14, ఏప్రిల్ 2010, బుధవారం

పిల్లి ఇక్కట్లు



పూర్వం పిల్లి తన సోదరుడు పులితో కలిసి అడవిలోనే ఉండేది. పులి తను వేటాడి తెచ్చిన ఆహారంలో పిల్లికి వాటా ఇస్తుండేది. జీవితం సాఫీగా గడిచిపోతున్నా... సోమరితనం పెరుగుతోందనే భావన, ఇతరులపై ఆధారపడుతున్నాననే ఆత్మన్యూనత పిల్లిని బాధిస్తూఉండేవి. దాని పరిస్థితి ఇలా ఉంటే ఊర్లోని మనిషి స్థితి మరోరకంగా ఉంది. ఎలుకలు విపరీతంగా పెరిగి ఒక్క గింజ కూడా మిగల్చకుండా పంటను తినేస్తున్నాయి. వాటి దెబ్బకు పస్తులు ఉండాల్సివస్తోంది. ఎలుకలను పట్టేందుకు ఊర్లోని ఏ జంతువూ సుముఖంగా లేవు. ఎందుకంటే ఎలుకలు వాటికి వాటా ఇస్తున్నాయి మరి!
కొత్త జంతువు నొకదాన్ని తెచ్చి ఎలుకల అంతు చూడాలని నిర్ణయించుకున్నాడు మనిషి. ఆ పని కొరకు అడవిలోకి వెళ్ళాడు. కోతి, కొండముచ్చు, ఎలుగు, పాము, నెమలి, .. ఇలా ఎన్నో తారసపడ్డాయి. వాటిలో కొన్ని ఊర్లోకి రావడానికి సుముఖత చూపలేదు. వస్తామన్న వాటి మాటతీరు, ప్రవర్తన మనిషికి నచ్చలేదు. దట్టమైన అడవిలోకి వెళ్ళాడు. సంభాషిస్తూ వస్తోన్న పులి, పిల్లి ఎదురయ్యాయి. ఆ రెండింటినీ గ్రామానికి ఆహ్వానించాడు మనిషి. " రాజులా బ్రతుకుతున్న నన్ను కాపలాకుక్కగా మారుద్దామనుకుంటున్నావా? నీ అంతు చూస్తా, ఇక్కణ్ణించి మర్యాదగా వెళ్ళిపో" అని పులి గాండ్రించింది.
పిల్లి మాత్రం, " అన్నయ్యా.. అడవిలోనే ఉండి విసుగు పుట్టింది, కొంతకాలం అతనితో ఉండి వస్తా..." అని పులిని బ్రతిమాలింది. పులికి కూడా పిల్లి వెళ్తాననడం ఆనందం కలిగించేదే! ప్రతిరోజూ దానికి ఆహారంలో వాటా ఇవ్వాల్సిరావడం ఇబ్బందిగా ఉంది. మనసులో సంతోషంగా ఉన్నా పైకి బాధ నటిస్తూ, " నీ కోరికను కాదనడం భావ్యం కాదు. కానీ, నువ్వు కొంతకాలమే అక్కడ గడిపి తిరిగి రావాలి. అలా అని నాకు మాటివ్వు..." అని చేయి చాపింది.
పులి నుంచి సెలవు తీసుకున్న పిల్లి మనిషి వెంట దారితీసింది. దారిలో తన నివాసం, ఆహారం, ఇతర స్థితిగతులు గురించి ఆరాతీసింది. " నీకెలాంటి లోటు రాదు, నిన్ను మా కుటుంబసభ్యునిగా చూసుకుంటాము. ఇష్టమైనన్ని ఎలుకలు తినొచ్చు, వాటిని తిని మొహం మొత్తినప్పుడు చక్కగా పాలు, పెరుగును ఆస్వాదించొచ్చు. ఈ అడవిలో బిక్కుబిక్కుమంటూ ఉండడం కంటే మా ప్రేమాభిమానాల మధ్య ఉండడం నీకెంతో సంతోషానిస్తుంది. నువ్వే చూస్తావుగా మ అతిథిమర్యాదలు?" అంటూ మనిషి దాని అనుమానాలు పటాపంచలు చేశాడు.
ఊరికి చేరిన పిల్లి ఎలుకల వేటలో నిమగ్నమయ్యింది. కడుపునిండా ఆహారం, కంటి నిండా నిద్రతో చాలా సంతోషంగా ఉంది. మధ్య మధ్యలో మనిషి ఇస్తోన్న పాలు, పెరుగు అమిత సంతృప్తిని కలిగిస్తున్నాయి.
కొంత కాలం గడిచింది. ఎలుకల సంఖ్య బాగా తగ్గింది. గాదెల నిండా ధాన్యంతో మనిషి సంతోషంగా ఉన్నాడు. పిల్లికి వేటలో ఎలుకలు సమృద్ధిగా దొరకడం లేదు, దాంతో రోజూ మనిషి దానికి పాలు, పెరుగు పెట్టాల్సివస్తోంది. అది అతనికి ఇబ్బందిగా మారింది. అవసరం తీరాక అనవసరపు ఖర్చు అనుకున్నాడు. ఒక రాత్రి పూట పిల్లిని వీధిలోకి గిరాటేశాడు.
పాపం.. అది నిర్ఘాంతపోయింది. మనిషి చేసిన అవమానం తీవ్ర వేదనను మిగిల్చింది. తిరిగి అడవికి వెళదామంటే మనసొప్పలేదు. అడవిలోని జంతువులు గేలి చేస్తాయని భయపడింది. కష్టమో, నష్టమో ఊర్లోనే ఉండి బ్రతకాలని నిర్ణయించుకుంది. ఇక అది మొదలు..... ఆహారానికై నిరంతరం కష్టపడుతూనే ఉందది. అడపాదడపా దొరికే ఎలుకలను విందుభోజనంలా తింటూ.. పాలు, పెరుగుకై రోజూ ఏదో ఒక ఇంట్లో దూరడం ప్రారంభించింది. మనిషి జాలి పడితే ఆహారం, కోపగిస్తే కర్రదెబ్బలు దొరుకుతున్నాయి దానికి.
బ్రతుకు దినదినగండమై, కృశించి పులి లాంటి దాని శరీర పరిమాణం నేడు మనం చూస్తోన్న స్థితికి చేరింది. ఈ దీనావస్థ నుంచి దానికి విముక్తి ఎప్పుడో?

7, ఏప్రిల్ 2010, బుధవారం

సెలవుల్లో ఇలా చేయొచ్చు




ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల కాగితాలు వినియోగమవుతున్నాయి. వాడిన అనంతరం వీటిలో చాలా వరకు చెత్తబుట్టలో చేరేవే! చెత్తలో చేరిన ఈ కాగితాల్లో ఓ పది శాతం మాత్రమే పునర్వినియోగమవుతున్నాయి. మిగిలినవి కుళ్ళిపోవడమో, దహనం కావడమో జరుగుతోంది. కాగితం తయారీ ఎంతో శ్రమతో కూడుకున్నది. కలప, నీరు ఎంతో అవసరమవుతాయి. ఒక కాగితం తయారీకి రెండు గ్లాసుల నీరు అవసరం. మనం ఒక కాగితాన్ని నిర్లక్ష్యంగా చించి వీధిలో పడేశామంటే చెట్టు కొమ్మను నరికినట్లే! పర్యావరణ పరంగా ఇంతటి కీలక ప్రాధాన్యత కలిగి ఉన్న కాగిత వినియోగానికి సంబంధించి ఈ సెలవుల్లో చేయగలిగే ఒక కృత్యాన్ని చూద్దాం.
దినపత్రికలు, పాత నోట్ పుస్తకాల లాంటి వాటిని సేకరించే వారికి అమ్ముతాం. కానీ చినిగిన కాగితాలు, ఉత్తరాల కవర్లు ( ఎన్వలప్స్) , ఆహ్వానపత్రికలు... లాంటి వాటిని మాత్రం చెత్తలో కలిపేస్తాం. వీటిని వృధాగా పడేయకుండా పునర్వినియోగం (రీ సైకిల్) చేయొచ్చు. పాస్టిక్ పూత లేని ఇలాంటి కాగితాలను తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించాలి. పాత్ర లేదా బకెట్ తీసుకుని తగినంత నీరు పోసి అందులో ఈ ముక్కలను ఒక రోజంతా నానబెట్టాలి. మరుసటిరోజు గమనిస్తే కాగితం ముక్కలన్నీ అతి చిన్న భాగాలుగా విడిపోయి ఉంటాయి. వాటినన్నిటిని చేత్తో బాగా పిసికి గుజ్జు తయారు చేయాలి. ఇక్కడ మనకో సాధనం అవసరమవుతుంది. అది చతురస్ర లేదా దీర్ఘచతురస్రకారంలో ఉన్న ఇనుపజాలీ ( వైర్ మెష్) అది మన లాంగ్ నోట్ బుక్ కంటే కాస్త పెద్దదిగా ఉండి చుట్టూ ఇనుపబద్దీ అంచు కలిగిఉండాలి. దానిని నేలపై పెట్టి కాగితపు గుజ్జును సమంగా, కాస్త మందంగా పూయాలి. నీరంతా మెల్లగా కారిపోతుంది. మిగిలిపోయిన కొద్దిపాటి నీటిని తీసివేసేందుకు దానిపై పాత వార్తాపత్రిక గాని, గుడ్డకాని ఉంచి ఒత్తాలి.
తర్వాత ఆ ఇనుపజాలీని ఎండలోకి తీసుకెళ్ళి బోర్లించి మెల్లగా కాగితపుగుజ్జును వేరు చేయాలి. మిగిలిన నీరంతా ఆవిరయ్యేంతవరకూ ఆరబెట్టాలి. ఆరిపోయేటప్పుడు అంచులు ముడుచుకోకుండా వాటిపై తగిన భారాలనుంచాలి. ఈ విధంగా పూర్తిగా నీరంతా పోయాక పునర్వినియోగ కాగితం మనకు లభిస్తుంది. గుజ్జు చేసేటప్పుడే రంగులు కాని, ఎండిన ఆకులు-పూల రెమ్మల లాంటివి వేస్తే మరింత ఆకర్షణీయంగా తయారవుతుంది. గట్టిదనం కోసం గుజ్జులో సహజమైన జిగురు( వేప, తుమ్మ జిగురు లాంటివి) ను కలుపవచ్చు. దీనిపై నచ్చిన చిత్రాన్ని వేసో, అతికించుకునో గోడకు తగిలించుకోవచ్చు. కాస్త కళాత్మకంగా వ్యవహరించి ఫోటో ఫ్రేమ్స్, గ్రీటింగ్స్ కార్డ్స్,... లాంటివి తయారుచేయొచ్చు. పెన్సిల్ ను నునుపు చేయగా వచ్చే పొట్టును కూడా వాటిపై అందంగా అతికించుకుని కళాఖండంలా మార్చవచ్చు.
ఒక్కసారి చేసి చూడండి, అది మనకెంత సంతృప్తినిస్తుందో! ఇలాంటి కృత్యాల ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు చేసినవారవుతారు. మీరు తయారుచేసినవి పలువురికి స్పూర్తినిస్తే మరింత మేలు జరుగుతుంది. కొన్ని కంపెనీలు తమ ప్యాకేజింగ్ లో పునర్వినియోగ కాగితాలను వాడుతున్నాయి. అలాంటి వాటిని గమనించండి. అలాగే పలురకాల ఆకారాల్లోకి పునర్వినియోగ కాగితాన్ని మలిచేందుకు ప్రయత్నించండి.