19, ఫిబ్రవరి 2010, శుక్రవారం

పరమత సహనం అలవర్చుకోవాలి:

ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతంలో మతవైషమ్యాలు, మతవిద్వేషాలు పెచ్చుమీరడం, మతం పేరుతో హింసాకాండ నిత్యకృత్యమయ్యాయి. మతం పేరుతో జరుగుతున్న ఉగ్రవాదదాడులు, అణచివేతలు మనిషి మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. ’మతం మత్తుమందు’ అన్నారు మార్క్స్, అది అక్షరాల వాస్తవం. ఆ మతం మత్తులో మనిషి ఆలోచనను, వివేచనను, విచక్షణాజ్ఞానాన్ని కోల్పోతున్నాడు. ఇతర మతాల పట్ల పూర్తి ద్వేషభావాన్ని పెంచుకుని కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. తన మతమే గొప్పదనే భ్రాంతిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
అసలు ఇంతకీ మతమంటే ఏమిటి? దీనికింత శక్తి ఎలా వచ్చిందో పరిశీలిస్తే ఆశ్చర్యమేస్తుంది.మతం ఒక జీవనవిధానం. మనిషి నైతికవిలువలను, చర్యలను,సామాజిక సంబంధాలను, ప్రకృతి అనుబంధాలను,.... వెరసి విశ్వమానవాళి క్షేమాన్ని, స్నేహాన్ని మతం కోరుతుంది. ఏ మతప్రవక్త ఉద్బోధలను పరిశీలించినా...... మనిషి మానవత్వాన్ని పెంచే నీతిబోధనలు, సక్రమక్రియలు,మనిషి నడవడి.... గురించే ఉంటాయి గాని హింసను ప్రోత్సహించవు. మరి మనుషులెందుకిలా మతం పేరు చెప్పుకుని సాటి మనుషుల ప్రాణాలు గాల్లో కలిపేస్తున్నారు? మతానికిచ్చిన ప్రాధాన్యం మనుషులకెందుకు ఇవ్వట్లేదు? దీనికి కారణం మతపిచ్చి! నా మతమే గొప్పదనుకునే భావన ముదిరి మనుషుల్లోని జంతులక్షణాలను, మూర్ఖత్వాన్ని పెంచుతుంది.
మత వైషమ్యాల ఫలితంగా జరుగుతున్న దుస్సంఘటనలు ఎందరినో క్షోభ పెడుతున్నాయి. పచ్చనిసంసారాలు మోడుబారుతున్నాయి. మహిళలు, మీలాంటి చిన్నారులు ముఖ్యబాధితులు అవుతున్నారు. మతవిద్వేషాలు సమాజంలో అశాంతిని రేపుతాయి, ప్రజల్లో అభద్రతను కల్పిస్తాయి. నిరంతరం చావుభయం వెంటాడుతుంది. ఈ స్థితిలో ప్రతి చిన్నవిషయం పెద్ద దుర్ఘటనకు మూలమయ్యే అవకాశం ఉంది. ఆడుతూ, పాడుతూ ఆహ్లాదంగా బాల్యాన్ని గడిపే మీపై ఈ ఘటనలు తీవ్ర అలజడిని కలిగించి ఒక మతానికి తీవ్ర మద్దతుదారులుగా, ఆలోచనలేని పిడివాదులుగా తయారుచేస్తున్నాయి. ప్రశాంత సరస్సులా ఉండే సమాజం మతఛాందసం కారణంగా అల్లకల్లోలమవుతుంది.
ఇప్పుడు మనమేం చేయాలి? ఈ ప్రశ్నకు జవాబు.... పరమత సహనం అలవర్చుకోవాలి. వ్యక్తి మతమేదైనా, వేషభాషలు ఎలాంటివైనా అతని మంచితనాన్ని, ప్రేమ, ఆప్యాయతలను గుర్తించాలి. వ్యక్తి ఆకారాన్ని బట్టి ద్వేషించడం మూర్ఖుల లక్షణమవుతుంది. పాఠశాలలోని మీ సహచరుల్లో పలు మతాల వారు ఉండవచ్చు. వారిని ఏనాడూ మత ప్రాతిపదికన గుర్తించవద్దు. అకారణంగా.. ప్రపంచంలో ఎక్కడో జరిగిన సంఘటనలను వారికి ఆపాదించవద్దు. మతం మనం సృష్టించుకున్నదే! మతాలు వ్యాప్తిలోకి రాకముందు మనుషులు సంతోషంగా ఉన్నారనేది వాస్తవం. మతం విషాదం పంచేది కాదు. స్వచ్ఛమైన వ్యక్తిత్వాలతో, ఆదర్శవంతమైన సమాజాన్ని మనం నిర్మించుకునేందుకే మత సారాన్ని వినియోగించుకోవాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి