన లేని
ప్రజలెంతోమంది వాటి విషపుకోరల్లో బలవుతున్నారు. మశూచి,రేబిస్,పోలియో,ధనుర్వాతం,క్షయ,కంఠవాపు,టైఫాయిడ్,హెపటైటిస్,
తట్టు,....లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు టీకాలు(వ్యాక్సిన్స్) కనిపెట్టి వాటిని వాటిని నియంత్రించడం మనం వేసిన గొప్ప ముందడుగు.
కానీ, సూక్ష్మజీవులు తమ శక్తిసామర్ధ్యాలను పెంచుకుని రెట్టించిన ఉత్సాహంతో మన మీద దాడికి సిద్ధమవుతూ ఉన్నాయి.
వైద్యరంగంలో మనము ప్రగతి సాధించినా , సాధించాల్సింది చాలా ఉందనడానికి గుర్తు......ఎయిడ్స్, హెపటైటిస్-సి,క్యాన్సర్స్,బర్డ్
ఫ్లూ, స్వైన్ ఫ్లూ.... లాంటి జబ్బులే !
చాలామంది ఉన్నత విద్యావంతుల్లో కూడా జబ్బులపట్ల సరైన అవగాహన లేకపోవడం విచారకరం. ’ జబ్బు వచ్చాక అంతా
డాక్టరే చూస్తాడు...’ అనే భావన సమాజంలో పెరుగుతోంది. ప్రపంచమంతా కుగ్ర్రామంగా మారిన ప్రస్తుత పరిస్థితిలో జీవితం వేగవంతం
కావడం, ఆరోగ్యంపై శ్రద్ధ చూపలేకపోవడం, తీసుకునే ఆహారవిలువను పట్టించుకోకపోవడం...... లాంటి వన్నీ జబ్బులపాలు చేస్తున్నాయి.
అంతేగాక మన జీవనవిధానానికి తగ్గట్టు కొత్త జబ్బులు పుట్టుకువస్తున్నాయి( లైఫ్ స్టైయిల్ డిసీజెస్). గాలి, నీరు,ఆహారం,.. జబ్బులు మోసుకొచ్చే ప్రధాన మాధ్యమాలు. మనిషి స్వార్ధం పెరిగి ప్రకృతివనరుల విచ్చలచిడి వినియోగం వల్ల పుడమి అంతా కలుషితం అవుతోంది. మరి ఈస్థితిలో ఈ మాధ్యమాలు ఎన్నో జబ్బులకు కారకాలవుతున్నాయి.ఇది నిత్యమూ మనం గమనించాల్సిన అంశం.
ప్రకృతి స్వఛ్ఛత మన చేతుల్లోనే ఉంది.
’ చికిత్స కంటే నివారణ ముఖ్యం’ అనేనానుడి అక్షరసత్యం. అనారోగ్యం దరిచేరకుండా చూసుకోవాలేగాని, వచ్చాక మందులూ,
ఇంజెక్షన్లూ ఉన్నాయి కదా! అనే ధీమా ఉండరాదు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా స్వంతంగా మనం వాడే మందులు కూడా ఎంతో ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. ఉదాహరణకు సూక్ష్మక్రిమినాశకాలు(యాంటీబయాటిక్స్) నే తీసుకుంటే ... వాటిని విచక్షణారహితంగా
వాడితే వ్యాధి కలిగించే సూక్ష్మజీవి ఆ మందుకు తట్టుకునే శక్తి ని పొంది మరింత ప్రమాదకరంగా తయారవుతుంది. అప్పుడు దానిని
సంహరించాలంటే మరింత శక్తివంతమైన మందు అవసరమవుతుంది. అదెంత క్లిష్టమైన పనో ఆలోచించండి.
చిన్నారులూ....జబ్బులు సంక్రమించే విధానం, జాగ్రత్తలు మీ పాఠ్యపుస్తకాల్లో ఉంటాయి. అంతేకాదు...దినపత్రికలు, టెలివిజన్,...లలో కూడా వాటి సమాచారం లభిస్తుంది. వాటిని శ్రద్ధగా చదివి మరికొంతమందికి తెలియజేస్తారని భావిస్తున్నాను. ఆరోగ్యంగా ఉండాలంటే అనారోగ్యం గురుంచి తెలుసుకోవడం ముఖ్యం కదా!

సమయం వృధా చేయొద్దు.

అనుకరణ వద్దు.

అనుకరణ వద్దు: _శాఖమూరి శ్రీనివాస్
___________________________________________________
ఇతరుల్లా ఉండాలని ప్రయత్నించడమే అనుకరణ. గొప్ప వ్యక్తులు జీవితంలో సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకోవాలే గాని, వారిలానే... వారి రంగాన్నే ఎన్నుకోవడం సమంజసం కాదు.అది మన శారీరక, మానసిక అనుకూలతలకు సరిపోకపోవచ్చు. వారిచ్చిన స్ఫూర్తిని మనకు ఆసక్తి ఉన్న రంగంలో విజయం సాధించేందుకు ఇంధనంగానే వాడుకోవాలి. ఎక్కువమంది అనుకరించడానికే ప్రయత్నిస్తారు గాని, తమ కంటూ కొత్త శైలిని ఏర్పరచుకోరు.
సమాజంలో తక్కువస్థాయిలో ఉన్నవారు ఎక్కువస్థాయిలోని వారిని, వారు ఆ పై స్థాయి వారిని గుడ్డిగా అనుకరించడం జరుగుతోంది. సృష్టిలోని తెలివైన ప్రాణులేవీ మిగతా వాటిని మూర్ఖంగా అనుసరించవు. పసిపాపలు సైతం పెద్దలను పూర్తిగా అనుసరించరని, పెద్దల చేష్టలను పరిశీలించి తమకు వీలైన విధంగా మార్చుకుంటారని పరిశోధనల్లో తేలింది. ఒకప్పుడు పిల్లల మనస్సు తెల్లకాగితమన్న శాస్త్రజ్ఞులు... నేడు దానిని అంగీకరించక పుట్టుకతోటే వారిలో కొన్ని సహజసిద్ధగుణాలు ఉంటాయని నిర్ధారించారు. ఆలోచనాస్థాయి తక్కువుండే కొన్ని జంతువులు(గొర్రెలు, గేదెలు, పందులు...లాంటివి) మాత్రమే మిగతావాటిని అనుసరిస్తూ ఉంటాయి. అనుకరణ వల్ల మన ఆలోచనాపరిధి కుచించుకునిపోతుంది. కొద్ది రోజులకు పూర్తిగా ఆలోచనారహితస్థితికి చేరుకుంటాము. ఇతరులపై ఆధారపడడం అధికమవుతుంది. ఫలితం...... స్వతంత్రించి ఏ పని చేయాలన్నా అపరిమితమైన భయం, అభద్రతాభావం వెంటాడుతాయి. సృజనాత్మకత పూర్తిగా తగ్గిపోతుంది.
స్వంతంగా నిర్ణయాలు తీసుకుంటే విఫలం చెందుతామని భయపడకూడదు. ఇతరులను పరిశీలిస్తూనే.... అందరి సూచనలు, అభిప్రాయాలు తీసుకుంటూనే ధైర్యంగా మనదైన నిర్ణయాన్ని తీసుకోవాలి. ఒక్కొక్కసారి మన నిర్ణయం వల్ల వైఫల్యం ఎదురుకావచ్చు. అంతమాత్రాన మనం ఓడినట్లు కాదు. వైఫల్యం ఎప్పుడూ విజయానికి ఉన్న రహదారిని స్పష్టంగా చూపుతుంది. అనుకరణ చేసేవాడికి లక్ష్యం పట్ల అవగాహన ఉండదు. ఒకవేల లక్ష్యాన్ని ఏర్పరచుకున్నా దానిని సాధించేందుకు అవసరమైన శ్రమ, ఏకాగ్రత, సృజనాత్మకత, పట్టుదల,.... లాంటి మానసిక బలాలు ఉండవు. విజయానికి తీసుకెల్లే దారి స్పష్టపడదు.
ఇతరులను అనుకరించి ఉంటే ఎ.ఆర్.రహమాన్ కీబోర్డ్ ప్లేయర్ గానే ఉండేవాడు, సగర్వంగా ఆస్కార్ అవార్డ్ అందుకునే వాడు కాదు. రజనీకాంత్ బస్ కండక్టర్ గానే ఉంటే ఇంతమంది అభిమానులను ఎలా సంపాదించుకునేవాడు? సబ్ రిజిష్ట్రార్ ఉద్యోగంతో సంతృప్తి పడి, ఇతరుల్లాగా లంచాలు మేస్తూ ఉంటే ఎన్.టి.ఆర్. పేరు ఎంతమందికి తెలిసిఉండేది? ...... ఇలా ఎందరో అనుకరణ అనే పదాన్ని తమ జీవితంలో లేకుండా చేసుక్లున్నారు. ఎంతోమంది తమ జీవితసారాలను అనుకరించేలా కృషి చేసారు.
ప్రతి వ్యక్తికీ తమవైన ప్రత్యేక లక్షణాలు, ఆసక్తులు, అభిరుచులు ఉంటాయి. అందుకే మనల్ని మనం తరచి చూసుకోవాలి. మన బలాలు, బలహీనతలు అంచనా వేసుకోవాలి. ఆసక్తి ఉన్న రంగంలోని గొప్పవారి జీవితాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. మనకు ఎదురవ్వబోయే సమస్యలేంటో ఊహించగలగాలి. ఇదంతా విజయకాంక్ష ఉన్న వారు చేయాల్సినవి. అనుకరించేవారికి ఇవన్నీ అనవసరం. వారెన్నడూ పరాన్నజీవులుగానే ఉండిపోతారు.
అనుకరణ అంటే స్వంత కాళ్ళున్నా ఊత కర్రలతో నడవడం లాంటింది. చిన్నారులూ..... మీరు ఖచ్చితంగా ఊతకర్రలను విసిరేస్తారని ఆశిస్తాను.

15, ఫిబ్రవరి 2010, సోమవారం

పరీక్షలకు ముందు చదవడమెలా?

పరీక్షలకు ముందు చదవడమెలా?
చిన్నారి డెస్కు, ప్రజాశక్తి శాఖమూరి Sat, 13 Feb 2010, IST
మీ కోసం...!
పరీక్షల రూపంలో మిమ్మల్ని పరీక్షించే సమయం దగ్గరికొస్తోంది. తొమ్మిదో తరగతి వరకూ పట్టుదలతో ప్రణాళిక ప్రకారం చదవకున్నా హాజరు సాయంతో నెట్టుకొచ్చినవారు పదవతరగతి పబ్లిక్‌ పరీక్షలనగానే ఒత్తిడికి లోనవుతున్నారు. ఒక్కోరోజు తరిగిపోతూ, పరీక్షలు దగ్గరపడేకొద్దీ వీరి ఆందోళన మరింత ఎక్కువవుతుంది. ఆందోళన అధికమైతే తెలిసిన ప్రశ్నల జవాబులను కూడా మర్చిపోతామనేది వాస్తవం. 'చదివింది కొంత.. చదవాల్సింది కొండంత' అనే భావనను ముందు మన మనస్సులో నుంచి తీసేయాలి. ఇప్పటికే మీరు స్లిప్‌, యూనిట్‌ టెస్ట్‌, క్వార్టర్లీ, హాఫ్‌ ఇయర్లీ ద్వారా ముప్పావువంతు సిలబస్‌ను చదివేశారు. మిగిలిపోయిన కొద్దిపాటి పాఠ్యాంశాలనే చూసుకుని నిరాశ చెందడం వివేకవంతుల లక్షణం కాదు. ఇప్పటివరకు మీరు చదివిన సిలబస్‌ ఎంతో... ముందు గుర్తించండి. దానిని సంపూర్తిగా చదివాకనే మిగిలిన వాటిలో ప్రధానమనుకున్న వాటిని నేర్చుకోవాలి. రోజులో ఎన్ని గంటలు చదవాలో ముందుగా నిర్ధారించుకోవాలి. సబ్జెక్ట్స్‌ అన్నింటికీ ప్రతిరోజూ సమయాన్ని కేటాయించుకోవాలి. ఇక చదివే విధానాన్ని పరిశీలిస్తే అంశాన్ని చదవడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం, అనుసంధానించుకోవడం అనేవి ప్రధానమైనవి. విషయాన్ని ఏకాగ్రతతో చదివాక.. కళ్ళు మూసుకుని అందులోని ముఖ్యమైన, కీలకమైన పదాలు (కీ వర్డ్స్‌) జ్ఞప్తికి తెచ్చుకుని.. వాటిని అంతకుముందే మనకు బాగా తెలిసిన పాఠ్యాంశాలతో జతపరచుకోవాలి. మనం ఏర్పరచుకున్న కీలకమైన పదాలను పట్టికలాగా రాసుకోవాలి.

అదే ప్రశ్నను పునశ్చరణ చేయాలనుకున్నప్పుడు కీలకపదాలను చూసి విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు. ప్రతిపాఠాన్ని ఈ కీలక పదాల రూపంలో నమోదు చేసుకుంటే పునశ్చరణ తేలికకావడమేగాక, ఎక్కువసార్లు పునశ్చరణ చేయొచ్చు. ఒక ప్రశ్నను కనీసం ఐదుసార్లైనా పునశ్చరించుకున్నప్పుడు అది శాశ్వత జ్ఞాపకశక్తిలోకి వెళ్లిపోతుంది. కొంతమంది వ్యాసరూప ప్రశ్నలు వదిలేసి.. ఖాళీలు, బహుళైచ్ఛిక ప్రశ్నలను సాధన చేస్తారు. అయితే ఇవి వ్యాసరూప సమాధానాల్లో అంతర్భాగాలే అని మనం గుర్తించాలి. ఒక పాఠ్యాంశం చదివాక అందులోని స్వల్ప సమాధాన ప్రశ్నలను విడిగా చదవాల్సిన పని ఉండదు. అందుకే పెద్ద ప్రశ్నలు చదివిన వెంటనే బిట్స్‌ను సాధన చేయండి.. ఎంత సులువుగా ఉంటాయో? కొన్ని అంశాలైతే ఎన్నిసార్లు చదివినా మర్చిపోతుంటాము. దీనికి కారణం యాంత్రికంగా చదవడమే! ఆ విషయాన్ని నిత్యజీవిత అంశాలతో మనమే కృత్రిమంగా జతపరచుకుంటే అది మన మెదడులో శాశ్వతంగా ఉండిపోతుంది.

అలాగే మనం వేకువజామున 3 గంటల నుండి 8 గంటల వరకూ ఉన్న సమయం చదువుపట్ల శ్రద్ధ పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. అయినా మన ప్రమేయం లేకుండా ప్రశాంతంగా, నిశ్శబ్ధంగా ఉన్నామంటే ఆ సమయం కూడా శ్రద్ధగా చదవడానికి వీలుగా ఉన్నట్లే. సాయంత్రం 6 నుండి 8 గంటల సమయంలో కూడా మనం శ్రద్ధగా చదవొచ్చు.అలాగే ప్రయోగాల విషయానికొస్తే.. ప్రయోగాలు అతి స్వల్పంగా చేసి ఉంటాము. కొందరైతే అసలు చేసి ఉండరు. ప్రయోగ విధానాలు, పరికరాల పేర్లు గుర్తుంచుకోవాలంటే.. ఆ ప్రయోగాన్ని మనం చేసినట్లు ఊహించుకోవాలి. ఈ ఊహలో పరికరాల ఏర్పాటు నుంచి ఫలితం వచ్చేవరకూ క్రమపద్ధతిలో చేసినట్లు, ఫలితం లభించినట్లు ఉండాలి. పరీక్షల్లో ఈ క్రమపద్ధతినే ఉన్నది ఉన్నట్లుగా రాస్తే చాలు.
అన్ని పుస్తకాలూ ఒకేసారి ముందుంచుకుని చదవడం అశాస్త్రీయం. చదివే పుస్తకం తప్ప వేరేవేవీ మన దగ్గర ఉండొద్దు. ఒకరోజు నిర్దేశించుకున్న ప్రణాళిక పూర్తిచేయాలని గట్టి నిర్ణయం తీసుకుని ఏమాత్రం వాయిదా వేయకుండా చదివితే మీరు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ప్రశ్నల్లో చాయిస్‌ ఉంటుందన్న విషయాన్ని కూడా మరవకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ఎదుర్కోండి.

13, ఫిబ్రవరి 2010, శనివారం

సాక్షిలో చందమామ కథ


నా మొదటి ఉత్తరం

విశ్వ మానవులందరికీ నమస్కారాలు. బాలసాహిత్యంలో నాకృషిని బ్లాగ్ ప్రతిబింబిస్తుంది.