25, మార్చి 2010, గురువారం

చీమల తెలివి



ఒక చీమల కుటుంబం తమ పుట్టలోపల సంభాషిస్తూ భోజనం చేస్తున్నాయి. హటాత్తుగా ఒక ఎలుక వాటి నివాసం లోకి వచ్చింది. చీమలు సంభాషణ ఆపాయి. అనుమతి లేకుండా వచ్చినందుకు కోపంగా ఉన్నా, అతిథి ధర్మాన్ని పాటించి " అన్నయ్యా... ఇలా చెప్పాపెట్టకుండా వచ్చావేమిటి? కాస్త కబురందించినా నీకొరకు ప్రత్యేకవంట చేసేవారం కదా! అయినా నీ మర్యాదకు లోటేం లేదులే... భోంచేద్దువురా..." అని ఆప్యాయంగా పిలిచియాయవి.
ధాన్యం మేసేటప్పుడు రైతు గమనించి తరిమితే పారిపోతూ పుట్టలోకి దూరిందా ఎలుక! కానీ, ఆ విషయాలేమీ చెప్పకుండా, "పర్లేదులే.... మీరెలాఉన్నారో చూద్దామనే వచ్చాను. మీరంతా క్షేమంగానే ఉన్నారు కదా?" అని కుశల ప్రశ్నలు వేసింది. అలా మాట్లాడుతూనే భోజనానికి కూర్చుంది. చీమలు బియ్యం పాయసం, గోధుమ రొట్టెలు, పెసరపప్పు వడ్డించాయి. ఆ పదార్ధాలు చూసి ఎలుక మతిపోయింది. తను ఏనాడూ అలాంటివి తినలేదు. ఏవో నాలుగు గింజలు తినడం, నీళ్ళతో నోరు తడుపుకోవడమే తనకు తెలుసు. చీమల వైభోగానికి కళ్ళుకుట్టాయి. చుట్టూ పరికించి చూసింది. రకరకాల గదులుగా ఉంది నివాసం. ఓ మూలన సేకరించిన ధాన్యపుగింజలు, పప్పులు, పంచదార పలుకులు రాశులుగా పోసి ఉన్నాయి. అదంతా చూడగానే ఎలుకకు గుడ్డపేలికలు, ధాన్యపు నూక , తవుడు నిండి ఉండే తన నివాసం గుర్తొచ్చింది.
చీమల నివాసాన్ని స్వంతం చేసుకోవాలనే దుర్బుద్ధి పుట్టింది. చేతులు కడుక్కుంటూ, " మీ ఆతిథ్యం ఎంతో నచ్చింది. అయితే ఇంత పెద్ద నివాసం మీకు అనవసరం. నాలాంటి పెద్దమనుషులు ఉండడానికి తగినదిది. వెంటనే మీరంతా ఈ చోటును ఖాళీ చేసి ఇంకో తావు వెతుక్కోండి." మెల్లగా చెప్పినా దాని కంఠంలో అహంకారం ధ్వనించింది.
యువచీమలకు ఆ మాటలు ఆగ్రహాన్ని తెప్పించాయి. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే దుష్టులను వదలకూడదనుకున్నాయి. సర్పాలలాంటివే తమ దెబ్బకు తోక ముడిచిన సంఘటనలు జ్ఞప్తికొచ్చాయి. ఎలుకపై దాడి చేయాలనుకుంటున్న వాటి ఆలోచనను వృద్ధచీమలు పసిగట్టి, ఓర్పుతో ఉండాలని సూచించాయి.
అన్నిటికంటే పెద్దచీమ మాట్లాడుతూ, "నువ్వుంటానంటే వెంటనే ఖాళీ చేయకుండా ఉంటామా? నీ కంటే ఆప్తులు ఎవరున్నారు?! అయితే ఒక్కమాట... ఇక్కడికి అతిదగ్గరలోనే మా పాత నివాసమొకటుంది, దానిని కూడా చూడు. ఈ రెండింటిలో నీకేది నచ్చితే దానిలో ఉందువు, మిగిలిన దాంట్లో మేముంటాం" అని వినయంగా చెప్పింది. దాని ఉపాయమేంటో తెలిసిన మిగిలిన చీమలు నిశ్శబ్దమయ్యాయి.
చీమల వినయం ఎలుకకు ముచ్చటగాఉంది. బలవంతం చేయకుండానే ఒప్పుకున్నందుకు సంతోషంగా ఉంది. " అలాగా... అది ఎక్కడుందో చూపండి.." గర్వంగా నవ్వుతూ అడిగింది. చీమలన్నీ బయటికి వచ్చి కొంతదూరం నడిచి కనుచూపుమేరలో కనబడుతున్న ఒక పుట్టను చూపాయి.
’ నువ్వైతే వేగంగా వెళ్ళిరాగలవు. ఒక్కడివే వెళ్ళి చూసి వచ్చి నిర్ణయం చెప్పు.’ అని ఎలుకను సాగనంపాయి.
ఆత్రుతతో పరుగు పరుగున వెళ్ళి పుట్టలోకి దూరింది ఎలుక. లోపల నిశ్శబ్దంగా ఉంది. కళ్ళు కాస్త చీకటికి అలవాటు పడ్డాక తేరిపారా చూసిన ఎలుక గుండె గుభేల్మంది. ఓ మూల నిద్రిస్తోన్న త్రాచుపాము కనిపించింది. కంగారులో వచ్చిన దారిని మరచిన ఎలుక అటూ ఇటూ పరుగులు పెట్టింది. ఆ చప్పుడుకు లేచిన త్రాచుకు ఎలుకను చూడగానే ఆకలి ముంచుకొచ్చింది. పడగ విప్పి ఎలుకపై దూకింది. అదృష్టవశాత్తు.... వచ్చినదారి అప్పుడే కనిపించి ఎలుకపరుగందుకుంది. అయితే దాని తోక మాత్రం పాము నోటికి చిక్కి తెగిపోయింది. ’తోక పోతే పోయింది, ప్రాణం మిగిలింది’ అనుకుంటూ పరుగు ఆపకుండా తన నివాసానికి వచ్చింది ఎలుక.
ఇంకెన్నడూ చీమలవైపు కన్నెత్తి చూడలేదు. తనకంటే చిన్నవాటి పట్ల చులకనభావాన్ని ప్రదర్శించలేదు.

19, మార్చి 2010, శుక్రవారం

ధైర్యవంతుడు



నందవరంలో ఉండే కార్తీక్ ఆరవతరగతి చదువుతున్నాడు. తనంత ధైర్యస్థుడు ఎవరూ లేరని స్నేహితులవద్ద బీరాలు పలుకుతుండేవాడు. పాఠశాల ప్రక్కనే చుప్పనాతి సూరయ్య పొలం ఉంది. విద్యార్ధుల దృష్టి ఎప్పుడూ ఆ పొలంలో విరగకాసి ఉండే రెండు మామిడి చెట్లపై ఉండేది. అవి పూత పెట్టినప్పటినుంచి కాపు అయిపోయేంతవరకూ ఒక కంట వాటిని కనిపెట్టి , వీలును బట్టి కోసుకునేవారు. అయితే ఆ ప్రయత్నాలలో సూరయ్య చేతులకు చిక్కి తిట్లు తిన్నవారే అధికం.
ఒక్క కాయ కోసుకురావడమే కష్టమైతే, ఒడి నిండా దూసుకుతెస్తానని కార్తీక్ స్నేహితులతో పందెం కాశాడు. సూరయ్యకు దొరికిపోతే ఓడినట్లే! సాయంత్రం బడి సమయం పూర్తయ్యాక పుస్తకాలు ఇంట్లో పెట్టి... పొలం వైపు దౌడు తీసాడు. పందెం వేసిన స్నేహితులు బడి వద్ద ఉన్నారు. వారికి చేతులు ఊపి మెల్లగా చేలోకి వెళ్ళాడు. కార్తీక్ ఇలా పోవడం, మరో వైపు నుంచి సూరయ్య పొలంలోకి వెళుతుండడం గమనించారు విద్యార్ధులు. కార్తీక్ కు తిట్లు తప్పవని గ్రహించి, సూరయ్యకు కనిపించకుండా తమ ఇళ్ళకు బయలుదేరారు.
శీతాకాలం కావడంతో త్వరగా చల్లబడుతోంది. కార్తీక్ వడివడిగా మామిడిచెట్టు వద్దకు చేరి పైకి ఎగబ్రాకాడు. చెట్టు నిండా ఉన్న పళ్ళలో అక్కడక్కడా అరమగ్గినవి ఉన్నాయి. వాటిని వెతికి కోసి నిక్కరు జేబుల్లో నింపుకున్నాడు. అతనా ప్రయత్నంలో ఉండగానే చెట్టు క్రింద కాస్త అలికిడి అయ్యింది. క్రిందకు చూసిన కార్తీక్ ఖంగుతిన్నాడు. చుట్ట త్రాగుతూ సూరయ్య కనిపించాడు. అతను పైకి చూస్తే తనకు తిప్పలు తప్పవని గ్రహించి మెల్లగా ఆకులు గుంపుగా ఉన్న భాగానికి చేరుకున్నాడు. అక్కడ సూరయ్యకు కనిపించనని నిర్ధారించుకున్నాడు.
ఓ పది నిమిషాలు గడిచింది. ఆకులు తొలగించి చూసిన కార్తీక్ కు అక్కడే ఉన్న సూరయ్య కనిపించాడు.గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. పూర్తిగా చీకటి పడింది. మళ్ళీ ఆకుల చాటు నుంచి తొంగిచూసాడు. తెల్లటి చొక్కా, పంచె లతో ఆకారం కనిపించింది. తను క్రిందికి వచ్చేదాకా సూరయ్య అక్కణ్ణించి కదలడని అర్ధమైంది. చలి పెరుగుతోంది....... అర్ధరాత్రి వేల మళ్ళీ చూసిన కార్తీక్ కు సూరయ్య ఆకారం అలాగే కనిపించింది. క్రిందకు దిగలేని పరిస్థితి... ఉందామంటే అపరిమితమైన చలి! తెల్లవారేవరకు ఉండక తప్పదని నిర్ణయించుకుని కళ్ళు మూసుకున్నాడు. ఎప్పుడో తెల్లవారుఝామున నిద్రపట్టింది.
ఉదయం సూర్యకిరణాలు వెచ్చగా తాకాక మెలకువ వచ్చింది. అదే భయంతో కళ్ళు తెరచి ఆకులు జరిపి చూశాడు. పంచె, చొక్కా వేసిన దిష్టిబొమ్మ కనిపించింది. దాని తలపై కుండ బోర్లించిఉంది. ఆ కుండపై కళ్ళు, ముక్కు లాగా సున్నపుబొట్లు పెట్టి ఉన్నాయి. ఓ ప్రక్క ఆశ్చర్యం, మరోపక్క సిగ్గేసింది. మెల్లగా చెట్టు దిగి ఆ బొమ్మను చూసి నవ్వుకున్నాడు కార్తీక్. సూరయ్య ఆ బొమ్మను పెట్టేందుకే చెట్టు క్రిందకు వచ్చాడని గ్రహించాడు. ఇంటివైపు నడుస్తూ... ’ ఇంకెన్నడూ ఇతరులను పిరికివాళ్ళుగా, తనను ధైర్యవంతునిగా చెప్పుకోకూడదనుకున్నాడు.

18, మార్చి 2010, గురువారం

పొడి ఉంగరం




ఉత్కళరాజ్యానికి సైనికుల కొరత ఏర్పడింది. అత్యవసరంగా సైనికుల ఎంపిక చేసుకుంటేనే పొంచిఉన్న శత్రురాజులను ధీటుగా ఎదుర్కోవచ్చు. ఒక రోజు.. మహారాజు మంజునాధుడు సేనాని జ్ఞానవర్మను పిలిచి " సైనిక నియామకం చేపట్టండి. కొద్దిరోజుల్లోనే సైనికశక్తి పూర్వం కంటే అధికం కావాలి. అలాగే సైనికులకు కేవలం కండబలమే గాక బుద్ధిబలం కూడా ఉండేలా ఎంపిక చేయండి." అని సూచించాడు.
అంగీకరించిన జ్ఞానవర్మ తక్షణమే ఆ పనిలో నిమగ్నమయ్యాడు. అభ్యర్ధులందరినీ రాజధానికి పిలిచే బదులు, తానే గ్రామాల్లో పర్యటించి మెరికల్లాంటి వారిని గుర్తించాలని నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజూ కొన్ని గ్రామాలు తిరుగుతూ చురుకైన, తెలివైనవారిని సైనికులుగా తీసుకోసాగాడు.
ఆ పనిలో భాగంగానే... ఒకనాడు శ్రీపతిపురానికి వెళ్ళాడు. రచ్చబండ వద్ద ప్రజలందరినీ సమావేశపరిచి తన పర్యటన ఉద్దేశ్యం తెలియపరిచాడు. సైన్యంలో కొలువు అనగానే యువకులు ఎగిరి గంతేశారు. పరుగుపందెం, బరువులెత్తడం, మల్లయుద్ధం,... ఇలా పలు శారీరక పరీక్షల్లో పదిమంది యువకులు చక్కటి ప్రతిభను చూపారు.
వారిని వరుసగా నిల్చోబెట్టి, " అన్ని పరీక్షల్లోనూ మీరు గెలిచారు. అయితే చివరగా ఓ సమస్యను మీ ముందు ఉంచుతాను. తమ తెలివితో పరిష్కారం చూపినవారికి కొలువు ఖాయం! మిగతావారు నిరాశ చెందాల్సిన పనిలేదు. వారిని గ్రామరక్షణ కొరకు నియమిస్తాం." అని సమస్య చెప్పడం ప్రారంభించాడు జ్ఞానవర్మ.
" మీ ముందు ఉంచుతున్న ఈ నిండు నీటి పళ్ళెంలో మునిగి ఉన్న ఉంగరాన్ని మీ చేతుల్తో తీయాలి. అయితే నీటి తడి ఏ మాత్రం మీ చేతికి అంటకూడదు. ఉంగరాన్ని తీసేందుకు ఏ వస్తువునూ వాడరాదు, పళ్ళెంను అసలు ముట్టుకోకూడదు. ప్రయత్నించి సఫలమైనవారే విజేత."
అభ్యర్ధుల ముందు పళ్ళెం నిండా నీరు, అందులో ఒక ఉంగరం ఉంచబడింది. పదిమందికీ రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. అయితే పళ్ళేన్ని తాకకుండా, వేరే వస్తువు వాడకుండా ఉంగరమెలా తీయాలో పాలుపోవడం లేదు.
ఆ పదిమందిలోని వర్ధన్ అనే యువకుదు కాసేపు తీవ్రంగా ఆలోచించాక మెరుపులాంటి ఉపాయమొకటి తట్టింది. జ్ఞానవర్మ అనుమతి తీసుకొని వెళ్ళి కొద్ది నిమిషాల్లో ఓ మోపు వంటచెరుకును తీసుకువచ్చాడు. వాటిని పళ్ళెంకు కాస్తదూరంలో గుండ్రంగా అమర్చి మంట పెట్టాడు. వంటచెరుకు కాలుతున్నప్పుడు ఆ వేడికి మధ్యలో ఉన్న పళ్ళెంలోని నీరు కొంచెం కొంచెం ఆవిరి కావడం మొదలుపెట్టింది. పూర్తిగా కాలిపోయే సమయానికి నీరు మొత్తం మాయమై పళ్ళెంలో పొడి ఉంగరం మిగిలింది. దానిని తీసి జ్ఞానవర్మకు అందించాడు వర్ధన్ .
గ్రామస్తులంతా అతని తెలివికి ఆశ్చర్యపోయారు. చప్పట్లతో అభినందనలు తెలిపారు. జ్ఞానవర్మకూడా ఎంతో సంతోషించి వర్ధన్ కు సైనికుడిగా కొలువిస్తున్నట్లు ప్రకటించాడు. మిగతా తొమ్మిదిమందిని గ్రామరక్షణ సభ్యులుగా నియమించాడు.

15, మార్చి 2010, సోమవారం

సూర్యచంద్రులు



విరాటపురం మహారాజు విచిత్రగుప్తుడు ’ తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్ళు’ అని హఠం చేసే వ్యక్తి, మూర్ఖశిఖామణి! ఒకరోజు రాత్రి ఆయన ఉద్యానవనంలో సంచరిస్తున్నాడు. ఆకాశంలో వెన్నెల వెండివర్షం కురిపిస్తున్నట్లుంది. చందమామను తదేకంగా చూసిన మహారాజుకు ఎంతో అసూయ కలిగింది. ’ చంద్రుడు తనకంటే ఉన్నతుడి’లా తోచాడు. తక్షణమే సూర్యుడు, నక్షత్రాలు కూడా తన తల పైనే ఉంటారనే విషయం జ్ఞప్తికి వచ్చింది. తన సింహాసనం కంటే ఎత్తులో వారుండడం అవమానంగా తోచింది ఆయనకు.
మరుసటిరోజు సభలో... మహామంత్రి మాధవవర్మతో, " మహామంత్రీ... ఈ ప్రపంచంలో నాకంటే ఉన్నతులున్నారా?" అని ప్రశ్నించాడు. రాజు మొండితనం, మూర్ఖత్వం తెలిసినవాడు కాబట్టి "ఎవరూ లేరు ప్రభూ.." వినయంగా చెప్పాడు మాధవవర్మ.
" ఉన్నతులుగా నటిస్తున్నవారు ఉన్నారు.. నీకు తెలుసా?"
" ఎవరు ప్రభూ ఆ దుర్మార్గులు.. వారికి శిరచ్ఛేదం విధిద్దాం, వారెవరో సెలవివ్వండి" కోపం ప్రదర్శిస్తూ అన్నాడు మాధవవర్మ.
" వారెవరో కాదు మహామంత్రీ.... సూర్యుడు,చంద్రుడు,నక్షత్రాలు. తక్షణం వారు ఆకాశం వీడి వచ్చి నాకు క్షమాపణలు చెబితే సరి. లేకుంతే వారిపై దండయాత్ర చేద్దాం. క్షమాపణలు చెప్పిస్తారో.. యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేస్తారో రెండు దినాల్లో తేల్చుకునిరండి. నా మనస్సు అవమానభారంతో రగిలిపోతోంది" అంటూ సభలోంచి విసవిసా అంతఃపురంలోకి వెళ్ళాడు విచిత్రగుప్తుడు.
సభికులతోపాటు మాధవర్మ, విదూషకుడు కిరీటి తెల్లముఖం వేశారు. దేశాన్ని, ప్రజల్ని రక్షించే బాధ్యత మాధవవర్మదే అన్నట్లు అంతా ఆయనవైపు తదేకంగా చూశారు.
* *
మరుసటిరోజు సభ ప్రారంభం కాగానే వచ్చాడు మాధవవర్మ. ఆయన వెనకాలే కిరీటి ఉన్నాడు. విచిత్రగుప్తుడికి నమస్కరించి," రాజా... మీ ఆజ్ఞ మేరకు సూర్యచంద్రులు, నక్షత్రాలకు కబురు పంపాము. ’ అల్ప ప్రాణులమైన తమపై దండయాత్ర తగద’ని వేడుకున్నారు. రాబోయే శనివారంనాడు సూర్యుడు, ఆపై ఓ పక్షం రోజుల తర్వాత చంద్రుడు, నక్షత్రాలు ఉద్యానవనంలో మీకు క్షమాపణలు చెబుతామని విన్నవించుకున్నారు. కావున యుద్ధసన్నాహాలు చేయించలేదు." సభికులు మంత్రముగ్ధులై వింటుండగా చెప్పాడు.
వెంటనే కిరీటి అందుకొని," వారి వేడుకోలుకు నేను కూడా సాక్షిని ప్రభూ.... వారు మాట తప్పితే మరుక్షణమే శిక్షించేందుకు యుద్ధానికి సమాయత్తమవుదాం. అప్పటివరకు మీరు శాంతించాలి.." అంటూ విచిత్రగుప్తుడిని చల్లబరిచాడు.
మాధవవర్మ చెప్పిన శనివారం వచ్చింది. ఉద్యానవనంలో సూర్యుడి క్షమాపణకై ఎదురుచూస్తున్న విచిత్రగుప్తుడికి అమితాశ్చర్యం కలిగిస్తూ...... ఆకాశంలో చీకటి కమ్ముకుంది, పక్షులు గూళ్లకు చేరుకోసాగాయి. " సూర్యుడు శరణు కోరేందుకు రాబోతున్నాడు. అయితే తను ప్రాధేయపడడమే మీకు వినబడుతుంది, ఎదురుపడితే మీరు కోపోద్రిక్తులవుతారని తన భయం." మెల్లగా చెప్పాడు మాధవవర్మ.
అతను చెప్పినట్లుగానే," భూపాలా... నన్ను క్షమించు. నీకంటే అల్పుడను, అవసరార్ధం ఆకాశంలో ఉండవలసివచ్చింది. దయచేసి నాపై యుద్ధానికి రాకు." అనే మాటలు వినిపించాయి. విచిత్రగుప్తుడు ఎంతో సంతోషించాడు. కాసేపటికే చీకటి పోయి వెలుతురు వచ్చింది.
అదేవిధంగా పక్షం రోజుల తర్వాత రాత్రి అదే ఉద్యానవనంలో చంద్రుడు, నక్షత్రాలు ఆకాశం నుంచి మాయమై విచిత్రగుప్తుడిని క్షమపణలు కోరారు.
ఈ రెండు సంఘటనల తర్వాత విచిత్రగుప్తుడి కోపమంతా తగ్గిపోయింది. మాధవవర్మ, కిరీటి లను పొగిడాడు. అయితే వారిద్దరు మాత్రం వెంటవెంటనే వచ్చిన సూర్య, చంద్రగ్రహణాలకు ఓ నమస్కారం తెలుపుకోని...... గండం గడిచినందుకు సంతోషించారు. ఆపత్కాలంలో మంచి సలహా ఇచ్చినందుకు మాధవవర్మ కిరీటీని పొగిడితే, కిరీటి మాత్రం ’ఘనతంతా దీనిదే’ అంటూ తన చంకలోని ఖగోళశాస్త్ర పుస్తకాన్ని చూపాడు. దానిలో సూర్యకుటుంబంలోని గ్రహగతులు, సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడే తేదీలు వివరంగా ఉన్నాయి. అది చూసిన మాధవవర్మ " నీ హాస్యంతో సభికులను ఆనందింపజేయడమేగాక, విజ్ఞానం పట్ల నీకున్న ఆసక్తితో ఓ పెద్ద విపత్తు నుంచి రక్షించావు." భుజం తట్టి సంతోషంగా చెప్పాడు.
మూర్ఖరాజు ముందు ముందు ఇంకెవరిమీద యుద్ధాలు చేస్తాడో?

7, మార్చి 2010, ఆదివారం

బాలసాహిత్యం చదువుతున్నారా?

వివిధ దిన, వార, మాసపత్రికలలో ప్రచురితమవుతున్న బాలసాహిత్యంలో కొంతైనా మీరు చదువుతున్నారా? మీకొరకే ఉద్దేశించి వ్రాయబడ్డ కథ, కవిత, గేయం, నాటకం,నవల,.... ల ద్వారా ఎన్నో నూతనవిషయాలు, ఆశ్చ్యర్యానుభూతులను పొందవచ్చు. గొప్ప సృజనాత్మకతతో, సరళమైన భాషతో వ్రాయబడే బాలసాహిత్యం మీ బాల్యాన్ని పరిపూర్ణం చేస్తుంది. మనకు వయసు వచ్చినా మదిలోని బాల్యపు మధురస్మృతులను చెరిగిపోకుండా చేస్తుంది.
కంప్యూటర్ విప్లవాలు, ఎలక్ట్రానిక్ మీడియా విస్తృతంగా వ్యాప్తిచెందని గతకాలంలో చిన్నారులకు సమాజాన్ని పరిచయం చేసింది, జ్ఞానాన్ని కలిగించింది బాలసాహిత్య పత్రికలే! బాల, చిన్నారిలోకం, చందమామ, బాలజ్యోతి, బాలమిత్ర, బాలభారతి, బొమ్మరిల్లు, బుజ్జాయి,... లాంటి పత్రికలు బాలల ప్రపంచాన్ని అందమైన అనుభూతులతో నింపాయి. చిట్టి చిట్టి విజ్ఞానశాస్త్రప్రయోగాలు-మ్యాజిక్ చేయడం,ఏకాంకికలు ప్రదర్శించడం,... లాంటి సానుకూలఫలితాలు కలిగాయి. బాలసాహిత్య పుస్తకం మార్కెట్ లోకి వచ్చిందంటేనే ఎంతో సందడిగా ఉండేది. తలా ఒక పుస్తకం కొని వాటిని మార్చుకుని చదవడం ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేనివి. ఈ మార్పిడితోనే ఒకే అభిరుచి ఉన్నవారు స్నేహితులుగా మారడం జరిగేది.
ప్రస్తుతం మీకు ఇవన్నీ కొత్తగా ఉండొచ్చు... మాకు మాత్రం తియ్యని అనుభూతినిస్తూనే ఉంటాయి. నేడు వేగం పెరిగింది, అస్సలు తీరిక లేకుండా మీరు శ్రమిస్తూ ఉన్నారు. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేస్తున్నామని మీరు మురిసిపోవచ్చు, ర్యాంకుల లక్ష్యాలతో దూసుకుపోవచ్చు! కానీ, వేగమే ప్రధానం కాదు. నిలబడి ఆలోచించే తీరిక కూడా చేసుకోవాలి. మన దైనందిన చర్యలు మన అభివృద్ధికి ఎంతవరకు దోహదపడుతున్నాయో ఆలోచించండి. బాలసాహిత్య పఠనంవల్ల మనకు జరిగే మేలును ఓ సారి పరిశీలిద్దాం.
హితాన్ని(మంచిని) కోరేదే సాహిత్యం. అందులోనూ మీకొరకు వ్రాయబడినదే బాలసాహిత్యం. సరళంగా ఉండి, ఎంతో ఆహ్లాదకరమైన అంశాలతో కూడి మనకు నీతిని బోధిస్తుందది. చిత్రవిచిత్రాలు, ప్రకృతివర్ణనలు, రాజ్యాలు-యుద్ధాలు, సాహసాలు, హాస్యం,... ఇలా ప్రతి అంశమూ మనల్ని ఆలోచింపజేస్తుంది, రంజింపజేస్తుంది! బాలసాహిత్యాన్ని అమితంగా చదివి ఎంతోమంది మీలాంటి చిన్నారులు కూడా రచయితలుగా మారి ’బాలల సాహిత్యాన్ని’ సృజించారు.
సాహిత్యం మన వ్యక్తిత్వాన్ని ఎంతో మార్చుతుంది. ముఖ్యంగా పఠనాభిలాష పెంపొందిస్తుంది. పుస్తకం ప్రాణ స్నేహితుడిగా మారిపోతుంది. ఆ అలవాటు జీవితాంతం మన ఉన్నతికి దోహదపడుతూనే ఉంటుంది. దినపత్రికలు ఒకసారి తిరగేసి చూడండి, మీకోసం ఎన్ని పేజీలు ఎదురు చూస్తున్నాయో తెలుస్తుంది.

2, మార్చి 2010, మంగళవారం

లక్ష్యానికి తగ్గ ప్రణాళిక ఉండాలి:

లక్ష్యాలను ఏర్పరచుకోవడం వాటిని సాధించడంలో పొందే లాభాలను గురించి గతంలో చర్చించుకున్నాము.విజయసాధనలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి, ఎన్నో అనుభవాలు మన స్వంతమవుతాయి. అయితే ఏ లక్ష్యాన్ని సాధించడానికైనా దానిని సులభతరం చేసే ప్రణాళికను రచించుకోవడం ఎంతో అవసరం. ఈ ప్రణాళిక విజయానికి దోహదపడడమేగాక ఎంతో ఒత్తిడిని తగ్గించి మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.
యుద్ధం చేసేటప్పుడు శత్రుసైనికుల బలాలు, బలహీనతలు,మన సామర్ధ్యం అంచనాలోకి తీసుకుని...... ఎక్కడ, ఎలాంటి సమయంలో శత్రువులను దెబ్బతీస్తే విజయం లభిస్తుందని ప్రణాళికలు, పథకాలు సిద్ధం చేస్తారు. ముంబై పై జరిగిన ఉగ్రవాదదాడుల్లో ఎన్.ఎస్.జి. కమెండోలు చేసిన వ్యూహరచన, దాడులు, సాధించిన విజయం ప్రసారమాధ్యమాల వల్ల మనకు తెలిసిందే. ప్రణాళికలో తప్పులుంటే ఎంతటి పరాజయం, అవమానం మనకు మిగిలిఉండేవి?
ప్రతి లక్ష్యసాధనను యుద్ధం చేస్తున్నట్లే భావించాలి.అయితే ఇక్కడ మరణాయుధాల అవసరం ఉండదు. మన మానసికశక్తుల బలం ముఖ్యం. ముందుగా మనం నిర్ధేశించుకున్న లక్ష్యం గురించి ఆలోచించాలి. దానిని సాధించడం మనకు సాధ్యమవుతుందా? లేదా? అనే పరిశీలన నిష్పాక్షింగా చేసుకోవాలి. ఈ పరిశీలనలో అతి అత్మవిశ్వాసం, ఆత్మన్యూనత రెండూ పనికిరావు. ’మనకు సాధ్యమేనని నిర్ణయించుకున్నాక లక్ష్యాన్ని చిన్న చిన్న విభాగాలుగా( స్వల్ప లక్ష్యాలుగా) విభజించుకోవాలి. దీనివల్ల ఎంతో ఉపయోగముంది. స్వల్ప లక్ష్యాలను సాధించడం సుళువేగాక, సాధించాక పొందే ఆనందం ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
ప్రతి స్వల్పలక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను ఊహించుకుని వాటిని నమోదు చేసుకోవాలి. వాటి పరిష్కారానికి మనమేం చేయగలమో అంచనా వేసుకోండి. ఉదాహరణకు వార్షికపరీక్ష(యాన్యువల్ ఎగ్జామ్) అనే పెద్ద లక్ష్యాన్ని ఒకేసారి సాధించడం కష్టం కాబట్టే స్లిప్ టెస్ట్, యూనిట్, క్వార్టర్లి, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వ్రాసి స్వల్ప లక్ష్యాలను సాధించి సిద్ధమవుతాము. ఈ స్వల్పలక్ష్యాలను సాధించే క్రమంలో మన శక్తియుక్తులు బయటపడతాయి. మనలోని లోపాలను సవరించుకునేందుకు అవకాశముంటుంది. కొత్త సామర్ధ్యాలను, నైపుణ్యాలను మెల్లగా పొందుపరచుకోగలుగుతాము.
ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో అనుకున్నది పొందలేకపోవడం వైఫల్యం కాదు. ఈ ప్రయత్నంలో ఎంతో విలువైన, ఎవరికి లభించని అనుభవం మన స్వంతమవుతుంది. ఆ అనుభవం మనకు ఇతర అంశాల్లో, సమస్యా పరిష్కారాల్లో ఉపయోగపడుతుంది. గొప్ప లక్ష్యాలను ఏర్పరచుకొని..... దానికి తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటే విజయం మీ అక్కున చేరుతుంది.

మార్కులు మీ ప్రతిభకు నిదర్శనం కాదు:

నియమబద్ధంగా పాఠశాలకు వెళ్ళి ’ఫస్ట్ ర్యాంకు’లు తెచ్చుకోకపోయినా ఎంతోమంది సుప్రసిద్ధులయ్యారు. తాము వెళ్ళిన మార్గంలో మరికొందరు నడిచేలా స్పూర్తినిచ్చారు. వారు మార్కులు సరిగా రాలేదని, ర్యాంకుల పట్టికలో తమ పేరు లేదని ఏనాడూ చింతించలేదు. ఏ విషయంపై తమకు ఆసక్తి ఉందో గమనించారు. ఆ రంగంలో ఉన్నతస్థానం పొందేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలో నిర్ణయించుకున్నారు. వాటిని పట్టుదలతో అమలుపరిచి చరిత్రపుటల్లో తమకంటూ కొంత స్థలాన్ని కేటాయించుకున్నారు. పరీక్షల్లో పలుమార్లు విఫలుడైన ఐనస్టీన్, చిన్నప్పుడే చదువు మానేసిన ఎడిసన్, కంప్యూటరే తనలోకమని నమ్మిన బిల్ గేట్స్, ప్రాథమికస్థాయిలోనే బడి ఒదిలి సంగీతపు ఒడి చేరిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ,... ఇలా చెప్పుకుంటూ వెళితే ఎందరో మహానుభావులు జీవితంలో విజయం ఎలా సాధించవచ్చో సగర్వంగా చాటుతున్నారు.
ఇంతకీ ’మార్కులు’ మన ప్రతిభను వెల్లడిచేయవా? అని ప్రశ్నించుకుంటే.... అవి మన విషయజ్ఞానాన్నే తెలుపుతాయి. విషయజ్ఞానం తెలివితేటల్లో భాగమేకాని అదే సర్వస్వం కాదు. కానీ, నేడలా భావించడంలేదు. మార్కులు పొందితే చాలు... జ్ఞానవంతులు, తెలివిగలవారిగా మారిపోయినట్లేనని ప్రచారం సాగుతుండడం ఎంతో విచారకరం. ఇలాంటి అసంబద్ద నమ్మకాలవల్లనే ఎలాగైన నూటికి నూరు మార్కులు సంపదించాలన్న కాంక్ష మీలో పెరిగిపోతోంది. మీ తల్లిదండ్రులు కూడా దానికి తగ్గట్టు ఒత్తిడి చేస్తున్నారు. వచ్చిన అత్యధిక మార్కుల్ని పక్కనబెట్టి రాని స్వల్పమార్కులకై మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు.
ఒకటి రెండు మార్కులు తగ్గినంత మాత్రాన ఏమాత్రం చింతించవద్దు. తల్లిదండ్రులకు కూడా నచ్చజెప్పేందుకు ప్రయత్నించండి.మీకు ఏ రంగంలో ఆసక్తి ఉందో వారికి తెలపండి. వీలున్నంతవరకు ఆ రంగంలో అభివృద్ది చెందేందుకు శిక్షణ ఇప్పించమనండి. మనం ఇష్టం పెంచుకుంటున్న రంగంలో మన ఆసక్తిని, ప్రతిభను కొలిచేందుకు అభిరుచి, వైఖరి పరీక్షలు (ఆప్టిట్యూడ్ , ఆటిట్యూడ్ టెస్ట్) ఉంటాయి. వాటిలో పాల్గొని మన అవగాహన ఎంత ఉందో అంచనా వేసుకోవచ్చు.
మార్కుల్ని మరిచిపొమ్మన్నాం కదా... అని పాఠ్యాంశాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే మొదటికే మోసం వస్తుంది. మనం కోరిన రంగంలో అభివృద్ధి సాధించాలంటే పాఠ్యాంశాల పరిజ్ఞానం ఎంతో అవసరం. గురువు బోధించే పాఠాలను పూర్తి ఏకాగ్రతతో వింటే నూటికి తొంబై శాతం మీకు గుర్తుంటుంది. చూడకుండా చెప్పడం, వ్రాయడం ద్వారా ఆ పాఠాలు మన మెదడులో శాశ్వతంగా గుర్తుంటాయి. ఇక ప్రశ్న ఎంత తికమకపెట్టేలా ఉన్నా సుళువుగా వ్రాసి ఎక్కువ మార్కులు పొందొచ్చు. మార్కులు తగ్గితే తరువాయి దఫా పరిక్షల్లో పెరిగేందుకు కృషి చేయాలేగాని.... కుంగిపోవడం,నిరాశ చెందడం విజ్ఞత కాదు. మీ ఆసక్తిని మీరు ప్రశ్నించుకోండి... అందులో కృషి చేయండి. పూర్తిగా మార్కుల్నే పట్టుకు వేలాడితే మార్కులే మిగులుతాయి. మనం సాధించే ప్రగతి ఏమీ ఉండదు.