27, జూన్ 2010, ఆదివారం

ప్రణాళిక-క్రమశిక్షణ



మనం నిర్దేశించుకున్న పనిని వెంటనే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెట్టడం సరైన పద్ధతే... కానీ, దానివల్ల విజయవంతంగా అ పనిని పూర్తిచేయలేకపోవచ్చు. కాస్త ఆలస్యమైనా చక్కటి ప్రణాళిక వేసుకుని , క్రమశిక్షణతో చేసినప్ప్పుడు పని ఎంత క్లిష్టమైనా సునాయాసంగా పూర్తవుతుందనేది వాస్తవం.
ఓ ప్రముఖుడి జీవితంలోని కొన్నిఘట్టాలను పరిశీలిద్దాం. ఆయన ఒకసారి తన స్వగ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శించి, విద్యార్ధులకు మిఠాయిలు కొనిపెట్టమని ఉపాధ్యాయునికి డబ్బునిచ్చాడు. కానీ ఆ ఉపాధ్యాయుడు, " విద్యార్ధులకు మీ విలువైన సందేశమివ్వండి." అని విజ్ఞప్తి చేశాడు. అప్పటికి ఏవో నాలుగు మాటలు చెప్పినా ఆ ప్రముఖుడికి సంతృప్తి కలుగలేదు. ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రసంగించాల్సి వచ్చినందుకు బాధపడ్డాడు. కొద్దిరోజుల తర్వాత మళ్ళీ అదే పాఠశాలకు వచ్చి ఎంతో ఉత్సాహంగా ప్రసంగించి వెళ్ళాడు. అప్పుడు ఆయన చక్కటి ప్రణాళికతో ప్రసంగానికి సిద్ధమై వచ్చాడు మరి!
1947 లో ఈయన అఖిల భారత ఉత్పత్తిదారుల సంఘానికి అధ్యక్షుడిగా ఓ కార్యక్రమంలో ప్రసంగించాల్సి వచ్చింది. విడిదిగృహంలో తెల్లవారుఝామున నాలుగు గంటలకే లేచి స్నానం ఆచరించి, చక్కటి వస్త్రధారణతో ఆ రోజు చెప్పబోయే ప్రసంగాన్ని చదువుకోసాగాడు. అదే విడిదిలో ఉన్న ఇతర ప్రముఖులు ఆయన క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధమైన ఆచరణను గమనించి ఎంతో ఆశ్చర్యపోయారు.
చక్కటి ప్రణాళిక వేసి క్రమశిక్షణతో పూర్తిచేయడం కేవలం ప్రసంగాలకే పరిమితం కాదు. అసాధ్యం అనుకున్న ఎన్నో నిర్మాణాలను అవలీలగా పూర్తి చేయించిన ఘనుడాయన. కృష్ణరాజసాగర్ ఆనకట్ట, గంధపుతైలం-గంధపుసబ్బు పరిశ్రమలు, భద్రావతి ఇనుము-ఉక్కు పరిశ్రమ, మైసూర్ విశ్వవిద్యాలయం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్,... లాంటి ప్రతిష్టాత్మక సంస్థలకు ఆద్యుడాయనే! కర్ణాటక రాష్ట్రం పారిశ్రామికంగా ముందుకు వెళ్ళడానికి కారణం ఆ ప్రముఖుడి ప్రణాళికాబద్దమైన కృషే. తన 102 సంవత్సరాల వయస్సులో ఏనాడుకూడా క్రమశిక్షణ తప్పని ఉత్తమవ్యక్తి, మహామనిషి. ఆయనెవరో కాదు... అందరూ గౌరవంగా ’సర్ ఎం.వి.’ అని పిలుచుకునే ప్రపంచ ప్రఖ్యాత ఇంజినీర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య.
ఇంతకీ ప్రణాళిక లేకుండా ఏ పనీ చేయలేమా? చేయొచ్చు... కానీ, అది మార్గం తెలియని ప్రయాణం లాంటిది. గమ్యానికి ఎంతో ఆలస్యంగా చేరుతాము. ఒక సాధారణ ఇంజినీర్ 60 సంవత్సరాలలో చేయించగలిగిన పనిని ’సర్ ఎం.వి.’ 6 సంవత్సరాలలోనే సాధించాడు. దీనికి కారణం చక్కటి ప్రణాళికను అనుసరించడమే! ప్రణాళికను చిత్తశుద్ధితో అమలు పరిచేందుకు అవసరమైన అంశం... క్రమశిక్షణతో పనిని నిర్వర్తించడం. క్రమశిక్షణ మనలోని శక్తిసామర్ధ్యాలను వెలికి తీస్తుంది. ఎప్పటికప్పుడు పనులను పూర్తిచేయించి మానసికఒత్తిడి లేకుండా చేస్తుంది. ఫలితంగా క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు చక్కటి శారీరక ఆరోగ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ’సర్. ఎం.వి.’ రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉండేవారు.
మరి మీలో ఎంత క్రమశిక్షణ ఉంది? ఒక్క అంశానికైనా ప్రణాళికను తయారు చేసుకుంటున్నారా? పాఠశాలలో బోధింపబడ్డ అంశాలు ఏరోజుకారోజు చదవడం ఉత్తమమైన ప్రణాళిక. మరి మీరు దాన్ని ఆచరిస్తున్నారా? పరీక్షల ముందు మాత్రమే చదివితే ఒత్తిడి తప్ప ఫలితముండదు. ప్రణాళిక ప్రకారం చదివేవ్యక్తులు పాఠ్యాంశాలను అవలీలగా పూర్తిచేయడమేగాక, ఆసక్తి ఉన్న ఇతర అంశాలలో కూడా ప్రావీణ్యం సంపాదిస్తారు. ఎలాంటి ప్రణాళిక లేని వ్యక్తి క్రికెట్ మ్యాచ్ లను వీక్షించడానికి, స్నేహితులతో వ్యర్ధప్రసంగాలకు,.. సమయాన్ని వృధా చేసుకుని పరీక్షలొచ్చాక చింతిస్తాడు.
కేవలం పాఠ్యాంశాలకే కాదు, దైనందిన కార్యక్రమాలను కూడా ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తూ క్రమశిక్షణను అందిపుచ్చుకోండి. అది మీ శారీరక, మానసిక ఆరోగ్యంలో మార్పు తెచ్చి మిమ్ములను గొప్పవారిని చేస్తుంది.

ఈగలమోత

పూర్వం లలాటరాజ్యాన్ని విచిత్రసేనుడు పాలిస్తుండేవాడు. ఒకసారి అతనికో సమస్య వచ్చింది. గుంపులు గుంపులుగా వచ్చిన ఈగలు సభలో తీవ్ర అసౌకర్యాన్ని కలిగించసాగాయి. ఝుమ్మని మోత చేస్తూ సభికులు, రాజు మొహంపై వాలసాగాయి. ఎంత తోలినా తిరిగి వచ్చేవి. కొంతమంది మాట్లాడేటప్పుడు నోటిగుండా పొట్టలోకి జారుకునేవి. వాటి దెబ్బకు అందరూ గగ్గోలు పెట్టారు. పరిష్కారం చూపమని రాజును వేడుకున్నారు. సేవకులు వింజామరలతో వీస్తున్నా అది విచిత్రసేనుడికి ఉపశమనం మాత్రమే కలిగిస్తోంది. అంతఃపురంలోని రాజపరివారమంతా ఈగల వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోసాగారు.
వంద ఈగల్ని చంపితే ఒక బంగారు వరహాను బహుమతిగా ప్రకటించాడు విచిత్రసేనుడు. అది కూడా సరైన ఫలితం ఇవ్వలేదు. పనీపాట లేని వాళ్ళు తప్ప ఇతరులు ఈగల్ని చంపడానికి ఆసక్తి చూపలేదు. దాంతో.... ’ కోటనుంచి ఈగల్ని తక్షణమే తరమగలిగిన వారికి లక్షవరహాలు బహుమతి ఇవ్వబడుతుంద’ ని దండోరా వేయించాడు.
మరుసటిరోజు కిరీటి అనే యువకుడు సభకు వచ్చాడు. ఈగల్ని తరిమేందుకు సిద్ధంగా ఉన్న సంగతి విచిత్రసేనుడికి తెలియపరిచాడు. "నీవు ఏం చేసినా, ఎలా చేసినా... ఈగలమోత మాత్రం ఇక వినపడకూడదు. నీ పనిని ప్రారంభించు." అని రాజు ఆదేశించాడు. సభలోంచి బయటకు వెళ్ళిన కిరీటి ఓ అర్ధగంట తర్వాత తిరిగివచ్చాడు. అతను వచ్చిన కొద్దిసేపటికే ఈగలన్నీ బయటకు జారుకున్నాయి. సభలో ఒక్కటి కూడా లేదు! రాజు, సభికులు ఆనందం, ఆశ్చ్యర్యం కలగలిపిన ముఖాలతో ఉన్నారు.
" ఏం మంత్రం వేశావు? లేక ఏదైనా మాయ చేశావా?" విచిత్రసేనుడు అడిగాడు.
" ఇందులో మాయమంత్రాలు ఏమీలేవు... ఏదో నాకున్న కాస్త లోకజ్ఞానఫలితం" వినయంగా అన్నాడు కిరీటి.
" ఎలా చేసినా పెద్ద ఇబ్బందిని తొలిగించావు. ఇవిగో లక్ష వరహాలు.." అంటూ ధనం మూటను ఇవ్వబోయాడు విచిత్రసేనుడు.
" రాజా.. మీ బహుమతిని స్వీకరించలేకపోతున్నందుకు నన్ను క్షమించండి. ఈగలు మళ్ళీ కోటలోకి వచ్చి గతంలో లాగానే మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. ప్రస్తుతం నేను వాటిని కోట బయటికి మాత్రమే తీసుకెళ్ళగలిగాను. నాది శాశ్వతమైన పరిష్కారం కాదు."
" ఇంతకీ ఏం చేశావు?" గద్దించి అడిగాడు విచిత్రసేనుడు.
" పెద్ద బెల్లం ముద్దను కోట బయట ఉంచి వచ్చాను. దాంతో ఈగలన్నీ బెల్లం చుట్టూ చేరాయి. ఆ ముద్దను పూర్తిగా జుర్రుకోగానే కోటలోకి రావడం ఖాయం."
ఆ మాటలు వినగానే విచిత్రసేనుడికి కోపం తారాస్థాయికి చేరింది.
" మేము కోరింది శాశ్వతపరిష్కారం, ఇలాంటి చిట్కాలు కాదు. సమయం వృధా చేస్తే నీకు కారాగారశిక్ష తప్పదు." ఉచ్ఛస్థాయి గొంతుతో చెప్పాడు.
" శాశ్వతపరిష్కారం మీదగ్గరే ఉంది. విచక్షణ లేని ప్రజలు రాజ్యాన్ని చెత్తకుప్పలు, ఎరువుదిబ్బలుగా మార్చారు. వాటివల్ల పెరిగిన ఈగలు ఎన్నో రోజులనుంది ప్రజల ఆరోగ్యంతో ఆడుకోసాగాయి. పలుసార్లు మీ దృష్టికి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వాటి ప్రభావం అంతఃపురానికి పాకిందనే దండోరా విన్నప్పుడు సమస్య పరిష్కారమవుతుందని సంతోషించాం. రాజ్యపరిస్థితిని పూర్తిగా తెలిపేందుకే వచ్చానుకాని, బహుమతి కోసం కాదు." వివరంగా చెప్పాడు కిరీటి.
విచిత్రసేనుడికి జ్ఞానోదయమైంది. మూలకారణాన్ని తొలగించాలేగాని, ఉపశమనచర్యల వల్ల సమస్య పరిష్కారం కాదని గ్రహించాడు. కిరీటిని మంత్రిగా నియమించుకుని రాజ్యాన్ని సుందరంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే పనిని అప్పగించాడు.

13, జూన్ 2010, ఆదివారం

ఇంగితజ్ఞానం

18, మే 2010, మంగళవారం

మిఠాయి దొంగ



సత్యవోలు గ్రామంలోని పాపయ్యశెట్టికి మిఠాయి దుకాణం ఉంది. స్వచ్ఛమైన నేతితో చేసే అక్కడి తినుబండారాలంటే చుట్టుపక్కల గ్రామాల వారు పడిచస్తారు. వ్యాపారం బాగా జోరు మీదున్న సమయంలో వంటమనిషి అస్వస్థతకు గురయ్యాడు. దాంతోపనివారు అవసరమయ్యారు.. వంట బాగా వచ్చి వినయంగా ఉండేవారికోసం వెతికాడు పాపయ్యశెట్టి. ఎంతోమంది ఆయనదగ్గర పనిచేసేందుకు ఉత్సాహపడ్డారు... కానీ సురుచు, సుమతి అనే వారిని మాత్రమే ఎంచుకున్నాడాయన.
ప్రతిరోజూ ఉదయాన్నే వచ్చి మధ్యాహ్నం వరకు రకరకాల మిఠాయిలు చేసి వెళుతుండేవారు. వారి క్రమశిక్షణ, వంటలో నైపుణ్యం పాపయ్యశెట్టికి తెగ నచ్చాయి. నమ్మకమైనవారు, పనిమంతులు దొరికారని ఎంతో సంతోషించారాయన. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. తను ఇస్తోన్న వెచ్చాలకు, తయారవుతున్న మిఠాయిలకు పొంతన కుదరడంలేదు. ఒక్కోరోజు ఒక్కో మిఠాయి పరిమాణం తగ్గిపోతోంది. ఈ విషయాన్ని పసిగట్టిన పాపయ్యశెట్టికి ఏం చేయాలో పాలుపోలేదు. ఇద్దరిలో మిఠాయిదొంగ ఎవరో గుర్తించలేకపోయాడు. ఎంత జాగ్రత్తగా పరిశీలించినా లాభం లేకపోయింది! ఇరువురిలో ఒకరు లిప్తపాటు సమయంలోనే నేతిమిఠాయిల్ని చప్పరించేస్తున్నారని ఊహించాడు.
దొంగను ఏవిధంగా కనిపెట్టాలో అర్థం కాలేదు. తనకొచ్చిన సమస్యను ఆ రోజే గురుకులం నించి ఇంటికొచ్చిన కుమారుడు వసంతుడికి చెప్పాడు. కాసేపు తీక్షణంగా ఆలోచించిన వసంతుడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. దానిని తండ్రి చెవిలో ఊదాడు.
ఆ ఆలోచనను మరుసటిరోజే అమలుచేశాడు పాపయ్యశెట్టి. మధ్యాహ్నం వరకు పనిచేసి ఇంటికి పోయేముందు సురిచి, సుమతి లను ఆపి," ఈ రోజు మా ఇంట్లో చిన్నవేడుక జరిగింది. విందు ఏర్పాటు చేశాం, మీరు తప్పక భోంచేసి వెళ్ళాలి." అన్నాడు. ఇద్దరూ ’సరే’ నంటూ తలలూపారు. శెట్టి గారి కుటుంబసభ్యులతో కలిసి ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. పలురకాల వంటలతో షడ్రసోపేతమైన విందు వడ్డించబడింది. పనిచేసి బాగా అలిసిపోయిన సుమతి ఆవురావురుమంటూ తినసాగాడు. సురిచి మాత్రం మెల్లగా తింటున్నాడు. అప్పటికే అతని పొట్ట సగంపైగా మిఠాయిలతో నిండిఉండండంతో విందు రుచించడంలేదు. సుమతి మాత్రం మళ్ళీ మళ్ళీ వడ్డించుకుని తిని ’బ్రేవ్’ మని త్రేన్చాడు. సురుచి విస్తరిలోని పదార్ధాల్లో సగం మాత్రమే తినగలిగాడు.
పాపయ్యశెట్టి, వసంతుదు భోంచేస్తూ వారిద్దరినీ ఓరకంట పరిశీలించారు. మిఠాయిదొంగ ఎవరో అర్థమైపోయింది. క్రమశిక్షణ లేని సురుచి తన జిహ్వచాపల్యానికి తగిన మూల్యం చెల్లించాడు. శెట్టి అతణ్ణి పని మాన్పించాడు.
తెలివైన సలహా ఇచ్చినందుకు వసంతుడు తండ్రి దగ్గరినించి అభినందనలు అందుకున్నాడు.

14, ఏప్రిల్ 2010, బుధవారం

పిల్లి ఇక్కట్లు



పూర్వం పిల్లి తన సోదరుడు పులితో కలిసి అడవిలోనే ఉండేది. పులి తను వేటాడి తెచ్చిన ఆహారంలో పిల్లికి వాటా ఇస్తుండేది. జీవితం సాఫీగా గడిచిపోతున్నా... సోమరితనం పెరుగుతోందనే భావన, ఇతరులపై ఆధారపడుతున్నాననే ఆత్మన్యూనత పిల్లిని బాధిస్తూఉండేవి. దాని పరిస్థితి ఇలా ఉంటే ఊర్లోని మనిషి స్థితి మరోరకంగా ఉంది. ఎలుకలు విపరీతంగా పెరిగి ఒక్క గింజ కూడా మిగల్చకుండా పంటను తినేస్తున్నాయి. వాటి దెబ్బకు పస్తులు ఉండాల్సివస్తోంది. ఎలుకలను పట్టేందుకు ఊర్లోని ఏ జంతువూ సుముఖంగా లేవు. ఎందుకంటే ఎలుకలు వాటికి వాటా ఇస్తున్నాయి మరి!
కొత్త జంతువు నొకదాన్ని తెచ్చి ఎలుకల అంతు చూడాలని నిర్ణయించుకున్నాడు మనిషి. ఆ పని కొరకు అడవిలోకి వెళ్ళాడు. కోతి, కొండముచ్చు, ఎలుగు, పాము, నెమలి, .. ఇలా ఎన్నో తారసపడ్డాయి. వాటిలో కొన్ని ఊర్లోకి రావడానికి సుముఖత చూపలేదు. వస్తామన్న వాటి మాటతీరు, ప్రవర్తన మనిషికి నచ్చలేదు. దట్టమైన అడవిలోకి వెళ్ళాడు. సంభాషిస్తూ వస్తోన్న పులి, పిల్లి ఎదురయ్యాయి. ఆ రెండింటినీ గ్రామానికి ఆహ్వానించాడు మనిషి. " రాజులా బ్రతుకుతున్న నన్ను కాపలాకుక్కగా మారుద్దామనుకుంటున్నావా? నీ అంతు చూస్తా, ఇక్కణ్ణించి మర్యాదగా వెళ్ళిపో" అని పులి గాండ్రించింది.
పిల్లి మాత్రం, " అన్నయ్యా.. అడవిలోనే ఉండి విసుగు పుట్టింది, కొంతకాలం అతనితో ఉండి వస్తా..." అని పులిని బ్రతిమాలింది. పులికి కూడా పిల్లి వెళ్తాననడం ఆనందం కలిగించేదే! ప్రతిరోజూ దానికి ఆహారంలో వాటా ఇవ్వాల్సిరావడం ఇబ్బందిగా ఉంది. మనసులో సంతోషంగా ఉన్నా పైకి బాధ నటిస్తూ, " నీ కోరికను కాదనడం భావ్యం కాదు. కానీ, నువ్వు కొంతకాలమే అక్కడ గడిపి తిరిగి రావాలి. అలా అని నాకు మాటివ్వు..." అని చేయి చాపింది.
పులి నుంచి సెలవు తీసుకున్న పిల్లి మనిషి వెంట దారితీసింది. దారిలో తన నివాసం, ఆహారం, ఇతర స్థితిగతులు గురించి ఆరాతీసింది. " నీకెలాంటి లోటు రాదు, నిన్ను మా కుటుంబసభ్యునిగా చూసుకుంటాము. ఇష్టమైనన్ని ఎలుకలు తినొచ్చు, వాటిని తిని మొహం మొత్తినప్పుడు చక్కగా పాలు, పెరుగును ఆస్వాదించొచ్చు. ఈ అడవిలో బిక్కుబిక్కుమంటూ ఉండడం కంటే మా ప్రేమాభిమానాల మధ్య ఉండడం నీకెంతో సంతోషానిస్తుంది. నువ్వే చూస్తావుగా మ అతిథిమర్యాదలు?" అంటూ మనిషి దాని అనుమానాలు పటాపంచలు చేశాడు.
ఊరికి చేరిన పిల్లి ఎలుకల వేటలో నిమగ్నమయ్యింది. కడుపునిండా ఆహారం, కంటి నిండా నిద్రతో చాలా సంతోషంగా ఉంది. మధ్య మధ్యలో మనిషి ఇస్తోన్న పాలు, పెరుగు అమిత సంతృప్తిని కలిగిస్తున్నాయి.
కొంత కాలం గడిచింది. ఎలుకల సంఖ్య బాగా తగ్గింది. గాదెల నిండా ధాన్యంతో మనిషి సంతోషంగా ఉన్నాడు. పిల్లికి వేటలో ఎలుకలు సమృద్ధిగా దొరకడం లేదు, దాంతో రోజూ మనిషి దానికి పాలు, పెరుగు పెట్టాల్సివస్తోంది. అది అతనికి ఇబ్బందిగా మారింది. అవసరం తీరాక అనవసరపు ఖర్చు అనుకున్నాడు. ఒక రాత్రి పూట పిల్లిని వీధిలోకి గిరాటేశాడు.
పాపం.. అది నిర్ఘాంతపోయింది. మనిషి చేసిన అవమానం తీవ్ర వేదనను మిగిల్చింది. తిరిగి అడవికి వెళదామంటే మనసొప్పలేదు. అడవిలోని జంతువులు గేలి చేస్తాయని భయపడింది. కష్టమో, నష్టమో ఊర్లోనే ఉండి బ్రతకాలని నిర్ణయించుకుంది. ఇక అది మొదలు..... ఆహారానికై నిరంతరం కష్టపడుతూనే ఉందది. అడపాదడపా దొరికే ఎలుకలను విందుభోజనంలా తింటూ.. పాలు, పెరుగుకై రోజూ ఏదో ఒక ఇంట్లో దూరడం ప్రారంభించింది. మనిషి జాలి పడితే ఆహారం, కోపగిస్తే కర్రదెబ్బలు దొరుకుతున్నాయి దానికి.
బ్రతుకు దినదినగండమై, కృశించి పులి లాంటి దాని శరీర పరిమాణం నేడు మనం చూస్తోన్న స్థితికి చేరింది. ఈ దీనావస్థ నుంచి దానికి విముక్తి ఎప్పుడో?

7, ఏప్రిల్ 2010, బుధవారం

సెలవుల్లో ఇలా చేయొచ్చు




ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల కాగితాలు వినియోగమవుతున్నాయి. వాడిన అనంతరం వీటిలో చాలా వరకు చెత్తబుట్టలో చేరేవే! చెత్తలో చేరిన ఈ కాగితాల్లో ఓ పది శాతం మాత్రమే పునర్వినియోగమవుతున్నాయి. మిగిలినవి కుళ్ళిపోవడమో, దహనం కావడమో జరుగుతోంది. కాగితం తయారీ ఎంతో శ్రమతో కూడుకున్నది. కలప, నీరు ఎంతో అవసరమవుతాయి. ఒక కాగితం తయారీకి రెండు గ్లాసుల నీరు అవసరం. మనం ఒక కాగితాన్ని నిర్లక్ష్యంగా చించి వీధిలో పడేశామంటే చెట్టు కొమ్మను నరికినట్లే! పర్యావరణ పరంగా ఇంతటి కీలక ప్రాధాన్యత కలిగి ఉన్న కాగిత వినియోగానికి సంబంధించి ఈ సెలవుల్లో చేయగలిగే ఒక కృత్యాన్ని చూద్దాం.
దినపత్రికలు, పాత నోట్ పుస్తకాల లాంటి వాటిని సేకరించే వారికి అమ్ముతాం. కానీ చినిగిన కాగితాలు, ఉత్తరాల కవర్లు ( ఎన్వలప్స్) , ఆహ్వానపత్రికలు... లాంటి వాటిని మాత్రం చెత్తలో కలిపేస్తాం. వీటిని వృధాగా పడేయకుండా పునర్వినియోగం (రీ సైకిల్) చేయొచ్చు. పాస్టిక్ పూత లేని ఇలాంటి కాగితాలను తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించాలి. పాత్ర లేదా బకెట్ తీసుకుని తగినంత నీరు పోసి అందులో ఈ ముక్కలను ఒక రోజంతా నానబెట్టాలి. మరుసటిరోజు గమనిస్తే కాగితం ముక్కలన్నీ అతి చిన్న భాగాలుగా విడిపోయి ఉంటాయి. వాటినన్నిటిని చేత్తో బాగా పిసికి గుజ్జు తయారు చేయాలి. ఇక్కడ మనకో సాధనం అవసరమవుతుంది. అది చతురస్ర లేదా దీర్ఘచతురస్రకారంలో ఉన్న ఇనుపజాలీ ( వైర్ మెష్) అది మన లాంగ్ నోట్ బుక్ కంటే కాస్త పెద్దదిగా ఉండి చుట్టూ ఇనుపబద్దీ అంచు కలిగిఉండాలి. దానిని నేలపై పెట్టి కాగితపు గుజ్జును సమంగా, కాస్త మందంగా పూయాలి. నీరంతా మెల్లగా కారిపోతుంది. మిగిలిపోయిన కొద్దిపాటి నీటిని తీసివేసేందుకు దానిపై పాత వార్తాపత్రిక గాని, గుడ్డకాని ఉంచి ఒత్తాలి.
తర్వాత ఆ ఇనుపజాలీని ఎండలోకి తీసుకెళ్ళి బోర్లించి మెల్లగా కాగితపుగుజ్జును వేరు చేయాలి. మిగిలిన నీరంతా ఆవిరయ్యేంతవరకూ ఆరబెట్టాలి. ఆరిపోయేటప్పుడు అంచులు ముడుచుకోకుండా వాటిపై తగిన భారాలనుంచాలి. ఈ విధంగా పూర్తిగా నీరంతా పోయాక పునర్వినియోగ కాగితం మనకు లభిస్తుంది. గుజ్జు చేసేటప్పుడే రంగులు కాని, ఎండిన ఆకులు-పూల రెమ్మల లాంటివి వేస్తే మరింత ఆకర్షణీయంగా తయారవుతుంది. గట్టిదనం కోసం గుజ్జులో సహజమైన జిగురు( వేప, తుమ్మ జిగురు లాంటివి) ను కలుపవచ్చు. దీనిపై నచ్చిన చిత్రాన్ని వేసో, అతికించుకునో గోడకు తగిలించుకోవచ్చు. కాస్త కళాత్మకంగా వ్యవహరించి ఫోటో ఫ్రేమ్స్, గ్రీటింగ్స్ కార్డ్స్,... లాంటివి తయారుచేయొచ్చు. పెన్సిల్ ను నునుపు చేయగా వచ్చే పొట్టును కూడా వాటిపై అందంగా అతికించుకుని కళాఖండంలా మార్చవచ్చు.
ఒక్కసారి చేసి చూడండి, అది మనకెంత సంతృప్తినిస్తుందో! ఇలాంటి కృత్యాల ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు చేసినవారవుతారు. మీరు తయారుచేసినవి పలువురికి స్పూర్తినిస్తే మరింత మేలు జరుగుతుంది. కొన్ని కంపెనీలు తమ ప్యాకేజింగ్ లో పునర్వినియోగ కాగితాలను వాడుతున్నాయి. అలాంటి వాటిని గమనించండి. అలాగే పలురకాల ఆకారాల్లోకి పునర్వినియోగ కాగితాన్ని మలిచేందుకు ప్రయత్నించండి.

25, మార్చి 2010, గురువారం

చీమల తెలివి



ఒక చీమల కుటుంబం తమ పుట్టలోపల సంభాషిస్తూ భోజనం చేస్తున్నాయి. హటాత్తుగా ఒక ఎలుక వాటి నివాసం లోకి వచ్చింది. చీమలు సంభాషణ ఆపాయి. అనుమతి లేకుండా వచ్చినందుకు కోపంగా ఉన్నా, అతిథి ధర్మాన్ని పాటించి " అన్నయ్యా... ఇలా చెప్పాపెట్టకుండా వచ్చావేమిటి? కాస్త కబురందించినా నీకొరకు ప్రత్యేకవంట చేసేవారం కదా! అయినా నీ మర్యాదకు లోటేం లేదులే... భోంచేద్దువురా..." అని ఆప్యాయంగా పిలిచియాయవి.
ధాన్యం మేసేటప్పుడు రైతు గమనించి తరిమితే పారిపోతూ పుట్టలోకి దూరిందా ఎలుక! కానీ, ఆ విషయాలేమీ చెప్పకుండా, "పర్లేదులే.... మీరెలాఉన్నారో చూద్దామనే వచ్చాను. మీరంతా క్షేమంగానే ఉన్నారు కదా?" అని కుశల ప్రశ్నలు వేసింది. అలా మాట్లాడుతూనే భోజనానికి కూర్చుంది. చీమలు బియ్యం పాయసం, గోధుమ రొట్టెలు, పెసరపప్పు వడ్డించాయి. ఆ పదార్ధాలు చూసి ఎలుక మతిపోయింది. తను ఏనాడూ అలాంటివి తినలేదు. ఏవో నాలుగు గింజలు తినడం, నీళ్ళతో నోరు తడుపుకోవడమే తనకు తెలుసు. చీమల వైభోగానికి కళ్ళుకుట్టాయి. చుట్టూ పరికించి చూసింది. రకరకాల గదులుగా ఉంది నివాసం. ఓ మూలన సేకరించిన ధాన్యపుగింజలు, పప్పులు, పంచదార పలుకులు రాశులుగా పోసి ఉన్నాయి. అదంతా చూడగానే ఎలుకకు గుడ్డపేలికలు, ధాన్యపు నూక , తవుడు నిండి ఉండే తన నివాసం గుర్తొచ్చింది.
చీమల నివాసాన్ని స్వంతం చేసుకోవాలనే దుర్బుద్ధి పుట్టింది. చేతులు కడుక్కుంటూ, " మీ ఆతిథ్యం ఎంతో నచ్చింది. అయితే ఇంత పెద్ద నివాసం మీకు అనవసరం. నాలాంటి పెద్దమనుషులు ఉండడానికి తగినదిది. వెంటనే మీరంతా ఈ చోటును ఖాళీ చేసి ఇంకో తావు వెతుక్కోండి." మెల్లగా చెప్పినా దాని కంఠంలో అహంకారం ధ్వనించింది.
యువచీమలకు ఆ మాటలు ఆగ్రహాన్ని తెప్పించాయి. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే దుష్టులను వదలకూడదనుకున్నాయి. సర్పాలలాంటివే తమ దెబ్బకు తోక ముడిచిన సంఘటనలు జ్ఞప్తికొచ్చాయి. ఎలుకపై దాడి చేయాలనుకుంటున్న వాటి ఆలోచనను వృద్ధచీమలు పసిగట్టి, ఓర్పుతో ఉండాలని సూచించాయి.
అన్నిటికంటే పెద్దచీమ మాట్లాడుతూ, "నువ్వుంటానంటే వెంటనే ఖాళీ చేయకుండా ఉంటామా? నీ కంటే ఆప్తులు ఎవరున్నారు?! అయితే ఒక్కమాట... ఇక్కడికి అతిదగ్గరలోనే మా పాత నివాసమొకటుంది, దానిని కూడా చూడు. ఈ రెండింటిలో నీకేది నచ్చితే దానిలో ఉందువు, మిగిలిన దాంట్లో మేముంటాం" అని వినయంగా చెప్పింది. దాని ఉపాయమేంటో తెలిసిన మిగిలిన చీమలు నిశ్శబ్దమయ్యాయి.
చీమల వినయం ఎలుకకు ముచ్చటగాఉంది. బలవంతం చేయకుండానే ఒప్పుకున్నందుకు సంతోషంగా ఉంది. " అలాగా... అది ఎక్కడుందో చూపండి.." గర్వంగా నవ్వుతూ అడిగింది. చీమలన్నీ బయటికి వచ్చి కొంతదూరం నడిచి కనుచూపుమేరలో కనబడుతున్న ఒక పుట్టను చూపాయి.
’ నువ్వైతే వేగంగా వెళ్ళిరాగలవు. ఒక్కడివే వెళ్ళి చూసి వచ్చి నిర్ణయం చెప్పు.’ అని ఎలుకను సాగనంపాయి.
ఆత్రుతతో పరుగు పరుగున వెళ్ళి పుట్టలోకి దూరింది ఎలుక. లోపల నిశ్శబ్దంగా ఉంది. కళ్ళు కాస్త చీకటికి అలవాటు పడ్డాక తేరిపారా చూసిన ఎలుక గుండె గుభేల్మంది. ఓ మూల నిద్రిస్తోన్న త్రాచుపాము కనిపించింది. కంగారులో వచ్చిన దారిని మరచిన ఎలుక అటూ ఇటూ పరుగులు పెట్టింది. ఆ చప్పుడుకు లేచిన త్రాచుకు ఎలుకను చూడగానే ఆకలి ముంచుకొచ్చింది. పడగ విప్పి ఎలుకపై దూకింది. అదృష్టవశాత్తు.... వచ్చినదారి అప్పుడే కనిపించి ఎలుకపరుగందుకుంది. అయితే దాని తోక మాత్రం పాము నోటికి చిక్కి తెగిపోయింది. ’తోక పోతే పోయింది, ప్రాణం మిగిలింది’ అనుకుంటూ పరుగు ఆపకుండా తన నివాసానికి వచ్చింది ఎలుక.
ఇంకెన్నడూ చీమలవైపు కన్నెత్తి చూడలేదు. తనకంటే చిన్నవాటి పట్ల చులకనభావాన్ని ప్రదర్శించలేదు.