25, మార్చి 2010, గురువారం

చీమల తెలివి



ఒక చీమల కుటుంబం తమ పుట్టలోపల సంభాషిస్తూ భోజనం చేస్తున్నాయి. హటాత్తుగా ఒక ఎలుక వాటి నివాసం లోకి వచ్చింది. చీమలు సంభాషణ ఆపాయి. అనుమతి లేకుండా వచ్చినందుకు కోపంగా ఉన్నా, అతిథి ధర్మాన్ని పాటించి " అన్నయ్యా... ఇలా చెప్పాపెట్టకుండా వచ్చావేమిటి? కాస్త కబురందించినా నీకొరకు ప్రత్యేకవంట చేసేవారం కదా! అయినా నీ మర్యాదకు లోటేం లేదులే... భోంచేద్దువురా..." అని ఆప్యాయంగా పిలిచియాయవి.
ధాన్యం మేసేటప్పుడు రైతు గమనించి తరిమితే పారిపోతూ పుట్టలోకి దూరిందా ఎలుక! కానీ, ఆ విషయాలేమీ చెప్పకుండా, "పర్లేదులే.... మీరెలాఉన్నారో చూద్దామనే వచ్చాను. మీరంతా క్షేమంగానే ఉన్నారు కదా?" అని కుశల ప్రశ్నలు వేసింది. అలా మాట్లాడుతూనే భోజనానికి కూర్చుంది. చీమలు బియ్యం పాయసం, గోధుమ రొట్టెలు, పెసరపప్పు వడ్డించాయి. ఆ పదార్ధాలు చూసి ఎలుక మతిపోయింది. తను ఏనాడూ అలాంటివి తినలేదు. ఏవో నాలుగు గింజలు తినడం, నీళ్ళతో నోరు తడుపుకోవడమే తనకు తెలుసు. చీమల వైభోగానికి కళ్ళుకుట్టాయి. చుట్టూ పరికించి చూసింది. రకరకాల గదులుగా ఉంది నివాసం. ఓ మూలన సేకరించిన ధాన్యపుగింజలు, పప్పులు, పంచదార పలుకులు రాశులుగా పోసి ఉన్నాయి. అదంతా చూడగానే ఎలుకకు గుడ్డపేలికలు, ధాన్యపు నూక , తవుడు నిండి ఉండే తన నివాసం గుర్తొచ్చింది.
చీమల నివాసాన్ని స్వంతం చేసుకోవాలనే దుర్బుద్ధి పుట్టింది. చేతులు కడుక్కుంటూ, " మీ ఆతిథ్యం ఎంతో నచ్చింది. అయితే ఇంత పెద్ద నివాసం మీకు అనవసరం. నాలాంటి పెద్దమనుషులు ఉండడానికి తగినదిది. వెంటనే మీరంతా ఈ చోటును ఖాళీ చేసి ఇంకో తావు వెతుక్కోండి." మెల్లగా చెప్పినా దాని కంఠంలో అహంకారం ధ్వనించింది.
యువచీమలకు ఆ మాటలు ఆగ్రహాన్ని తెప్పించాయి. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే దుష్టులను వదలకూడదనుకున్నాయి. సర్పాలలాంటివే తమ దెబ్బకు తోక ముడిచిన సంఘటనలు జ్ఞప్తికొచ్చాయి. ఎలుకపై దాడి చేయాలనుకుంటున్న వాటి ఆలోచనను వృద్ధచీమలు పసిగట్టి, ఓర్పుతో ఉండాలని సూచించాయి.
అన్నిటికంటే పెద్దచీమ మాట్లాడుతూ, "నువ్వుంటానంటే వెంటనే ఖాళీ చేయకుండా ఉంటామా? నీ కంటే ఆప్తులు ఎవరున్నారు?! అయితే ఒక్కమాట... ఇక్కడికి అతిదగ్గరలోనే మా పాత నివాసమొకటుంది, దానిని కూడా చూడు. ఈ రెండింటిలో నీకేది నచ్చితే దానిలో ఉందువు, మిగిలిన దాంట్లో మేముంటాం" అని వినయంగా చెప్పింది. దాని ఉపాయమేంటో తెలిసిన మిగిలిన చీమలు నిశ్శబ్దమయ్యాయి.
చీమల వినయం ఎలుకకు ముచ్చటగాఉంది. బలవంతం చేయకుండానే ఒప్పుకున్నందుకు సంతోషంగా ఉంది. " అలాగా... అది ఎక్కడుందో చూపండి.." గర్వంగా నవ్వుతూ అడిగింది. చీమలన్నీ బయటికి వచ్చి కొంతదూరం నడిచి కనుచూపుమేరలో కనబడుతున్న ఒక పుట్టను చూపాయి.
’ నువ్వైతే వేగంగా వెళ్ళిరాగలవు. ఒక్కడివే వెళ్ళి చూసి వచ్చి నిర్ణయం చెప్పు.’ అని ఎలుకను సాగనంపాయి.
ఆత్రుతతో పరుగు పరుగున వెళ్ళి పుట్టలోకి దూరింది ఎలుక. లోపల నిశ్శబ్దంగా ఉంది. కళ్ళు కాస్త చీకటికి అలవాటు పడ్డాక తేరిపారా చూసిన ఎలుక గుండె గుభేల్మంది. ఓ మూల నిద్రిస్తోన్న త్రాచుపాము కనిపించింది. కంగారులో వచ్చిన దారిని మరచిన ఎలుక అటూ ఇటూ పరుగులు పెట్టింది. ఆ చప్పుడుకు లేచిన త్రాచుకు ఎలుకను చూడగానే ఆకలి ముంచుకొచ్చింది. పడగ విప్పి ఎలుకపై దూకింది. అదృష్టవశాత్తు.... వచ్చినదారి అప్పుడే కనిపించి ఎలుకపరుగందుకుంది. అయితే దాని తోక మాత్రం పాము నోటికి చిక్కి తెగిపోయింది. ’తోక పోతే పోయింది, ప్రాణం మిగిలింది’ అనుకుంటూ పరుగు ఆపకుండా తన నివాసానికి వచ్చింది ఎలుక.
ఇంకెన్నడూ చీమలవైపు కన్నెత్తి చూడలేదు. తనకంటే చిన్నవాటి పట్ల చులకనభావాన్ని ప్రదర్శించలేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి